పరిస్థితుల్ని బట్టి పరిశ్రమ ఎక్కడికైనా వెళ్లొచ్చు!
‘‘సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరంగా, శాశ్వతంగా ఉంటుందని భావించడానికి వీల్లేదు. పరిస్థితుల్ని బట్టి ఎక్కడికైనా తరలివెళ్లొచ్చు’’ అని నిర్మాత డి.సురేశ్‌బాబు సంచలన వాఖ్యలు చేశారు. వెంకటేశ్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సురేశ్ విలేకరులతో ముచ్చటించారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపథ్యంలో సినీపరిశ్రమ స్థితిగతుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు సురేశ్.
వాటిపైనే చిత్రసీమ పయనం ఆధారపడి ఉంది: ప్రతిభావంతులైన యువతరం సినీ పరిశ్రమలోకి వస్తున్న నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో సినీ పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. తెలుగు సినిమా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి కానుంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, వైజాగ్, తడ ప్రాంతాలు సినిమా పరిశ్రమకు నివాసం కానున్నాయి. అయితే... రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు తెలుగు సినిమాకు ప్రకటించే రాయితీలు, సౌకర్యాల కల్పన, చిత్రీకరణ సౌలభ్యాలపైనే... చిత్రసీమ పయనం ఆధారపడి ఉంటుందిఆ మూడు ప్రాంతాల నుంచే ప్రధాన కార్యకలాపాలు: ప్రస్తుతం సినిమాలకు ల్యాబ్‌లతో పని లేదు. డిజిటల్ యుగం వచ్చేసింది.
ల్యాప్‌ట్యాప్‌లోనే ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. కాస్తంత సదుపాయాలు ఏర్పరచుకుంటే... ఇంట్లోనే డబ్బింగ్, రీ-రికార్డింగ్, రికార్డింగ్ చేసుకోవచ్చు. అంతగా అభివృద్ధి చెందింది టెక్నాలజీ. ఈ కారణంగా ఎక్కడ నుంచైనా సినిమాలను నిర్మించవచ్చు. అయితే... సినీ పరిశ్రమ ఎంతగా విస్తరించినా... ప్రధానంగా మద్రాస్, వైజాగ్, హైదరాబాద్‌ల నుంచే కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది. అక్కడ ఈ ఇబ్బందులు లేవు: సినీ నిర్మాణ పరంగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ సౌకర్యాలున్నాయి కానీ... ఐడియాలే లేవు. తెలుగు సినిమా పరిధిలోనే ఆలోచనలు ఉంటున్నాయి. దాన్ని విస్తృతపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అవుడ్డోర్ సీన్స్ తీయడం తలకు మించిన పని. పోలీసులకు డబ్బులు కట్టుకోవాలి. పైగా జనాల తాకిడి. అమలాపురం, పాలకొల్లు, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ బాధలే లేవు.
చక్కగా షూటింగ్ చేసుకోవచ్చు. గోదావరి జిల్లాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ‘ఉయ్యాలా జంపాల’ సినిమా తీసేశాం. అలా విమర్శించడం తగదు: మంచి సినిమాలు తీస్తే డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ తీసుకోవడానికి ముందుకొస్తారు. అంతేకానీ ఏది పడితే అది తీసి, మాకు థియేటర్లు దొరకడం లేదంటే ఎలా? ముందు పంపిణీదారుల నుంచి, థియేటర్ యాజమాన్యం నుంచీ సినిమాపై డిమాండ్‌ను సృష్టించుకోవాలి. ఆ దిశగా ఆలోచించకుండా ‘పరిశ్రమ ఆ నలుగురి చేతుల్లోనే ఉంద’ని విమర్శించడం తగదు. ఇక్కడ మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.
బాలీవుడ్‌లో సైతం కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలే థియేటర్లను నడిపిస్తున్నాయి. చట్టానికి కట్టుబడి ఎలాంటి వ్యాపారం చేసినా తప్పు కాదు. అది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి. ఓ రంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం తేలికైన విషయం కాదు. ఒక్క సురేశ్ ప్రొడక్షన్స్‌కే సినీరంగంలో 50ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి బిజినెస్ చేస్తే తప్పు ఎలా అవుతుంది? ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి.