ఇక్కడ దేవసేన... అక్కడ కావ్యా మహాలింగం
సమ్మర్ ధమాకా
ఆమె కవ్వించగలరు... అవసరమైతే కత్తి పట్టగలరు... రాజుల కథలు, చారిత్రక కథలకు ప్రాణం పోయగలరు. అవును... ఇవాళ గ్లామర్‌కైనా, చరిత్ర చెక్కిన శిల్పానికైనా కేరాఫ్ అడ్రస్... హీరోయిన్ అనుష్క. వృత్తి మీద బోలెడంత కమిట్‌మెంట్ చూపుతూ, పాత్రను మెప్పించడం కోసం ఏ కష్టానికైనా వెనుకాడదు కాబట్టే, ఇప్పుడు ఈ స్వీటీ తెలుగు, తమిళ సినీ దర్శక, నిర్మాతలకు అక్షరాలా స్వీటీ!
వేర్ ఆర్ యూ.. యూ.. యూ...
మొదటి సినిమా ‘సూపర్’ని ఏ ముహూర్తాన అంగీకరించారో కానీ, నిజంగానే అనుష్క కెరీర్ పదకొండేళ్లుగా సూపర్‌గా సాగుతోంది. ఒకవేళ ‘అరుంధతి’ చేయకపోయి ఉంటే.. ఆమె ఇప్పటికీ హీరోల సరసన డ్యుయెట్లు పాడుకునే పాత్రలకే పరిమితమయ్యేవారేమో! ఆ చిత్రంతో కథను తన భుజాల మీద నడిపించగలననీ, శక్తిమంతమైన పాత్రలను అద్భుతంగా చేయగలననీ నిరూపించుకున్నారామె. ఆటోవాలల నుంచి ఆడ ఫ్యాన్స్ వరకూ అందరూ ‘భేష్ జేజెమ్మా’ అన్నారు. ఫలితంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అనుష్క అన్నట్లుగా అయిపోయింది.
అలాగే, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకూ అవకాశాలు దక్కుతున్నాయి. మొత్తానికి ఈ బెంగళూరు బ్యూటీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలో బిజీగా ఉన్నారామె. ఒకటి ‘బాహుబలి -2’, మరొకటి తమిళంలో ‘సింగమ్ 3’. ఈ రెండూ కాక మరో లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది.
ప్రస్తుతం ‘బాహుబలి’ రెండో భాగం, ‘సింగమ్’ మూడో భాగం అయిన ‘ఎస్ 3’ చిత్రాలకు డేట్స్ కేటాయించి బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు అనుష్క. ‘బాహుబలి’ తొలి భాగంలో డీ-గ్లామరైజ్డ్ దేవసేనగా కనిపించిన ఆమె, మలి భాగంలో యువరాణి దేవసేనగా అలరించనున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఆర్‌ఎఫ్‌సీలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ నెల 23 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని భోగట్టా.
ఒకవైపు యువరాణి దేవసేనగా భారీ పాత్రను పోషిస్తున్న అనుష్క ‘ఎస్ 3’లో కావ్యా మహాలింగంగా రెగ్యులర్ గర్ల్‌గా గ్లామర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర ఓ రిలీఫ్ అనాలి. ఎందుకంటే, ఈ మధ్య దేవసేనగా, ‘రుద్రమదేవి’గా, ‘సైజ్ జీరో’లో బొద్దు పాపగా కనిపించిన అనుష్కను రెగ్యులర్ గ్లామరస్ రోల్‌లో చూడాలని ఆమె అభిమానులకు ఉంటుంది. ఆ మాటకొస్తే.. కత్తి తిప్పడాలు, గుర్రపు స్వారీ చేయడాలు.. వంటివన్నీ బాగానే ఉన్నా ఎలాంటి ఒత్తిడీ లేకుండా హాయిగా పాటలు పాడే క్యారెక్టర్ చేయాలని ఉందని ఆ మధ్య అనుష్క అన్నారు. శరీరానికి శ్రమ లేని ఈ పాత్రను ఆమె ఎంజాయ్ చేస్తున్నారనే అనాలి.
‘బాహుబలి 2’ వచ్చే ఏడాది వస్తుంది. ఈలోపే ‘ఎస్ 3’ విడుదలవుతుంది కాబట్టి కావ్యగా అభిమానులను మురిపిస్తారు అనుష్క. వచ్చే ఏడాది యువరాణి దేవసేనగా మెరుస్తారు. ఆ మెరుపు సంగతలా ఉంచితే.. యువరాణిగా అంటే మాటలు కాదు. వేసుకునే బట్టలు, పెట్టుకునే నగలు అన్నీ భారీగానే ఉంటాయ్. కేశాలంకరణ అయితే మెడ మోయలేనంత ఉంటుంది. మేకప్ కూడా భారీయే. మాంచి ఎండల్లో ఇలా తయారవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే బాస్.. అనుష్కను అభినందించాల్సిందే!