సుర్వీన్ చావ్లా
‘‘నా కెరీర్‌లో ఐదుసార్లు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. రెండు సార్లు బాలీవుడ్‌లో మూడుసార్లు సౌత్ ఇండస్ట్రీలో’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు సుర్వీన్. తెలుగులో ‘రాజు మహారాజు’ హిందీలో ‘హమ్ తుమ్ షబానా, అగ్లీ, హేట్ స్టోరీ 2, పార్చడ్, తమిళంలో ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్, పుదియ తిరుప్పంగళ్’ సినిమాల్లో నటించారామె.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి సుర్వీన్ చెబుతూ – ‘‘టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ సినిమాల్లో నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. సౌత్‌లో ఓ చిత్రదర్శకుడు ‘నీ శరీరంలోని ప్రతి భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాను. ఇంకోసారి ఓ నేషనల్ అవార్డు పొందిన దర్శకుడుకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ఆడిషన్‌లో అనవసరమైన డైలాగ్స్ చెప్పించి, ఏదో ఏదో చేయించాడు.
ఆరోగ్యం బాలేదని ముంబై తిరిగొచ్చాను. ‘నీ ఆరోగ్యం బాలేదు కదా. నేను కూడా ముంబై రానా?’ అని ఫోన్ చేసి అడిగించాడు. చాలా చీప్‌గా అనిపించింది. ‘నో థ్యాంక్యూ’ అన్నాను. అతనికి తమిళం తప్ప వేరే భాష రాదు. వేరే అతనితో మాట్లాడించాడు. ‘సినిమాకు చాలా టైమ్ పట్టేలా ఉంది. సార్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అన్నాడు. నేను చాలా అమాయకంగా ‘ఏం ఆపేయాలి’ అని అడిగా. ‘కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అని మళ్లీ రిపీట్ చేశాడు.
‘మీరు రాంగ్ డోర్‌ని తడుతున్నారు. ఒకవేళ మీ సార్ నేను టాలెంటెడ్ అనుకుంటే నేను పని చేయడానికి సిద్ధమే’ అన్నాను. ఆ సినిమా ఇప్పటి వరకూ జరగలేదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో ‘నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను’ అని ఒక దర్శకుడు, ‘నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను’ అని మరొక దర్శకుడు కోరారు. వాళ్ల ఆఫీసుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘నిజానికి నా బరువు 56 మాత్రమే. అయినప్పటికీ ‘లావుగా ఉన్నావు’ అంటూ అదోలా చూసేవాళ్లు’ అని కూడా సుర్వీన్ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment