నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు | Surya and Sai Pallavi and Rakul feature in NGK | Sakshi
Sakshi News home page

నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు

Published Wed, May 29 2019 2:35 AM | Last Updated on Wed, May 29 2019 3:51 AM

 Surya and  Sai Pallavi and Rakul feature in NGK - Sakshi

‘‘నేను శ్రీ రాఘవ అభిమానిని. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలన్నది నా కల. ఆ అవకాశం కోసం 19ఏళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ‘ఎన్‌.జీ.కే’ రూపంలో ఆ అవకాశం దొరికింది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయన చేసి, చూపించిన దాంట్లో మనం ఒక్క శాతం చేసినా చాలు’’ అన్నారు హీరో సూర్య. ‘గజిని, యముడు, సింగం’ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఎన్‌.జీ.కే’ (నంద గోపాల కృష్ణ). ‘7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల ఫేమ్‌ శ్రీరాఘవ దర్శకత్వం వహించారు. రకుల్‌ ప్రీత్‌సింగ్, సాయి పల్లవి కథానాయికలు. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడదల కానుంది. తెలుగులో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కేకే రాధామోహన్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సూర్య పంచుకున్న విశేషాలు...

►శ్రీ రాఘవ వినిపించిన నాలుగు కథల్లో ‘ఎన్‌.జీ.కే’ బాగా నచ్చింది. అందుకే ఈ కథతో ముందుకెళ్లాం. పొలిటికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఏ ఒక్క రాష్ట్రానికీ సంబంధించినది కాదు. ఏ రాష్ట్రంలోని రాజకీయాలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. కానీ, మా సినిమాలో యూనివర్శల్‌ కాన్సెప్ట్‌ ఉంటుంది. మంచి డైలాగులు, ఎమోషన్స్, స్క్రీన్‌ప్లే ఉంటుంది. ముఖ్యంగా క్లయిమాక్స్‌ చాలా బాగుంటుంది. మా కథకి ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతారు.

►వ్యవస్థలో ఎన్నో లోపాలున్నాయి. ప్రతి ఒక్కరూ ఓట్లు వేయడానికి మాత్రం ముందుంటారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రశ్నించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. చదువుకున్నవారు, మేథావులే ఇలా ఆలోచిస్తే ఎలా? వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ఒక సామాన్య యువకుడు రాజకీయ వ్యవస్థపై ఎలాంటి పోరాటం చేశాడు? లోపాల్ని ఎలా సరిదిద్దాడు? అన్నదే ‘ఎన్‌.జీ.కే’ కథ. రియాలిటీకి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చాం.

►రాఘవ ఓ కథని రెడీ చేయటానికి ఏడాది నుంచి ఏడాదిన్నర తీసుకుంటాడు. తనకెవరూ సపోర్టర్స్‌ లేరు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు... ఇలా అన్నీ ఒక్కడే రాసుకుంటాడు. అందుకే అంత టైమ్‌ తీసుకుంటాడు. ‘ఎన్‌.జీ.కే’ కేవలం శ్రీరాఘవ ఫిల్మ్‌. తన సినిమాల్లో పాటలు కూడా రెగ్యులర్‌గా ఉండవు. తనతో పని చేయడం ప్రతిరోజూ ఓ కొత్త అనుభూతి. దర్శకుడు బాలాసార్‌ స్కూల్‌ నుంచి నేను వచ్చాను. దర్శకత్వంలో బాలా, శ్రీరాఘవ ఎవరి శైలి వారిదే. శ్రీరాఘవతో పనిచేస్తున్నప్పుడు బాలా సార్‌తో పనిచేస్తున్న ఫీలింగ్‌ కలిగింది. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ బాగా నటించారు.

►శ్రీరాఘవ ఒక్కోసారి ఏడెనిమిది టేక్‌లు తీస్తారు. ఆ రోజు సన్నివేశం సరిగ్గా రాలేదంటే మరుసటి రోజు కూడా అదే సీన్‌ చేయిస్తారు. అందుకే ఆయన టేక్‌ ఓకే అంటే అదే పెద్ద రిలీఫ్‌గా భావించేవాణ్ణి. ప్రతి రోజూ కొత్త డైరెక్టర్‌లా చేస్తారు. ఈ సినిమా కోసం ఆయన ఎటువంటి రాజకీయ రిఫరెన్సులు తీసుకోలేదు. చాలా పరిశోధించారు. కెమెరాముందు నేను మిమిక్రీ చేయడం లేదు. అందుకే శ్రీరాఘవ చేసి చూపించే ఎమోషన్స్, బాడీ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుని నటించేవాణ్ణి. మా ‘ఎన్‌.జీ.కే’ సినిమాని చూడకుండా నమ్మకంతో తెలుగులో విడుదల చేస్తున్న రాధామోహన్‌ సార్‌కి థ్యాంక్స్‌.

►ఒక్కసారి కథ విన్నాక డైరెక్టర్‌ చెప్పినట్టు చేస్తా. ఎందుకంటే నేను యాక్టర్‌ని.. క్రియేటర్‌ని కాదు. నాకు నచ్చినట్టు కథ, డైలాగులు రాసుకోలేను. అమితాబ్‌ సార్‌ సినిమాల్లో కామెడీ ఉంటుంది. నటనకూ ప్రాధాన్యత ఉంటుంది. నా సినిమాల్లో ఈ రెంటికీ ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటా.

►తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయాలని నాకూ ఉంది. కానీ, కుదరడం లేదు. త్రివిక్రమ్‌గారితో సినిమా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు దర్శకురాలు సుద కొంగరతో (‘గురు’ ఫేమ్‌) సినిమా చేయడం మంచి అనుభూతి.

‘‘మా బ్యానర్‌లో ఇంతవరకు డబ్బింగ్‌ మూవీ రిలీజ్‌ చేయలేదు. కానీ, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలని ‘ఎన్‌.జీ.కే’ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ జగపతిబాబుతో పాటు శ్రీ రాఘవ డైరెక్షన్, యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్‌.. ఇలా బెస్ట్‌ ఆర్టిస్ట్‌లు, బెస్ట్‌ టెక్నీషియన్స్‌తో రూపొందిన సినిమా ఇది. రాజకీయ నేపథ్యంలో మా బ్యానర్‌లో ‘అధినేత’ సినిమా వచ్చింది. అలాగే వేరే బేనర్లలో ‘లీడర్, భరత్‌ అనే నేను’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. పొలిటికల్‌ సబ్జెక్ట్‌ అనేది యూనివర్శల్‌ కాబట్టి తప్పకుండా ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్‌ ఉంటుంది. సూర్య ‘గజిని, యముడు, సింగం’ సినిమాల్లా ‘ఎన్‌.జీ.కే’ కూడా పెద్ద హిట్‌ అవుతుంది.     
– నిర్మాత రాధామోహన్‌

ప్రజల నమ్మకాన్ని జగనన్న నిలబెట్టుకుంటారు
జగనన్నతో (వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి) నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వైఎస్‌ కుటుంబంలోని అనిల్‌ రెడ్డి నా క్లాస్‌మేట్‌. సునీల్‌ రెడ్డి కూడా తెలుసు. అనిల్‌తో ఉన్న స్నేహం కారణంగా రాజకీయాలకు అతీతంగా వైఎస్‌ కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్‌గారు సాధించిన విజయం ఎంతో అద్భుతమైంది. వైఎస్సార్‌ (వైఎస్‌ రాజశేఖర రెడ్డి)గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు ఏపీ పాలిటిక్స్‌ గురించి తెలుసు. ఆయన హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించాక ఆయన తనయుడు జగనన్న చేస్తున్న రాజకీయ పోరాటం గురించి అవగాహన ఉంది. పది సంవత్సరాల నుంచి ప్రజల మధ్యే ఉంటూ ఎంతో కష్టపడ్డారాయన. అన్ని రోజులు పాదయాత్ర చేయడం గ్రేట్‌. పైగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం అంటే ఇంకా గ్రేట్‌.

అందుకే ప్రజలు కూడా భారీ విజయాన్ని అందించి, హిమాలయ పర్వతాలంత బాధ్యతను పెట్టారు. ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ, వాటిని నెరవేర్చుతారు. తక్కువ వయస్సు ఉండి ముఖ్యమంత్రి అయిన వారిలో జగన్‌ అన్న రెండో వార వడం నిజంగా గ్రేట్‌.  కచ్చితంగా ఆయన సీఎంగా సక్సెస్‌ అవుతారు. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. మళ్లీ మళ్లీ ఎన్నో సంవత్సరాలు జగన్‌ అన్న సక్సెస్‌ అవుతారు’’ అన్నారు. ‘‘ఇక ‘యాత్ర 2’ సినిమాలో జగనన్న పాత్ర నేను చేయనున్నాననే వార్తలను నేను కూడా విన్నాను. ‘యాత్ర’కి మంచి టీమ్‌ కుదిరింది. ‘యాత్ర 2’ సినిమా గురించి ఇంతవరకు నన్ను ఎవరూ సంప్రదించలేదు. కథ ఆకట్టుకునే విధంగా ఉంటే కచ్చితంగా చేస్తాను.. అందులో డౌట్‌ లేదు’’ అని స్పష్టం చేశారు సూర్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement