
అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు
న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం జపాన్, అమెరికా దేశాల విదేశాంగ మంత్రులతో త్రైపాక్షిక చర్చలు జరిపారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమా వేశం కోసం న్యూయార్క్ చేరుకున్న సుష్మ వారంపాటు అక్కడే ఉండనున్నారు. అమెరికా, జపాన్‌లతో సమావేశం గురించి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వివరిస్తూ ‘అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు వివాదాలను శాంతంగా పరిష్కరించుకోవాలని మూడు దేశాల మంత్రులు తీర్మానించారు’ అని చెప్పారు.
తీరప్రాంత భద్రత, అనుసంధానత విషయాలపై కూడా వీరు చర్చించారన్నారు. డోక్లాంతోపాటు దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై చైనా దుందుడుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ త్రైపాక్షిక భేటీ జరగడం గమనార్హం. అలాగే ఐరాసలో సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నిర్వహించే సమావేశానికి సుష్మ హాజరవుతారు. అనంతరం ట్యునీషియా, నెదర్లాండ్స్, లత్వియా, బొలీవియా దేశాల విదేశాంగ మంత్రులు, భూటాన్ ప్రధానితో సుష్మ భేటీ అవుతారు. రానున్న రోజుల్లో మరిన్ని దేశాల ప్రధానులు, విదేశాంగ మంత్రులతో ఆమె ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.