సై సైరా... భయ్యా! | Sye Raa Narasimha Reddy Chiranjeevi Exclusive Interview On Sakshi TV | Sakshi
Sakshi News home page

సై సైరా... భయ్యా!

Published Tue, Oct 1 2019 2:13 AM | Last Updated on Tue, Oct 1 2019 12:58 PM

Sye Raa Narasimha Reddy Chiranjeevi Exclusive Interview On Sakshi TV

150 సినిమాల రిలీజులు చూశారు కాబట్టి మీకు రిలీజ్‌లు కొత్త కాదు. అయినా 151వ సినిమా ‘సైరా’ రిలీజ్‌ అంటే ఏమైనా టెన్షన్‌గా ఉందా?
చిరంజీవి: నిజం చెప్పాలంటే ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా అనిపిస్తుంది. ప్రేక్షకులు దీనిని ఎలా ఆదరిస్తారు? మనం అనుకున్నది కాకుండా ఊహించని విధంగా ఏదైనా స్పందిస్తారా? వంటి సంశయాలు ఎప్పుడూ ఉంటాయి. టెన్షన్‌ అనను కానీ ఆత్రుత, ఉద్వేగం వంటి మిక్స్‌డ్‌ ఫీలింగ్స్‌ ఎప్పుడూ ఉంటాయి. కొన్ని సినిమాలకు ‘ఈ సినిమాను కచ్చితంగా ఆదరిస్తారు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. అలా ఈ సినిమాకు అనిపిస్తోంది. ఈ సినిమా కథ చాలా నమ్మకం కలిగించింది. ఆ నమ్మకమే ధైర్యంగా ఉండేలా చేసింది.

గుర్రపు స్వారీలు మీకు అలవాటే. కత్తి యుద్ధాలు మొదటిసారి చేశారు కదా... ఎలా అనిపించింది?
నేనెప్పుడూ కత్తి యుద్ధాలు చేసింది లేదు. భరతనాట్యం నేర్చుకోలేదు. కానీ చూసి, గమనించి చేసేవాణ్ణి. అలా బాగా డ్యాన్స్‌ చేయడం అలవాటైంది. కత్తి యుద్ధాలు, జానపద సినిమాలు చేసింది లేదు. మాస్టర్స్‌ చేసి, చూపించారు. అది చూసి నేర్చుకుని చేసేశాను. కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది.

ఒక్క ఫ్లాప్‌ కెరీర్‌ని నిర్ణయించే వృత్తి మీది. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న మీరేమంటారు?
ఈ వృత్తిలో ఎన్ని ప్లస్సులున్నాయో అన్ని మైనస్సులూ ఉన్నాయి. ఇదే కాదు ఏ ప్రొఫెషన్‌లో అయినా ప్లస్సు, మైనస్సు కచ్చితంగా ఉంటాయి. చాలెంజ్‌లను అధిగమిస్తూ విజయాలు సాధించగలిగితేనే నువ్వు ముందుకు వెళ్లగలుగుతావు. ఇక్కడ సక్సెస్‌ రావాలంటే మనల్ని ముందుకు నడిపించేది కథ. ఆ కథలో కూడా కీలకమైనది ‘ఎమోషన్‌’ అని అంటాను నేను. ఆ ఎమోషన్‌ మిస్‌ అవ్వకుండా తీయగలిగితే సినిమా మీద కచ్చితంగా ధైర్యంగా, నమ్మకంగా ఉండొచ్చు.

నేను కథలు వినేప్పుడు కూడా కామెడీ సీన్లు ఎన్ని ఉన్నాయి? డ్యాన్స్‌లు చేయడానికి స్కోప్‌ ఉందా? అని ఆలోచించను.హృదయాలను కదిలించే ఉద్వేగం ఉందా? లేదా అని చూసుకుంటాను. కంట తడిపెట్టించే సీన్స్‌ కొన్నయినా ఉండాలి. లేకపోతే ఎందుకు చూడాలి? మీరిచ్చే హంగులు అన్ని చోట్లా దొరుకుతున్నాయి. ప్రస్తుతం అందరికీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తోంది. దాన్ని మించి నువ్వు మాకు ఏమి ఇస్తున్నావు? అనే ప్రేక్షకుడి ప్రశ్నకు మన దగ్గర సమాధానం ఉండాలి. ఆ సమాధానం మంచి కథ. ఇక ఎంతోమంది అభిమానులను ఇచ్చిన ఈ వృత్తికి ఎందుకు వచ్చాం అనే ఫీలింగా? నో చాన్స్‌. అది ఎప్పటికీ ఉండదు.

డిజిటల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ఆడియన్స్‌ని డైవర్ట్‌ చేయాలంటే మంచి కథ ఉన్న సినిమాలు ఇవ్వాలన్నారు. డిజిటల్‌ ముందు సినిమా స్కేల్‌ ఏమైనా తగ్గిందంటారా?
ఆ స్కేల్‌ ఇంకా పెరిగిందంటాను. ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నాను. స్మార్ట్‌ఫోన్‌ రూపంలో మన చేతిలోనే ఇంత కంటెంట్‌ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని మించి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనతో కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. నూతన దర్శకులు అలా ఆలోచించబట్టే కొత్త సబ్జెక్ట్‌లు వస్తున్నాయి. ‘అర్జున్‌ రెడ్డి, పెళ్లిచూపులు, కేరాఫ్‌ కంచెరపాలెం’ అన్నీ సక్సెస్‌ అయ్యాయి. డిజిటల్‌ ఎప్పుడూ సినిమాకు పోటీ కాదు. అయితే ది బెస్ట్‌ దిశగా ఆలోచింపజేస్తుంది. బెస్ట్‌ సినిమాలు వచ్చేందుకు స్కోప్‌ ఉండే అవకాశం ఉంది.

ఇప్పటి ఆర్టిస్ట్‌లను చూస్తే ఈర్ష్యగా ఏమైనా అనిపిస్తోందా? మీ టైమ్‌లో యాక్షన్‌లో రిస్క్‌ ఎక్కువ ఉండేది. ఇప్పుడు టెక్నాలజీతో కొంత మేనేజ్‌ చేసే అవకాశం ఉంది కదా?
అలాంటి ఫీలింగ్‌ నాకు ఎప్పుడూ ఉండదు. మీరన్నట్లు ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి. మాకున్నంత రిస్క్‌ ఉండకపోచ్చు. అయితే రిస్క్‌ ఉంది. ప్రతి ఒక్కరూ నిరూపించుకోవడానికి కష్టపడాల్సిందే. అంత కష్టపడి సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు అని టెన్షన్‌ ఉంటుంది. చిన్న చిన్న కంఫర్ట్స్‌ ఉంటే ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఈ మానసిక టెన్షన్‌ అనుభవించాల్సిందే. అది నేనయినా, మా అబ్బాయి రామ్‌చరణ్‌ అయినా.. ఎవరైనా. కష్టం కష్టమే. ఎవ్వరూ రిలాక్స్‌ అవుతూ సుఖంగా మాత్రం పని చేయడానికి కుదరదు.

కొడుకు నిర్మాణంలో తండ్రి సినిమా చేయడం స్పెషల్‌గా ఉంటుంది. మీరు హీరోగా రామ్‌చరణ్‌ డబ్బులు పెట్టి ‘సైరా’ చేయడం గురించి...
(నవ్వుతూ) ఇందులో తన డబ్బు వేరు.. నా డబ్బు వేరు అనే ఆలోచన మాకు లేదు. మేమందరం ఒకే రూఫ్‌ కింద ఉంటున్నాం. కాబట్టి మాకు ఆ తేడాలు లేవు. నాకోసం  ఇలాంటి సినిమా నిర్మించాలనే తన తపనను కచ్చితంగా అభినందిస్తాను. ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు ‘నీకు రెండో సినిమాకే ఓ కాస్ట్యూమ్‌ డ్రామా చేసే అవకాశం వచ్చింది. నాకు ఆ అవకాశం రాలేదు’ అన్నాను. ‘డాడీకి అది తీరని కోరిక. ఇలాంటి సినిమా తీస్తే తన కోరిక నెరవేరుతుంది’ అని తన మనసులో ఉండిపోయింది. అందుకే ‘సైరా’ నిర్మించే అవకాశం నాకు ఇవ్వండి అని అడిగాడు. తనకు తెలుసు ఆ కథ నా దగ్గరే ఉందని. పరుచూరి బ్రదర్స్‌తో మళ్లీ కూర్చొని ఆ కథను బయటకు తీసుకొచ్చాడు. ఆ విధంగా నాకు మిగిలిన కోరికను తను తీర్చాడని చెప్పగలను.

ఇప్పటి నటీనటులకు మీకన్నా రిస్క్‌ తక్కువ అని మాట్లాడుకున్నాం. అయినప్పటికీ రిస్క్‌ అయితే ఉంది. మరి.. ఓ స్టార్‌ కొడుకుకి ఇంత కష్టం అవసరమా? అని చరణ్‌ని సినిమాల్లోకి పంపించేటప్పుడు అనుకోలేదా?
చరణ్‌ సినిమాల్లోకి రావాలనే విషయాన్ని వాళ్ల అమ్మ ద్వారా నాకు తెలియజేశాడు. నన్ను ఆర్టిస్ట్‌గా ఎంతగా గమనిస్తున్నాడు, ఎంతగా ఇష్టపడుతున్నాడో నాకు అప్పటివరకు తెలియదు. డాడీలా నేనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నన్ను గమనించిన విషయం గ్రహించాను. తను వస్తాను అన్నప్పుడు నేను ఒక్కటే చెప్పాను.. ‘నా కొడుకుగా నీకు అన్నీ కేక్‌ వాక్‌ అనుకుంటే కుదరదు. చాలా కష్టపడి పని చేయాలి. నీ కష్టాన్ని గుర్తిస్తారు. అంత ప్రేమను పొందాలంటే కష్టపడాలి. కష్టపడే విషయంలో చరణ్‌కి చెప్పేది లేదు. ఎంత కష్టపడతాడనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ‘మగధీర’ సినిమా చేస్తున్నప్పుడు కాలికి గాయం అయింది. అది జరిగిందనే విషయం వారం వరకూ నాకూ, వాళ్ల అమ్మకు తెలియదు.

ఇంట్లో కుంటుతూ నడుస్తుంటే, ‘ఏమైంది రా కాలికి... చూపించు’ అంటే చూపించాడు. మానుతున్నట్టుగా ఉంది గాయం. ‘మందులు వేసుకుంటున్నాను. ఫర్వాలేదులే’ అన్నాడు. కష్టపడే విషయంలో ఒళ్లు దాచుకోడు ^è రణ్‌. ఒక స్టార్‌ కొడుకుని, గోల్డెన్‌స్పూన్‌తో పుట్టాను అనే ఫీలింగ్‌ ఎక్కడా ఉండదు తనలో. ఎవరైనా బాధల్లో ఉంటే సహాయం చేయడం, హాస్పిటల్‌లో చూపించడం చేస్తుంటాడు. ఇవన్నీ చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదు. దానికి ప్రాచుర్యం కూడా కోరుకోడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరూ ‘ఇంత బాగా చూసుకున్న నిర్మాత ఎవ్వరూ లేరు’ అంటున్నారు.

సినిమాలో పని చేసిన ఎవరినైనా అడగండి ఇదే చెబుతారు. ‘ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి చేసుకున్నాం’ అని కృష్ణానగర్‌లో   ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారని మా మేకప్‌మేన్‌ చెప్పాడు. అది ‘సైరా’ వల్లే. సినిమా షూటింగ్‌లో ప్రతి రోజూ సెట్లో కొన్ని వేలమంది ఉండేవాళ్లు. చాలా మందికి పని దొరికింది. వాళ్లందరి ఆశీస్సులు ఈ సినిమాకు కచ్చితంగా ఉంటాయి. 

దాదాపు 300 కోట్లతో చరణ్‌ ఈ సినిమా నిర్మించారు. తన వెనకాల తండ్రి ఉన్నారనే ధైర్య మేనా?
ఆ ధైర్యమే (నవ్వుతూ). ఇప్పుడు చరణ్‌కి ఉన్నంత రిస్కీ నేచర్‌ నాకు ఉండదు. ఎందుకంటే మా నాన్న మధ్యతరగతి వ్యక్తి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ప్రతీ అడుగు ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి వేస్తాను. అయితే చరణ్‌కి నచ్చితే వెనకాడడు.  దూకేస్తాడు. ఎందుకంటే వాళ్ల నాన్న మెగాస్టార్‌ అనే భరోసా ఉండి ఉండొచ్చు. 300 కోట్లు పెట్టి సినిమా చేసి, పెట్టిన డబ్బులు తిరిగొస్తాయా లేదా? అని ఆలోచించలేదు. మంచి ప్రయత్నం చేశాం అని అనుకుంటున్నాడు. నాకేంటి అనే ధీమా. నేనంత ధీమాగా, ధైర్యంగా ఆలోచించలేను.

చరణ్‌ ‘ధైర్యం’ మీరు. మరి మీ ‘ధైర్యం’ ఏంటి? మీరు యాక్టర్‌గా ఎదుగుతున్న క్రమంలో మీ మానసిక స్థితి ఎలా ఉండేది?
నా ధైర్యం నేనే. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాను? ఎంత సంపాదిస్తున్నాను? ఎంత బ్యాంక్‌ బాలెన్స్‌ ఉంది అని కాకుండా ఎంత సేపటికీ బెస్ట్‌ సినిమాలు ఏం వస్తున్నాయి అని ఆలోచించేవాణ్ణి. ఇక్కడ నిలదొక్కుకోవాలి, మన ం ‘ద బెస్ట్‌’ అనిపించుకోవాలి  అనే  తాపత్రయం  ఎప్పుడూ  ఉండేది. కొందరు పారితోషికం సరిగ్గా ఇచ్చేవారు.. కొందరు ఎగ్గొట్టేవారు. ఎప్పుడూ కూడా నాకు ఇంత కావాలని డిమాండ్‌ చేసింది లేదు. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ చేస్తున్నంతవరకూ కూడా నిర్మాతలకు ఎంత మిగులుతుందని ఆలోచించి, దానికి తగినట్టుగా పారితోషికం తీసుకునేవాణ్ణి. డిమాండ్, కమాండ్‌ చేసిన సందర్భాలు ఎప్పుడూ లేవు. దానివల్ల ‘మంచివాడిలా ఉన్నాడు. ఇతనితో సినిమా చేద్దాం’ అని నిర్మాతలు నా దగ్గరకు వస్తారనుకునేవాడిని. నిర్మాత బతకాలి. తనుంటేనే మనకు బ్రతుకు తెరువు ఉంటుందని ఆలోచించేవాణ్ణి. నాతో సినిమాలు చేసిన నిర్మాతలందరూ ‘మీతో సినిమా చేసిన తర్వాత మాకు ఇంత మిగులుతుందని భరోసా ఉంటుంది’ అన్న సందర్భాలున్నాయి. లైఫ్‌ మొత్తం ప్రతిదీ ఆచి తూచి చేసుకుంటూ వచ్చాను.

టెన్షన్‌తో నిద్రలేని రాత్రులు.. ఏమైపోతాం అనే భయాలు ఉండేవా?
‘ఏమైపోతాం’ అనే భయం ఎప్పుడూ లేదు. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. ‘చాన్స్‌ రావాలే కానీ ఇరగదీస్తాను’ అనే కాన్ఫిడెన్స్‌ ఉండేది. అవకాశం రావాలి అంటే టాలెంట్‌ మాత్రమే సరిపోదు. మన క్యారెక్టర్‌ నచ్చాలి. ‘ఇతనితో సినిమా తీస్తే కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందయ్యా’ అనుకోవాలి. మన ప్రవర్తన కూడా మన ఫ్యూచర్‌ మీద ప్రభావం చూపించే వీలుంది. నా క్యారెక్టర్‌ని, వ్యక్తిగత ప్రవర్తనను, టాలెంట్‌ను బిల్డ్‌ చేసుకుంటూ ముందుకు వెళ్లాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాణ్ని.

ఓకే... ‘సైరా’ చేయకముందు మీకు నచ్చిన దేశం కోసం పోరాడిన వీరుడు ఎవరు? ఇప్పుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత మీ అభిప్రాయం?
మహాత్మా గాంధీ నా ఫేవరెట్‌ హీరో అని ఎప్పుడూ చెబుతుంటాను. మహాత్ముడు గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు అని చదువుకున్నాం. ఆ తర్వాత హీరోయిక్‌గా అనిపించింది భగత్‌సింగ్‌.. ఆజాద్‌ చంద్రశేఖర్‌. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకున్నాక ఆయనలోని తెగువ, మొండితనం, ధైర్యం ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఇంత గొప్ప వీరుడు మన తెలుగు ప్రాంతంలో ఉన్నారా? అని ఆయన మీద అభిమానం పెరిగిపోయింది. ఇప్పుడు నా వీరుల జాబితాలో ఈయన యాడ్‌ అయ్యారు.

మీ మనవళ్లు, మనవరాళ్లతో ఇలాంటి వీరుల కథలు చెబుతారా?
చెప్పాను. మా పెద్ద పాప సుస్మిత అయితే ‘సైరా’లో నాలాంటి కాస్ట్యూమ్స్‌ చిన్నవి తయారు చేయించి వాళ్ల పిల్లలకు వేసి ఫొటోలు తీసింది. వాళ్లు నాతోటి ఫోటోలు దిగారు. మా ప్రొడక్షన్‌ కంపెనీలో సీఎఫ్‌ఓగా పని చేసిన విద్య ఉంది. తను కూడా మా ఇంటి అమ్మాయే. విద్య కొడుకు ఆర్నవ్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన ఒక ఇంగ్లీష్‌ బుక్‌ కొనేశాడు. దాని మీద నాతో ‘సైరా’ అని సంతకం చేయించుకున్నాడు. సినిమా విడుదలయ్యే ముందు నరసింహారెడ్డి గురించి మొత్తం తెలుసుకోవాలని ఆ బుక్‌ మొత్తం కంఠస్థ పట్టాడు కూడా. నా గ్రాండ్‌ చిల్డ్రన్‌ అందరూ నన్ను ‘భయ్యా’ అంటారు. తాతయ్యా అని ఎవరూ పిలవరు. భయ్యా అని నేను పిలవమని చెప్పలేదు (నవ్వుతూ). వాళ్లే పిలుస్తుంటారు. భయ్యా చేస్తున్న సినిమా.. ఒక వారియర్‌ సినిమా.. సూపర్‌ మేన్‌ సినిమా అంట చూద్దాం అని వాళ్లంతా చాలా ఆసక్తిగా ఉన్నారు.

‘సైరా’కి వాడిన నగల విషయంలో సుస్మితకు సలహా ఇచ్చింది సురేఖగారే అని విన్నాం...
అవును. నయనతార, తమన్నా వాళ్లకు సుస్మిత పాత కాలం నగలను డిజైన్‌ చేసింది. ఆమ్రపాలి, మంగత్‌రాయ్‌ వాళ్లతో కలిసి చేసింది. వాళ్ల గురించి చెప్పింది సురేఖే. ఆ నగల్లో తమన్నా, నయనతార కుందనపుబొమ్మలా ఉన్నారు. రెగ్యులర్‌ సినిమాల్లో కనిపించేలా ఈ సినిమాలో ఉండరు.

మీరు సురేఖగారికి కొనిపెట్టిన నగల గురించి?
నేను చాలా కొనిపెట్టాను. ఈ మధ్యన హాలీడేకు వెళ్లాం. మొన్న లాస్ట్‌ బర్త్‌డేకు ఐదు క్యారెట్ల డైమండ్‌ స్టడ్స్‌ ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్‌ అయింది. అయితే సురేఖ సింపుల్‌ ఉమన్‌. ఏదైనా కొనిపెడతానంటే నాకెందుకు? పిల్లలకు కొనిపెడదాం అంటుంది. మరి నువ్వూ అనుభవించాలి కదా అంటుంటాను. ఇక మా రోల్స్‌ రాయల్స్‌ కారు ఎక్కాలంటే నేను ఉండాల్సిందే. ‘మీరు పక్కన ఉన్నప్పుడు ఆ కారులో వెళితే గర్వంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఎక్కితే నాకు అస్సలు ఇష్టం ఉండదు’ అంటుంది. ఆ కారులో తను ఒక్కతే వెళ్లదు. అంత సింపుల్‌.

నిజానికి ఇప్పుడు మీ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకున్నంత ఎక్కువగా అప్పట్లో మీ పిల్లలతో ఆడుకోలేకపోయారు. ఇప్పుడు మీ భార్య సురేఖగారి ఫీలింగ్‌ ఏంటి?
కష్టపడి పైకి వచ్చే రోజుల్లో నిరంతరం షూటింగ్‌లో ఉండి, పిల్లలు ఎలా ఎదిగారో కూడా తెలియలేదు. ఈ మధ్య నేను మా గ్రాండ్‌ చిల్డ్రన్‌తో ఆడుకుంటున్నాను. నేల మీద వాళ్లతో దొర్లుతున్నాను. అలా వాళ్లతో ఆడుకుంటుంటే పక్కనే సురేఖ నన్ను అలా గమనిస్తూ ఉంది. ఏంటి అని కళ్లతోనే అడిగాను. ‘ఏం లేదు.. మన పిల్లలతో మీరు ఎప్పుడు ఇలా ఆడుకున్నారా? అని గుర్తు తెచ్చుకుంటున్నాను. నాకు అస్సలు గుర్తు కూడా రావడం లేదు’ అంది. అదేంటి ‘ఎప్పుడైనా హాలిడేస్‌ అప్పుడు కలసి సరదాగా గడిపేవాళ్లం కదా’ అన్నాను. ‘అది సంవత్సరానికి ఒక్కసారో రెండుసార్లోనే కదా. పండగలకు కూడా మీరు ఉండేవారు కాదు’ అని చెప్పింది. నాకే కాదు ప్రొఫెషనల్‌ లైఫ్‌లో బిజీగా ఉండే ప్రతి ఒక్కరికీ ఇది కామన్‌.

బ్రతుకుతెరువు కోసం కష్టపడే రోజుల్లో పిల్లల ఆలనా పాలనా చూసుకునే తీరిక కూడా ఉండదు. వాళ్లు ఎప్పుడు పెరిగి పెద్దవాళ్లు అయ్యారో కూడా కళ్లారా చూసుకునే వీలుండదు.  నాకు ముగ్గురు పిల్లలుంటే నేను ఇంటికి రాగానే సుస్మిత, చరణ్‌ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లు. వాళ్లను దగ్గరకు తీసుకొని ముద్దు చేసేవాణ్ని. ఆ తర్వాత మేడపైకి వెళ్లిపోతుంటే సురేఖ ‘ఏవండీ.. ఒక్క నిమిషం మీకు మూడో పాప కూడా ఉంది గుర్తుందా?’ అనేది. ‘సారీ.. సారీ’ అంటూ తన గదిలోకి వెళ్లి శ్రీజను చూసేవాణ్ని. అప్పుడు శ్రీజ నెలల పిల్ల. ఇంకా నడక రాలేదు. దగ్గరకి వచ్చిన ఇద్దరి పిల్లలను ముద్డాడి, మూడో బిడ్డ గురించి మరచిపోయేవాణ్ణి. అంతలా పని చేశాను. అంత పని చేయకపోతే 33 సంవత్సరాల నా సినీ కెరీర్‌లో 150 సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. రోజుకి 2–3 షిఫ్ట్‌లు చేసేవాణ్ణి.

33 ఏళ్లు నాన్‌స్టాప్‌గా పని చేశాక వచ్చిన ఆ గ్యాప్‌ అనేది మీ ఫ్యాన్స్‌కు చాలా బాధగా ఉండి ఉంటుంది. మీకెలా అనిపించేది?
బాస్‌ సినిమాలు రావడం లేదనే ఫీలింగ్‌ వాళ్లకు ఉండి ఉండొచ్చు కానీ ఆ సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సబబే. నేను చేసిన సర్వీస్‌ నాకు తృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే లేకుండా పోవడం? ఎటు వెళ్లాలి? అని అగమ్యగోచరంలో ఉండటం సినిమా ఇండస్ట్రీ నన్ను వెల్కమ్‌ చెప్పడంతో మళ్లీ వచ్చేశాను. నన్ను ఎంతగా ప్రేమించారు అని చెప్పడానికి ‘ఖైదీ నంబర్‌ 150’యే నిదర్శనం. రాజకీయాలు చూశాను, సినిమా పరిశ్రమ చూశాను కానీ సినిమా పరిశ్రమలో ఉండే తృప్తిగానీ, నేను పొందిన ఆనందం కానీ రాజకీయాల్లో నాకు రాలేదు. సినిమా పరిశ్రమ చాలా గొప్పది అనే ఫీలింగ్‌ నాకు ఉంది. నీ సంతోషం కోసం నువ్వు సినిమాలు చేసుకుంటూ వెళుతూ నిస్వార్థంగా నిన్ను ఆదరించి, కింగ్‌లాగా చూస్తారు. డెమీగాడ్‌లానూ చూస్తారు. అనుభవపూర్వకంగా తెలుసుకొని చెబుతున్నాను సినిమా పరిశ్రమలాంటిది మరోటి లేదు.

నెక్ట్స్‌ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి?
ఆయన స్టయిల్లో ఉంటుంది. ఆయన స్టయిల్లో నేను చేయడం కొత్తగా ఉంటుంది. లుక్‌ పూర్తిగా సెట్‌ కాలేదు. త్వరలోనే కొరటాల శివగారే ప్రకటిస్తారు. 
ఫైనల్లీ.. ఈ ప్రొఫెషన్‌  మిమ్మల్ని మెగాస్టార్‌ని చేసింది. వేలమంది అభిమానులను ఇచ్చింది. అదే వృత్తి మిమ్మల్ని కడుపు నిండా భోజనం చేయనివ్వలేదు, కంటి నిండా నిద్రపోనివ్వలేదు...వేళకు తినాలని, కడుపు నిండా తినాలని మన శరీరానికి ఆకలి ఎలా ఉంటుందో మన ఆత్మకి కూడా ఒక ఆకలి ఉంటుంది. ఆ సోల్‌కి కావాల్సింది దొరికితే ఫిజికల్‌ హంగ్రీ అనేది అసలు సమస్యే కాదు. అభిమానులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో నా సోల్‌ నిండుగా, సంపూర్ణంగా ఉంది. అందుకని ‘డైట్‌’ చేస్తున్నా ఏమీ అనిపించడంలేదు. ‘ఐయామ్‌ హ్యాపీ’.


‘సైరా’ సినిమా ఎందుకు చూడాలి అంటే తెలియని చరిత్ర కోసం చూడాలి. యువతను ప్రభావితం చేసేలా నరసింహారెడ్డి కథను చూపించగలిగారా?
సురేందర్‌ రెడ్డిని ఈ సినిమాకి డైరెక్టర్‌గా అడిగినప్పుడు కొంచెం టైమ్‌ కావాలన్నాడు. తర్వాత కొన్ని రోజులు టచ్‌లో లేకపోవడంతో ‘చేయకూడదనుకుంటున్నాడా?’ అనిపించింది. అయితే కథతో సహా వచ్చాడు. చాలా అద్భుతంగా అనిపించింది. నరసింహారెడ్డి కథను తను తీసిన విధానం చూసేవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సినిమాలో చిరంజీవిని చూడరు. ఒక పాత్రను చూస్తారు. సినిమాలో ఏం కోరుకుంటారో అవన్నీ ఉండటంతో పాటు ఒక మెసేజ్‌ ఉంటుంది. చాలామందిలో దేశభక్తి క్షీణిస్తున్న ఈ తరుణంలో మన పూర్వీకులు ఎంత సఫర్‌ అయ్యారు? బానిస బతుకు బతికి ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్లందరి ప్రాణత్యాగాల ఫలమే మన స్వాతంత్య్రం అన్నది తెలుసుకోవాలి. వాళ్లందరినీ తలచుకోవాలి. గొప్పగా వాళ్లను స్మరించుకోగలిగితే అదే మనం వాళ్లందరికీ ఇచ్చే నివాళి. అలాంటి ఫీలింగ్‌ కలగాలంటే సినిమాను మించిన పవర్‌ఫుల్‌ మీడియమ్‌ లేదని అనుకుంటా. యువతరం చూడాల్సిన సినిమా.

మీరు పిల్లల్ని బాగా ప్రేమిస్తారు. అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్లు గ్రాండ్‌ చిల్డ్రన్‌ని గ్రాండ్‌గా చూసుకుంటారు కదా...
గత నాలుగు రోజులుగా ‘సైరా’ ప్రమోషన్స్‌ చేస్తూ ఇంట్లో ఉండటం లేదు. మా చిన్నమ్మాయి శ్రీజ చిన్న కూతురికి పది నెలలు. ప్రమోషన్స్‌ అయి, ఇంటికి వెళ్లగానే కేకలు పెట్టేసింది. నన్ను చూసి పాప ఒకటే హుషారుగా ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎత్తుకున్న తర్వాత కొనుక్కున్న కొత్త బొమ్మలను చూపించింది. అంతే.. నాలుగు రోజుల అలసట జస్ట్‌ అరగంటలో దూరం అయిపోయింది. పిల్లలు మన స్ట్రెస్‌ని అంతా ఇట్టే తగ్గించేస్తారు. అందుకే ‘ఐ లవ్‌ చిల్డ్రన్‌’.

చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, మనవరాళ్లు నివృతి, సమారా, సంహిత, మనవడు ఆర్నవ్‌

‘మగధీర’ చూసి ఇలాంటి సినిమా చేయలేకపోయానన్నందుకు చరణ్‌ మీతో ‘సైరా’ తీశారు. ఈ సినిమా చేసినందుకు మీ భార్య సురేఖ ఏమన్నారు?
ఇవాళ (సోమవారం) ఉదయం సురేఖ ఓ మాట అంది. ఈ సినిమా కొన్ని చోట్ల మేమే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం. కొన్ని చోట్ల మంచి బిజినెస్‌ అయింది. ‘మనం డబ్బుల గురించి చూడకూడదు. డబ్బు వస్తుందో రాదో తెలియదు కానీ లైఫ్‌ టైమ్‌లో మీకు గొప్ప పాత్ర ఇది. ఆ తృప్తిని డబ్బుతో కొలవలేం. మీ కోరిక తీర్చాలని రామ్‌ చరణ్‌ ఈ సినిమా చేశాడు. ఆ విధంగా వాడు సంతృప్తిగా ఉంటాడు. గొప్ప పాత్ర చేశాను అనే మీ కోరిక నెరవేరింది. నేను మీతో సినిమా చేయాలనే నా కోరిక నెరవేరింది (సురేఖ సమర్పణలో ‘సైరా’ రూపొందింది)’ అని చెప్పింది. అలా ‘సైరా’ విషయంలో ఇంటిల్లిపాదీ ఆనందంగా ఉన్నాం.

నటుడిగా శరీరానికి విపరీతమైన కష్టాన్ని ఇచ్చేశాం. కొంచెం సుఖపెట్టి ఉండుంటే బావుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?
అస్సలు అనిపించలేదు. నాకు సుఖం అంటేనే ఇష్టం ఉండదు. ఖాళీగా ఉంటే రెస్ట్‌లెస్‌ అయిపోతాను. ఉదాహరణకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేది. కమ్‌ బ్యాక్‌ మూవీ ‘ఖైదీ నంబర్‌ 150’కి మార్నింగ్‌ 7 అంటే 7, 9 అంటే 9కి మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ని. చాలా హ్యాపీగా ఉండేది. ‘పని చేస్తేనే, షూటింగ్‌కి వెళ్తేనే మీరు హ్యాపీగా, హుషారుగా ఉంటారు. ఖాళీగా ఉంటే మాత్రం ఏంటోలా అయిపోతారు’ అని సురేఖ అంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement