తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో సకలకళావల్లభుడు ఎవరంటే టి.రాజేందర్ అనే బదులే వస్తుంది. నటుడు, దర్శకుడు, సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు, గీతరచయిత, గాయకుడు ఇలా పలు విభాగాల్లో నిష్టాతుడైన టీఆర్ గాయకుడిగా తన చిత్రాలకే పాడుకుంటారు. ఆయన పాడాలంటే ఆ పాటలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి.అందుకే ఆయనతో తమ చిత్రాల్లో ఒక్క పాట అయినా పాడించాలని దర్శక నిర్మాతలు కోరుకుంటారు.
అయితే బయట చిత్రాలకు పాడాలంటే ఆ పాట ఆయన మనసును హత్తుకోవాలి. లేదంటే నిక్కచ్చిగా సారీ అని చెప్పేస్తారు. అలాంటిది నవ నటుడు కథానాయకుడిగా నటిస్తున్న కూత్తాన్ చిత్రానికి ఆయన పాట పాడడం విశేషం. నిలగిరీస్ డ్రీమ్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నీలగిరీస్ మురుగన్ నిర్మిస్తున్నారు. వెంకీ.ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్‌కుమార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.
బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీతరచయిత రాఖేష్ రాసిన మాకిస్తా కీంకిస్తా అనే పాటను చిత్ర వర్గాలు టి.రాజేందర్‌తో పాడించాలని భావించారట. దీంతో సంగీత దర్శకుడు బాలాజి టి.రాజేంద్రన్‌ను కలిసి కూత్తన్ చిత్రంలో ఒక పాట పాడాలని కోరగా నో అన్నారట. అనంతరం బాలాజి పాట వినమని కోరగా విన్న టి.రాజేందర్ ఆ పాట ట్యూన్స్ బాగా నచ్చేయడంతో ఈ పాటను ఎవరు పాడినా హిట్ అవుతుందని కితాబిచ్చి తాను పడతానని చెప్పారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ పాటను నృత్యదర్శకుడు అశోక్‌రాజా నృత్యదర్శకత్వంలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment