‘నో’ చెబితే ఫీలైపోతారు!
‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. కానీ, సినిమా రంగంలో ఈ పోటీ అధికం. సినిమాకో కథానాయిక పరిచయం అవుతుండటంతో, అప్పటికే ఉన్న తారలతో పాటు కొత్త తారల నుంచి పోటీ ఎక్కువ అవుతోంది’’ అని తాప్సీ అంటున్నారు. ప్రధానంగా హిందీ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఈ వాఖ్యలు చేశారు. హిందీ రంగం గురించి తాప్సీ ఇంకా మాట్లాడుతూ -‘‘ఇక్కడ పోటీ ఎక్కువ. దాంతో పాటు విమర్శలూ ఎక్కువే. ఆ విమర్శల కారణంగా ఒక్కోసారి ఆత్మస్థయిర్యం కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే విమర్శలను మనసు వరకూ తీసుకెళ్లకూడదని బలంగా నిర్ణయించుకున్నా’’ అన్నారు. బలమైన సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తారలు హిందీలో ఎక్కువే అని చెబుతూ -‘‘నాలాంటి అప్ కమింగ్ తారలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తే అదేదో వింతలా భావిస్తారు. ఏదైనా సినిమాకి ‘నో’ అంటే చాలు, ఫీలైపోతారు. కానీ, ఏ సినిమా పడితే అది చేస్తే కెరీర్ ఎలాగోలా అయిపోతుంది. అందుకే, ఎవరేమనుకున్నా ఫర్వాలేదనుకుని, నా కెరీర్‌కి ఉపయోగపడుతుందనిపించే చిత్రాలు మాత్రమే అంగీకరిస్తున్నా’’ అని తాప్సీ అన్నారు.