స్కూలుకు వెళ్లిన హీరోయిన్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎగిరిపోయి, 'పింక్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న హీరోయిన్ తాప్సీ పన్ను. చిన్నప్పుడు తాను చదువుకున్న స్కూలుకు ఆమె మరోసారి వెళ్లింది. చదువుతో పాటు ఆటపాటలు, ఆత్మరక్షణ విద్యలు కూడా నేర్చుకోవాలని అక్కడి విద్యార్థినులకు చెప్పింది. ఢిల్లీలోని మాతా జై కౌర్ పబ్లిక్ స్కూలుకు ఆమె వెళ్లింది. అక్కడ ఆమెకు పాఠాలు చెప్పిన నాటి టీచర్లతో పాటు కొందరు సీనియర్ అధికారులు ఆమెను సాదరంగా స్వాగతించారు. అక్కడకు వెళ్లగానే ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, తన టీచర్లు, అక్కడి పిల్లలు తనకు చాలా మంచి స్వాగతం పలికారని ఆమె చెప్పింది.
స్కూల్లో పిల్లలు తనను ఆదరించడంతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా నేర్చుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది. వాళ్లు ఒక డెమో క్లాస్ కూడా చూపించారని, అది చాలా బాగుందని తాప్సీ అంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో ఎదగాలని, ఎప్పుడూ నిరాశ చెందొద్దని పిల్లలకు ఉద్బోధించింది. ఇదే స్కూల్లో చదివేటప్పుడు తాను కూడా డిబేట్ పోటీలు, డాన్స్, డ్రామాలు, వివిధ ఆటల పోటీలలో పాల్గొనేదాన్నని వివరించింది. స్కూళ్లలో తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యలను కూడా బోధనలో ఒక భాగంగా చేయాలని తాప్సీ రెండు నెలల క్రితం తన స్కూలు యాజమాన్యాన్ని కోరింది. దాంతో సమ్మర్ క్యాంపులో భాగంగా కరాటే శిక్షణను అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి, తాప్సీని ఆహ్వానించారు.