నిరాశపడలేదు
దక్షిణాదిన అగ్రస్థానంలో తారగా కొనసాగుతున్న తరుణంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలిప్రయత్నంలోనే పరాజయాన్ని చవిచూసినా తాను నిరాశ పడలేదని అంటోంది తమన్నా. తెలుగు, తమిళ చిత్రాలు చేతినిండా ఉన్నప్పుడే బాలీవుడ్‌లోకి అడుగపెట్టి అజయ్ దేవ్‌గణ్‌తో ‘హిమ్మత్‌వాలా’ సినిమా చేసిన విషయం తెలిసిందే. 80వ దశకంలో శ్రీదేవి, జితేంద్ర నటించిన సినిమాను అదే పేరుతో దర్శకుడు సాజిత్‌ఖాన్ రీమేక్ చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ... ‘రీమేక్ చిత్రాలను బాలీవుడ్ అభిమానులు ఆదరిస్తున్నప్పటికీ 1980 నాటి చిత్రాలను రీమేక్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
సినిమా కూడా అదే రీతిలో సాగడాన్ని ప్రేక్షకులు స్వాగతించలేకపోయారు. ‘హిమ్మత్‌వాలా’లో నటించడం ద్వారా ఓ పెద్ద అడుగు వేశానని భావించాను. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయినా నేను నిరాశపడలేదు. సినిమా ఎంపిక ఎలా ఉండాలనే విషయమై ఓ పాఠం నేర్చుకున్నాననిపించింది. ప్రతి నటుడికి, నటికి ఇలాంటి అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. కెరీర్‌లో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నాను. దీనిని కూడా అదేవిధంగా భావించాన’ని చెప్పింది. మళ్లీ సాజిద్‌ఖాన్ దర్శకత్వంలోనే ‘హమ్‌షకల్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా జూన్ 20 విడుదల కానుంది. మళ్లీ సాజిద్‌తోనే ఎందుకు పనిచేస్తున్నారు? అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... చేసిన దర్శకుడితోనే మళ్లీ సినిమా చేయడం తప్పేమీ కాదే... ఆయనతో పనిచేయడంలో నాకెలాంటి భయం, ఇబ్బందీ లేద’ని చెప్పింది. జీవితంలో ఎవరైనా ఎత్తుపల్లాలను ఎదుర్కొనక తప్పదని, ఈసారి మా ప్రయత్నం తప్పక సత్ఫలితాలనిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.