వారిని చూస్తే బాధేస్తుంది
ఆ నిర్మాతలను చూస్తే బాధేస్తుందంటున్నారు మిల్కీబ్యూటీ తమన్నా. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేమిటి? తొలిరోజుల్లో తమన్నా కోలీవుడ్‌లో విజయ్, ధనుష్, సూర్య, కార్తీ, అజిత్ వంటి టాప్ హీరోలతో నటించారు.అయితే చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయిన తమన్నాను బాహుబలి, తోళా చిత్రాలు విజయాలతో పరికరించాయి. దీంతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్నారనే చెప్పాలి. ప్రస్తుతం బాహుబలి-2, విజయ్‌సేతుపతితో ధర్మదురై, ప్రభుదేవాకు జంటగా దేవి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
శివకార్తికేయన్ లాంటి యువనటులతో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇలా బిజీగా ఉన్న ఈ బ్యూటీ మాట్లాడుతూ తానే కాదు ప్రతి నటి, నటుడు తాము నటించే చిత్రాలు విజయం సాధించాలన్న భావంతోనే శ్రమించి నటిస్తారన్నారు. అయినా కొన్ని చిత్రాలు అపజయం చెందుతాయన్నారు. అలాంటప్పుడు చాలా మనస్థాపం కలుగుతుందన్నారు. ఇక ఆ చిత్రాల నిర్మాతలను చూస్తే బాధేస్తుందని చెప్పారు. చిత్ర విజయాన్ని నిర్ణయించేది కథేనని అన్నారు.అందుకే తాను కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నానన్నారు. తనకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలతో కథ నచ్చకపోతే నటించనని నిర్మొహమాటంగా చెప్పేస్తానన్నారు. తన చిత్రాలు విజయం సాధించాలి, నిర్మాతలు సంతోషంగా ఉండాలన్నదే తన భావన అని తమన్న పేర్కొన్నారు.