ముచ్చటగా మూడోసారి నటి తమన్నాను హర్రర్ చిత్రం వదలడం లేదు. వరుసగా మూడోసారి హర్రర్ చిత్రం చేయడానికి ఈ మిల్కీబ్యూటీ రెడీ అవుతోంది. అంతేకాదు కొంతకాలం డల్‌గా ఉన్న ఈ అమ్మడి కెరీర్ ఇప్పుడు స్వీడ్ అందుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోయినా అవకాశాలు వరస కట్టడం నిజంగా తమన్నా లక్కీనే. అదీ మూడు పదులు దాటిన ఈ వయసులోనూ హీరోయిన్‌గా బిజీగా ఉండడం అరుదైన విషయమే.
ప్రస్తుతం తమన్నా ప్రభుదేవాకు జంటగా నటించిన దేవి–2 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తదుపరి విశాల్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతోంది. వీటితో పాటు మరో అవకాశం తమన్నాను వరించిందన్నది తాజా సమాచారం. ఇది హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటోందని తెలిసింది. దీనిని యువ దర్శకుడు రోహిన్ వెంకటేశన్ తెరకెక్కించబోతున్నారు. ఈయన ఇంతకుముందు కలైయరసన్, శివదా జంటగా నటించిన అదే కంగళ్ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ హర్రర్ కథా చిత్రంలో తమన్నాతో పాటు యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, భగవతి పెరుమాళ్ నటించనున్నారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని అందించనున్నారు. డాని డైమండ్ ఛాయాగ్రహణం అందించనున్న ఈ చిత్ర షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. తమన్నా ఇంతకుముందు ప్రభుదేవాతో జతకట్టిన దేవి హర్రర్ నేపథ్యంలో తెరకెక్కి ఫర్వాలేదనే టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం అదే జంట దేవి–2లో నటించారు. ఇదీ హర్రర్ కథా చిత్రమే. తాజాగా మూడోసారి ఈ బ్యూటీ హర్రర్ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment