తమిళసినిమా: రాష్ట్రప్రభుత్వం విధించనున్న వినోదపు పన్ను విధానం తమిళ చిత్రపరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెట్టింది. పరిశ్రమ వర్గాల్లోనూ వివాదాలకు కారణమైంది. కేంద్రప్రభుత్వ జీఎస్టీ 28 శాతంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 30శాతం వినోదపు పన్ను విధించడంతో విలవిలలాడిన థియేటర్ల యాజమాన్యం జూలైలో సమ్మెకు దిగింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రభుత్వం ప్రకటించడంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు. కాగా గత నెల 27న చెన్నై నగర పాలక సంస్థ 10శాతం వినోదపు పన్నును విధిస్తున్నట్లూ అది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ పన్ను విధానాన్ని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల వారు వ్యతిరేకించారు. ముఖ్యంగా నిర్మాతల మండలి, థియేటర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకించాయి.
వినోదపు పన్ను పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే వినోదపు పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ నరగంలోని పీవీఆర్, ఐనాక్స్ థియేటర్ల సముదాయం ప్రదర్శనలను రద్దు చేసుకుంది. ఈ సమస్యపై చర్చంచడానికి బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి నిర్వాహకులు, థియేటర్ల యాజమాన్యం చెన్నైలో సమావేశమయ్యారు. సమావేశంలో వినోదపు పన్ను రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అందుకు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఒక రోజు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసి పోరాటం చేయాలని తీర్మానం చేశారు. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించడానికి 10మంది సభ్యులతో కమిటీని నియమించారు. అయితే థియేటర్ల యాజమాన్యం చేసిన ఈ ప్రతిపాదనను నిర్మాతల మండలి నిర్వాహకులు వ్యతిరేకించారు. శుక్రవారం నుంచే థియేటర్లలో చిత్ర ప్రదర్శనలను నిలిపివేయాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్, ప్రకాశ్‌రాజ్ కోరారు. దీనికి థియేటర్ల యాజమాన్యం నిరాకరించింది. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విశాల్, ప్రకాశ్‌రాజ్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. కాగా బుధవారం సాయంత్రం నిర్మాతల మండలి సమావేశమై శుక్రవారం నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.
ఇలా ఉండగా ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల థియేటర్ల యాజమాన్యం వినోదపు పన్నును పూర్తిగా రద్దు చేయాలని, సినిమా టిక్కెట్ల ధరను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ, ఇది జరగని పక్షంలో దీపావళి నుంచి థియేటర్లలో ప్రదర్శనలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. మధురై, రామనాథపురం, తేని, దిండుగల్, విరుదునగర్, శివగంగై జిల్లాల థియేటర్ల యాజమాన్యం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇలాఉండగా నిర్మాతల మండలి థియేటర్లలో వెంటనే ప్రదర్శనలను నిలిపివేయాలన్న డిమాండ్‌తో కొత్త చిత్రాల విడుదలను నిలిపివేయడం, మరో పక్క ఒక వర్గం థియేటర్ల యాజమాన్యం దీపావళి నుంచి థియేటర్లను మూసి వేస్తామని నిర్ణయం తీసుకోవడం, మరో వర్గం ప్రభుత్వంతో చర్చలు జరపాలని తీర్మానం చేయడంతో చిత్ర పరిశ్రమలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా కొన్ని థియేటర్ల యాజమాన్యం ప్రస్తుతం ప్రదర్శిస్తున్న చిత్రాలనే కొనసాగించాలని, లేని పక్షంలో ఎంజీఆర్, శివాజీగణేశన్ నటించిన పాత్ర చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సమస్యకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
కుదరని ఏకాభిప్రాయం
Published Fri, Oct 6 2017 9:11 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment