నా రాణి ఎక్కడుందో?
'వరుడు' చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన తమిళ హీరో ఆర్య తన జీవితాన్ని పంచుకునే రాణి ఇంకా తారసపడలేదంటున్నాడు. ప్లేబాయ్ నటుడిగా పేరొందిన ఆర్య....ఏ హీరోయిన్తో నటించినా వారిద్దరిపై వదంతులు పుట్టుకొస్తుంటాయి. ఆర్య వ్యవహార శైలి ఈ ప్రచారానికి దోహదపడే విధంగా ఉండడం గమనార్హం.
తనతో నటించే హీరోయిన్లు అందరూ తనకు స్నేహితురాళ్లు అని అతను చెప్పటం విశేషం. అందులో నయనతార ప్రత్యేకం అనడం లాంటి వాక్యాలు మరింత సంచలనం కలిగిస్తుంటాయి. తాజాగా నయన్తార..ఆర్య మధ్య సమ్థింగ్ సమ్థింగ్ అని కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఆర్య చెబుతున్న తాజా కబుర్లేమిటో తెలుసుకుందామా..
ప్ర : ప్రస్తుతం నటిస్తున్న రాజారాణి చిత్ర కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
జ : దర్శకుడు అట్లీ చిత్ర కథను నెరేట్ చేసినప్పుడే సంభాషణలతో సహా వివరించారు. అవి చాలా క్యాచీగా, వినోదభరితంగా ఉన్నాయనిపించింది. మంచి
ఎమోషనల్ సన్నివేశాలూ ఉన్నాచయి. పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాలు చాలా వరకు ఆనందమయం కాకపోవడానికి కారణం ఇగోనే. ఈ కాన్సెప్ట్‌తో కూడిన కథను దర్శకుడు అట్లీ తెరపై అందంగా ఆవిష్కరించారు.
ప్ర : ఈ చిత్రం కోసం మీరు ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో చెబుతారా?
జ : రాజారాణి చిత్రంలో నా పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. సగటు భర్తగా, మంచి ఎనర్జిటిక్‌తో కూడిన ప్రేమికుడిగా కనిపిస్తాను. ఈ విభిన్న తరహా పాత్రలకు బాడీ లాంగ్వాజ్ మార్పు కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అదేమిటో చిత్రం చూస్తే మీకే అర్థమవుతుంది.
ప్ర : ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతోంది. ఇంతకు ముందు మీరు ఈ తరహా చిత్రాలలో నటించారు కదా. ఎలాంటి అనుభూతి కలిగింది.?
జ : ప్రతి నటుడికీ తన ప్రతిభపై నమ్మకం ఉంటుంది. నా వరకు నేను ఇతర హీరోలతో నటించేటప్పుడు చాలా కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. సాధారణంగా
మల్టీస్టారర్ చిత్రాలంటే కథలు చాలా కొత్తగా ఉంటాయి. అదే విధంగా ప్రేక్షకులు తమ అభిమాన హీరోల కోసం చిత్రాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ప్ర : ఆర్య వెడ్స్ నయనతార అంటూ రాజారాణి చిత్రం కోసం వెలసిన పోస్టర్ల గురించి ఏమంటారు?
జ : అవి పూర్తిగా చిత్ర కాన్సెప్ట్‌ను అనుసరించి ముద్రిం చినవి. రాజారాణి చిత్రంలో నేను నయనతార భార్యాభర్తలుగా నటించాం. అలా చిత్ర ప్రచారం కోసం ప్రచురించినవే ఆ పోస్టర్లు.
ప్ర : మీ గురించి ప్రచారం అవుతున్న వదంతుల గురించి పట్టించుకుంటారా?
జ : అలాంటి ప్రచారాల గురించి పట్టించుకోను. ప్రేక్షకులకు నాపై అభిమానం ఉంది. అది చాలు. సినీ పరిశ్రమలో నేను ఒంటరినే.
ప్ర : మరి తోడు కోసం అన్వేషిస్తున్నారా?
జ : ప్రస్తుతం నా చుట్టూ ఉన్నవాళ్లందరూ తెరపై రాణులే. జీవితంలో నన్నేలే రాణి ఇంకా తారసపడలేదు.