రీమేక్ కోసం... భలే భలే ఆఫర్లోయ్!
కాస్త కొత్తదనం ఉందనిపిస్తే చాలు... ఆ సినిమాని రీమేక్ చేసేందుకని వెంటనే కొని తీసుకెళుతుంటారు పొరుగు భాషల్లోని నిర్మాతలు. ఇక కొత్తదనంతో పాటు సూపర్ హిట్ సినిమా కూడా అనిపించుకుందంటే తిరుగేముంటుంది? రీమేక్ రైట్స్ విషయంలో మరింత క్రేజీ క్రేజీగా ఆఫర్లు వచ్చేస్తాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘భలే భలే మగాడివోయ్’ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. నాని, లావణ్యా త్రిపాఠీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ2, యు.వి. క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ రెండు నిర్మాణ సంస్థల అభిరుచి గురించి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాయి.
అసలే ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ వెలిగిపోతోంది. ‘బాహుబలి’ తర్వాత కమర్షియల్ సినిమాల్లో ‘శ్రీమంతుడు’ ఒక కొత్త ట్రెండ్ సృష్టిస్తే... ఆ తర్వాత వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ మరో రకమైన ట్రెండ్‌ను సృష్టించింది. కామెడీతో కూడా బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో కాసుల వర్షం కురిపించొచ్చని ఈ సినిమా నిరూపించింది. అమెరికాలో మిలియన్ మార్క్ వసూళ్లు సాధించిన తొలి నాన్‌స్టార్ సినిమాగా, మిడ్ బడ్జెట్ సినిమాగా రికార్డును సృష్టించింది.
అల్లు అరవింద్ ప్రోత్సాహం
తరణ్ ఆదర్శ్ లాంటి ప్రముఖ సినీ విశ్లేషకుడు తరచుగా ట్విట్టర్‌లో ‘భలే భలే మగాడివోయ్’ ఓవర్సీస్‌లో సాధిస్తున్న వసూళ్ల గురించి ట్వీట్ చేస్తుండ డంతో బాలీవుడ్, కోలీవుడ్ నుంచి రీమేక్ రైట్స్ కోసం నిర్మాతలు వెంటబడు తున్నట్టు తెలిసింది. అయితే గీతా ఆర్ట్స్ సంస్థకి హిందీలోనూ, తమిళంలోనూ ఆమిర్‌ఖాన్, రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్స్‌తో సినిమాలు నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి, ఆయా భాషల్లో వేరొక నిర్మాణ సంస్థతో కలిసి రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ‘భలే భలే మగాడివోయ్’ని నిర్మించిన జీఏ2 సంస్థ గీతా ఆర్ట్స్‌కి అనుబంధ సంస్థ అన్న విషయం తెలిసిందే. జీఏ2 నిర్మాత బన్నీ వాసు కొత్త తరహా కాన్సెప్టులతో కూడిన సినిమాలు తీయడం వెనుక గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రోత్సాహం ఎంతో ఉంది. బన్నీ వాసు, మారుతి, యూవీ క్రియేషన్స్ నిర్మా తల్లో ఒకరైన వంశీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్. పదిహేనేళ్లుగా మంచి స్నేహితులు. ఆ అనుబంధంతోనే జీఏ2, యువీ క్రియేషన్స్ చేతులు కలిపాయి.
హీరోలకు కలిసొచ్చిన సంస్థ
కథానాయకుల స్థాయిని పెంచే నిర్మాణ సంస్థగా యూవీ క్రియేషన్స్ గుర్తింపు పొందింది. ప్రభాస్ ‘మిర్చి’తో ప్రస్థానం ప్రారంభించిన యూవీ క్రియేషన్స్ తొలి అడుగుల్లోనే సంచలనాలు నమోదు చేస్తుండడం విశేషం. ఆ తర్వాత శర్వానంద్‌తో తీసిన ‘రన్ రాజా రన్’ కూడా సంచలన విజయం సాధించింది. శర్వానంద్‌పై పది కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేసి అంతకు మించిన వసూళ్లు రాబట్టుకొంది. తమిళంలో ‘బాహుబలి’ని విడుదల చేసింది కూడా యూవీ క్రియేషన్సే. ఆ సినిమాకి తమిళంలో భారీ లాభాలొచ్చాయి. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ రూపంలో నాని కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమా తీయడంతోపాటు, ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ విజయాన్ని అందించింది యూవీ క్రియేషన్స్. హీరోలకి కలిసొచ్చే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది.