
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణవేణి(94) సోమవారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నేడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తన తల్లి రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. తన తల్లి మరణవార్త తెలిసి మిత్రులు, శేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించేందుకు ఎవరు ఇంటికి రావద్దని కోరారు.
తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి కూడా నిర్మాత అనే సంగతి తెలిసిందే. రవీంద్ర ఆర్ట్స్ పతాకంపై లక్షాధికారి, జమీందారు, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, డాక్టర్ బాబు వంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు లెనిన్‌బాబు మరణించాడు. చిన్న కుమారుడు తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా, దర్శకుడిగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. తొలి నుంచి వీరిది వామపక్ష కుటుంబం. కాగా, కృష్ణమూర్తి 2013లో మృతిచెందారు.
తమ్మారెడ్డి భరద్వాజను ఫోన్‌లో పరామర్శించిన చిరంజీవి..
తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనను ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సంతాప సందేశాన్ని తెలియజేశారు. సినిమా ఒక మజిలీ, సమ సమాజం నా అంతిమ లక్ష్యం అనే కృష్ణమూర్తి.. తెలుగు సినిమా పరిశ్రమకు ఇతోదిక సేవలదించారని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment