ఆ పేరు తెచ్చుకోకూడదు! | tanish film industry in 10 years completed | Sakshi
Sakshi News home page

ఆ పేరు తెచ్చుకోకూడదు!

Published Thu, Dec 20 2018 12:06 AM | Last Updated on Thu, Dec 20 2018 12:06 AM

tanish film industry in 10 years completed - Sakshi

తనీష్‌

చైల్డ్‌ ఆర్టిస్టుగా దాదాపు 17 సినిమాలు చేసిన నటుడు తనీష్‌ హీరోగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించారు. గతేడాది కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘నక్ష త్రం’ సినిమాలో విలన్‌గా నటించారాయన. హీరోగా తనీష్‌ తొలి చిత్రం ‘నచ్చావులే..!’ విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో తనీష్‌ మాట్లాడుతూ – ‘‘మా నాన్నగారు డిఫెన్స్‌లో జాబ్‌ చేసేవారు. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఇరవైఏళ్ల క్రితం వెంకటేశ్‌గారి ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో తొలిసారి చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాను.

ఆ తర్వాత నా కెరీర్‌ కోసం మా నాన్నగారు జాబ్‌ నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో ఉండేవాళ్లం. చాలా కష్టాలు పడ్డాం. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇక చాలు.. హీరోగా ప్రయత్నిద్దాం అనుకుంటున్న సమయంలో ఓ చాన్స్‌ వచ్చింది. రెండు రోజుల్లో సైన్‌ చేయాలి. ఇంతలోనే రవిబాబుగారి ‘నచ్చావులే..!’ సినిమా ఆడిషన్స్‌కి వెళ్లాను. నువ్వు లావు తగ్గితే మా సినిమాలో తీసుకుంటాం అన్నారాయన. ఇంటికి వచ్చి బాగా ఆలోచించాను. ముందు వచ్చిన అవకాశాన్ని వద్దనుకుని అసలు సెలెక్ట్‌ అవుతానో లేదో తెలియని రవిబాబుగారి సినిమా కోసం కష్టపడ్డాను.

రెండు వారాల్లో దాదాపు 10  కేజీలు తగ్గి ఆయన దగ్గరికి వెళ్లాను. రేపటి నుంచి షూటింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అన్నారు. ఆనందపడాలో, ఆశ్చర్యపడాలో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా రిలీజైన తర్వాత నా తల్లిదండ్రుల కళ్లల్లో చూసిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను. నచ్చినప్పుడు నచ్చావ్‌ అన్నారు. నచ్చనప్పుడు నచ్చలేదు అంటూనే నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు.. స్పెషల్‌గా తొలి అవకాశం ఇచ్చిన రవిబాబుగారికి థ్యాంక్స్‌.

ఫిబ్రవరి లేదా మార్చిలో నేను హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ‘బిగ్‌ బాస్‌ షో’ నాకు ఎక్స్‌టెండెడ్‌ ఫ్యామిలీని ఇచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘సక్సెస్, ఫెయిల్యూర్స్‌ నా చేతిలోనే కాదు. ఎవరి చేతిలోనూ లేవు. ఇప్పటివరకు నా జర్నీని ప్లాన్‌ చేసుకోలేదు. ఇకపై ప్రతి స్టెప్‌ జాగ్రత్తగా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే.. ‘ఇంత వయసు వచ్చినా, ఇంత అనుభవం ఉన్నా వీడు మారలేదురా’ అంటారు. ఆ పేరు తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. అలాగే ఇక రాంగ్‌ స్టెప్స్‌ కూడా వేయను. నేను స్టార్‌ని కాదు. యాక్టర్‌ని. నెగటీవ్‌ పాత్రలే కాదు చాలెంజింగ్‌గా ఉన్న ఏ పాత్ర చేయడానికైనా రెడీ. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement