
తాప్సీ, హన్సికలకు సెలవులు
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపూ తెలియకపోయినా... నూతనోత్సాహం కోసం పనికి కొన్ని రోజులు విరామం ఇవ్వాలనిపిస్తుంది.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపూ తెలియకపోయినా... నూతనోత్సాహం కోసం పనికి కొన్ని రోజులు విరామం ఇవ్వాలనిపిస్తుంది. ఇటీవల తాప్సీ, హన్సికలకు అలానే అనిపించింది. అంతే.. ఓ సారి తమ డైరీ తిరగేశారు. కొన్ని రోజులు షూటింగ్‌కి విరామం ఇచ్చే పరిస్థితి కనిపించడంతో విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. విడివిడిగా నిర్ణయం తీసుకుని ఈ ఇద్దరూ విదేశాలు చెక్కేశారు. హన్సిక వెళ్లి ఇప్పటికి ఐదారు రోజులైంది.
ముందు ఆమ్‌స్టర్ డామ్, అటునుంచీ బార్సిలోనా వెళ్లారామె. ఈ హాలిడే ట్రిప్ చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నారో ఏమో... ఇక్కణ్ణుంచి వెళ్లేటప్పుడు జుత్తుకి పింక్ రంగు వేయించుకున్నారు. విదేశాల్లో తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో కూడా పొందుపరుస్తున్నారు హన్సిక. ఇక, తాప్సీ విషయానికొస్తే.. ఈ బ్యూటీ విదేశాలు వెళ్లి మూడు, నాలుగు రోజులవుతోంది. ఇక్కణ్ణుంచి వెళ్లే ముందు.. ‘‘ఇటీవల కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నాను. ఆ మీటింగ్స్‌లో బోల్డన్ని ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.
వాటిని త్వరలో మీతో పంచుకుంటా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దాన్నిబట్టి, ఏదైనా భారీ చిత్రంలో తాప్సీ నటించనున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. అసలు విషయం తాప్సీ చెబితే ఆ ఊహాలకు తెరపడుతుంది. ప్రస్తుతం ఆమె ఏథెన్స్‌లో ఉన్నారు. సెలవులు ముగిసే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారామె. మొత్తం మీద తాప్సీ, హన్సిక సెలవులను పూర్తిగా ఆస్వాదించి, ఓ నూతనోత్సాహంతో వస్తారని ఊహించవచ్చు.