
బాహుబలి టీంకు వారం వారం రివార్డులు
సుదీర్ఘంగా సాగిపోతున్న బాహుబలి చిత్రంలో నటించాలంటే చాలా కష్టమే. ఎందుకంటే 2013 జూన్ నెలలో షూటింగ్ మొదలైన ఈ చిత్రం 2015లో గానీ విడుదల కాదని తేలిపోయింది. దీంతో దర్శకుడు రాజమౌళి నటులను బుజ్జగించడానికి కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. 'స్టార్ ఆఫ్ ద వీక్' పేరుతో.. సినిమాలో బాగా పనిచేసేవాళ్లకి, నిబద్ధతతో నటించేవాళ్లకి రివార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. బాహుబలి సినిమా గురించి ఇండస్ట్రీలోనే కాక.. ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ప్రభాస్, రాణా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈసినిమాలో ఈ వారం బాగా పనిచేసినందుకు గాను గౌస్, లగాన్, శ్రీను అనే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేశారు.
గతవారం మనుషులు సరిపడగా లేనప్పుడు ఈ ముగ్గురూ ఎక్కువ కష్టపడి, షూటింగ్కు ఏమాత్రం అంతరాయం కలగకుండా చూశారని, వాళ్లు త్వరగా కాస్ట్యూంలు వేసుకోవడమే కాక, దాదాపు 350-400 మంది నటులకు దుస్తులు వేయిచండంలో కాస్ట్యూం శాఖకు సాయం చేశారని ఈ సినిమా ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బూట్లు కట్టడం, నెక్లెస్లు పెట్టడం, ఇతర నగలు అలంకరించడం.. అన్నీ చేసి ఆరోజు షూటింగ్ సమయాన్ని వృథా కాకుండా చేశారని చెప్పారు. ఈ సినిమా గురించి ప్రతి వారం బులెటిన్లు ఇవ్వాలని కూడా టీమ్ బాహుబలి నిర్ణయించింది. వందకోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, కె. రాఘవేంద్రరావు నిర్మాతలు.