
కంటతడి పెట్టిన హీరో సప్తగిరి
హైదరాబాద్: హీరోగా మారిన హాస్యనటుడు సప్తగిరి.. సక్సెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడు హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమా గతవారం విడుదలై విజయవంతగా నడుస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ... తామంతా ఎంతో కష్టపడి సినిమా బాగా తీస్తే రివ్యూలు ప్రతికూలంగా రాశారంటూ కంటతడి పెట్టాడు. హీరోగా తాను చేసిన తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. దర్శకుడిని కావాలన్న లక్ష్యంతో సినిమాల్లోకి వచ్చి నటుడిని అయ్యానని వెల్లడించారు. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానని స్పష్టం చేశాడు.
‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాపై మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ బి సి సెంటర్లలో వసూళ్లు బాగానే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ఈ సినిమా నిర్మాత రవికిరణ్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో తమ సినిమాకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. సప్తగిరి, రోషిణి ప్రకాశ్ జంటగా నటించిన ఈ సినిమాకు అరుణ్ పవార్ దర్శకత్వం వహించారు.