తారల బిజీనెస్
రంగులలోకంలో రాజాలై, ‘రాణి’ంచాలని... తెరకెక్కుతున్న తారలు ఆ కలలు కల్లలైతే... ఏం కావాలి? ఓ వైపు ఈ ప్రశ్న ‘ఉదయి’ంచే సంఘటనలు అప్పుడప్పుడూ చోటుచేసుకుంటుంటే... మరోవైపు ‘మాకు రెస్టారెంట్ ఉంది.. రియల్‌ఎస్టేట్ ఉంది.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఉంది’ అంటూ పలువురు నటీనటులు తమకున్న విభిన్న రకాల వ్యాపకాలతో దీనికి సమాధానం చెప్పకనే చెబుతున్నారు. అవకాశాల దీపం వెలుగుతూ ఉండగానే కొత్త కెరీర్‌లను వెతుక్కుంటున్నారు. సినీ వినీలాకాశంలో వెలిగే తారలు కాలేకపోయినా... ఆర్థిక స్థిరత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
యువనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య ఉదంతం వెండితెర తారల జీవితాలపై రేపిన ప్రశ్నలెన్నో. అందులో ప్రధానమైనది... సినిమా నటుల ఆర్థిక పరిస్థితి. కెరీర్ బాగున్నప్పుడు సరే గానీ... కాస్త అటూ ఇటూ అయినా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా... కొందరు ముందస్తు ప్రణాళికలతో కొత్త కొత్త వ్యాపకాలతో సినిమా రంగానికి ఆవల సరికొత్త వ్యాపకాలను విస్తరించుకుంటున్నారు.
ప్లస్.. సెలబ్రిటీ స్టేటస్
తమకున్న సెలబ్రిటీ స్టేటస్‌నే పెట్టుబడిగా.. నటులు వ్యాపారవేత్తలుగా అవతరిస్తున్నారు. నగరానికి చెందిన పలువురు వ్యాపారులు వీరిని భాగస్వాములుగా కలుపుకునేందుకు ఉవ్విళ్లూరుతుండడంతో వీరి పని మరింత సులువుగా మారుతోంది.
తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఫ్యాషన్ రంగంతో పాటు స్పాలు, జిమ్‌లు, క్లబ్‌లు, పబ్‌లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు... ఇలా విభిన్న రంగాలను సినీనటులు ఎంచుకుంటున్నారు.
కాదేదీ.. కాలిడేందుకు అనర్హం...
తమకు వ్యాపారం లేదా వ్యాపకం ఉన్న విషయం తెలిస్తే సినీ అవకాశాలు దూరమవుతాయనే కారణంతో వీటి వివరాలు కొందరు నటీ నటులు వెల్లడించడానికి ఇష్టపడనప్పటికీ.. నగరంలో వీరి ‘బిజీ’నెస్‌లు చాలా మందికి తెల్సినవే.
* హీరో శర్వానంద్‌ను తీసుకుంటే ఆయన సినిమాలకు ప్రత్యామ్నాయ కెరీర్‌గా హోటల్ రంగాన్ని ఎంచుకున్నట్టు కనబడుతోంది. తన స్నేహితుల, కుటుంబీకుల సహకారంతో జూబ్లీహిల్స్‌లో ఆయన ‘బీన్జ్’ పేరుతో ఓ కాఫీ షాప్, రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు.
* స్లిమ్‌గా మారి మళ్లీ చిన్నితెర, వెండితెరలపై త‘లుక్’మంటున్న రాశి... మణికొండలో ఓ ప్లే స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.
* నటి భూమిక ‘మాయాబజార్’ అనే మేగజైన్‌ను ప్రారంభించి అనంతరం ఒక మినరల్ వాటర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. భర్త భరత్ ఠాకూర్‌కు యోగా శిక్షకుడిగా ఉన్న ప్రాచుర్యాన్ని ఉపయోగించుకునేందుకు భారీస్థాయిలో యోగా శిక్షణా స్కూల్ నిర్వహణలోనూ ఆమె పాలుపంచుకుంటున్నారు.
* పలు చిత్రాల్లో హీరోగా, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు పొందిన నటుడు నవదీప్ మరో స్నేహితుడ్ని పార్ట్‌నర్‌గా చేసుకుని ఇటీవలే ‘రా ప్రొడక్షన్ హౌస్’ పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించారు. సుష్మితాసేన్ సమర్పించిన ‘ఐయామ్ షి’ ఈవెంట్‌ను ఆయన సంస్థ విజయవంతంగా నిర్వహించింది.
* వారసత్వంగా లభించిన స్థలంలో కొందరు మిత్రులతో కలిసి కార్ఖానా, వాసవీనగర్‌లో ‘మాయాబజార్’ పేరిట ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు నటుడు శశాంక్. ‘ఐతే’తో అరంగేట్రం చేసిన ఈ నటుడు తాజా సినిమా‘ఎవడు’లోనూ మంచి పాత్ర పోషించారు.
* కమల్ కామరాజ్ అటు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు చిత్రకారుడిగానూ నిరూపించుకుంటున్నారు.
ఒడిదుడుకులు తట్టుకునేందుకు..
సినీరంగంలో ఒడిదుడుకులు తీవ్రంగానే ఉంటాయి. వీటిని తట్టుకునేందుకు ఆర్థిక స్వావలంబన అవసరం. అందుకే మాయాబజార్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాను.
షూటింగ్‌లు లేని సమయాల్లో వీలైనంత ఎక్కువ సమయాన్ని దీని నిర్వహణకే కేటాయిస్తున్నా. వ్యాపార భాగస్వాములైన మిత్రుల సహకారంతో రెస్టారెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా.
- శశాంక్, నటుడు
‘రియల్ ఎస్టేట్’లోకి వస్తున్నా
మొదటి నుంచీ సినిమారంగంతో పాటు నన్ను నేను నిరూపించుకునేందుకు పలు రంగాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నాను. త్వరలో ‘ది విలేజ్’ పేరుతో ఓ సరికొత్త రియల్ ఎస్టేట్ వెంచర్‌ను సైతం ప్రారంభిస్తున్నాను. నా సినిమా షూటింగ్‌లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ వ్యాపకాలన్నింటిలో సన్నిహితులను భాగస్వాములుగా చేసుకుంటున్నాను.
- నవదీప్, నటుడు