వచ్చే ఏడాదికి ఆస్కార్ అవార్డు ఎంట్రీల సందడి ఇప్పుడే మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తమ విదేశీచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడానికి వివిధ భారతీయ భాషల నుంచి 30 సినిమాలు మన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి.
ఒకటి - అక్కినేని నటించిన ఆఖరు సినిమా ‘మనం’ కాగా, రెండోది - నిజజీవిత అంధ విద్యార్థులతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ‘మిణుగురులు’. ఇప్పటికే జాతీయ అవార్డును అందుకున్న బెంగాలీ చిత్రం ‘జతీశ్వర్’, మరాఠీ చిత్రం ‘ఫండ్రీ’, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ ‘షాహిద్’లు కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే, పాపులర్ సినిమాలైన ‘మర్దానీ’, ‘ఫిల్మిస్తాన్’, సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్‌లీలా’, ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీ కోమ్’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం నుంచి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ‘కోచ్చడయాన్’, ‘కదై.. తిరైక్కదై.. వసనమ్... ఇయక్కమ్’ చిత్రాలు,
ఇంకా కొంకిణి తదితర భాషా చిత్రాలు సైతం మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళాలని ఉత్సాహపడుతున్నాయి. ఎఫ్.ఎఫ్.ఐ. నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ ఈ బుధవారం నుంచి ఈ చిత్రాలను వీక్షించి, మన దేశం పక్షాన పంపే తుది ఎంట్రీని ఖరారు చేయనుంది. ‘‘ఈ సినిమాల స్క్రీనింగ్‌లన్నీ హైదరాబాద్‌లో జరగనున్నాయి. అన్ని చిత్రాలనూ కమిటీ చూసి, ఈ నెల 23న తన తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ చాంబర్) వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి.
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి....మనం, మిణుగురులు
Published Tue, Sep 16 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement