Minugurulu
-
'మిణుగురులు' చిత్రానికి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్, దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో తాజాగా స్పెషల్ షో వేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్లేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య 'మిణుగురులు' 10 ఏళ్లు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు. ‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'గోల్డెన్ ఎలిఫెంట్' గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్,ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'ఉత్తమ చిత్రం' అవార్డు గెలుచుకుంది. 2014 లో 'అస్కార్స్' కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో 'మిణుగురులు' కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో 'మిణుగురులు' కథ కూడా ఉంటుంది. అని ఆయన చెప్పారు. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్లోని నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్లో ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఈయన అమెరికా టివి ఛానల్ ఓపిబిలో కొన్నేళ్లు పనిచేశారు. తన దర్శక నిర్మాణంలో తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలు చాల అవార్డులు గెలుచుకున్నాయి. ఆయన 'మిణుగురులు' చిత్రం 2014 లో 7 నంది అవార్డులు గెలుచుకుంది. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథతో '24 కిస్సెస్' అనే చిత్రాన్ని తీశారు. ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్, ఓటిటిలో చిత్రాలు ఉండడం విశేషం. -
అల్లరే నటుడ్ని చేసింది
‘మిణుగురులు’ నా జీవితంలో స్పెషల్ ‘లెజెండ్’తో మరింత గుర్తింపు ‘లవ్ కె రన్’తో హీరోగా ప్రమోషన్ బాల నటుడిగా 42 చిత్రాలు ఇదీ విశాఖ కుర్రోడు దీపక్ సరోజ్ సినీ ప్రొఫైల్ విశాఖపట్నం : దీపక్.. ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, వెండితెరపై ఆ కుర్రాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేయడం సహజం. కానీ ఆ పిల్లాడి అల్లరిని తట్టుకోవడం మాత్రం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కానీ వారికి అప్పుడు తెలియదు..తమ పిల్లాడిలో ఉన్నది అల్లరి కాదు ‘హైపర్ యాక్టివ్’అని. (ఇటీవల ఓ చిత్రంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు). అయితే అతని ఇష్టాన్ని గుర్తించగలిగారు. డాన్స్‌మాస్టర్ శివకుమార్ వద్ద చేర్పించారు. అల్లరి చేసే సమయం ఇవ్వకుండా స్మిమ్మింగ్, స్కేటింగ్, క్యాషియో వంటివి నేర్పించే వారు. అలా తెలియకుండానే వినోద సంబంధిత రంగాలతో ఆ పిల్లాడు మమేకమైపోయాడు. వాటికి అలవాటు పడి, ఇష్టంగా మార్చుకున్నాడు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్తో బహుమతులు అందుకోవడం ప్రారంభించాడు. అప్పటికి అతని వయసు కేవలం ఐదేళ్లు. ఆ తర్వాత ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ వద్దకు చేరడంతో దీపక్ జీవితం పూర్తిగా మారిపోయింది. బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మిణుగురులు అనే చిత్రంతో ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్లి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 42 చిత్రాల్లో బాల నటుడిగా తానేంటో నిరూపించుకున్న దీపక్ తాజాగా లవ్ కె రన్ చిత్రంతో హీరో అయ్యాడు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సాక్షి: బాలనటుడిగా ఇప్పటి వరకూ చాలా చిత్రాల్లో నటించారు. ఎలా మొదలైంది మీ ప్రస్థానం. దీపక్ : సినిమాల్లోకి రావాలని అసలు అనుకోలేదు. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక అమ్మా, నాన్న నాకు డ్యాన్స్ నేర్పించారు. ఐదేళ్ల వయసులో సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారు. అప్పట్లో ఓ టీవీ చానల్లో డుండుం డిగాడిగా అనే డాన్స్ ప్రోగ్రాం వచ్చేది. దానిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా పెదబాబు చిత్రం మొదలుపెడుతున్నప్పుడు ఆయన చిన్నప్పటి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఆ వెంటనే ఆర్య చిత్రంలో అవకాశం వచ్చింది. ప్రారంభంలోనే పెద్ద చిత్రాల్లో అడుగుపెట్టడంతో అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా ఇప్పటికి 42 చిత్రాల్లో నటించాను. సాక్షి: వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే.. దీపక్ : అతడు, భద్ర, పౌర్ణమి, అసాధ్యుడు, డాన్, సోగ్గాడు, ఆంధ్రుడు, బావ, వంటి చాలా చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. నా జీవితంలో ‘మిణుగురులు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రానికి సెలక్షన్లకు వెళ్లినపుడు కళ్లు కనిపించని పిల్లాడ్ని ఇంటికి వచ్చిన వ్యక్తి అవమానిస్తే ఎలా స్పందిస్తాడో చేసి చూపించమని అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి చెప్పినపుడు పది నిమిషాలు సమయం ఇవ్వండి పాత్ర ను ఇమాజిన్ చేసుకుని చేస్తానన్నాను. ఆ మాటే ఆయనకు నచ్చిందని 15 రోజుల తర్వాత యు ఆర్ సెలెక్ట్టెడ్ అని చెబుతూ అన్నారు. 800 మంది ఉన్న పోటీలో నేను సెలెక్ట్ కావడం ఇప్పటికీ ఆశ్చర్యమే. మిణుగురులు కోసం 40 కిలోల బరువు సహజంగా తగ్గాను. ఆ కష్టం ఆస్కార్ వరకూ వెళ్లినపుడు మర్చిపోయాను. ఆ చిత్రం తర్వాత మళ్లీ పూర్తి భిన్నమైన ఛాలెంజింగ్ రోల్ ‘లెజెండ్’లో దొరికింది. బాలయ్య చిన్నప్పటి పాత్ర అది. తర్వాత రాజేంద్రప్రసాద్‌తో టామీ చిత్రంలో నటించి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సాక్షి: చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. దాని ప్రభావం చదువుపై పడలేదా? దీపక్ : లేదు..నేను మొదట్నుంచీ బాగా చదువుతాను. టెన్త్‌లో 95 పర్సంట్ మార్క్స్ వచ్చాయి. చెన్నై ఎస్ఆర్ఎంలో ఇటీవలే బీబీఎం పూర్తి చేశాను. ఎంబీఏ చేయడానికి సిద్ధమవుతున్నాను. నిజానికి నటనా రంగం నాకు గిఫ్ట్‌గా దొరికింది. నాకు నేనుగా నేర్చుకున్నది క్రికెట్. అదంటే చాలా ఇష్టం. ఓ రోజు లెజెండ్ సినిమా సెట్లో బాల కృష్ణను అవుట్ చేసి ‘వీడు ఫర్ఫెక్ట్’ అనిపించుకున్నాను. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. సీసీఎల్‌కు ఆడే అవకాశం ఉంది. సాక్షి: ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం దీపక్ : ఒక్కరని చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే వ్యక్తి గతంగా చిరంజీవి అంటే పిచ్చి. ఇప్పటి హీరోల్లో అందరూ ఇష్టమే. రామానాయుడు వంటి పెద్దవాళ్లు నువ్ పెద్దవాడివి ఎప్పుడవుతావురా హీరోని చేద్దాం అనేవారు. విశ్వనాథ్ వంటి గొప్పవారు నా నటనను మెచ్చుకునేవారు. టామీ చిత్రం చూసి ఎమ్మెస్ నారాయణ పిలిచి అభినందించారు. సాక్షి: భవిష్యత్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు దీపక్ : హీరోగా కంటే నటుడిగా అందరికీ గుర్తుండాలనుకుంటాను.ప్రయోగాలు చేయడం ఇష్టం. కమల్‌హాసన్, నసీరుద్దీన్‌షా,విక్రమ్, కోటా శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్ వంటి వాళ్ల నటనను చూసి నేర్చుకుంటుంటాను. ‘లవ్ కె రన్’ కూడా మంచి కథ. ఈ చ్రితంలో మళయాల హీరోయిన్ మాళవిక మీనన్ నాకు జతగా చేసింది. ఇక ముందు చేయబోయే ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ అవసరం. చదువుకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మంచి అవకాశం కోసం ఎదురు చూడాలనుకుంటున్నాను. -
చాలా కష్టపడ్డాను
‘మిణుగురులు’తోఅరంగేట్రం ‘నిర్మలా కాన్వెంట్’లో చక్కటి పాత్ర వరుస చిత్రాలతో అలరిస్తున్న రమణ పెందుర్తి: వెండితెరపై పెందుర్తికి చెందిన పీలా రమణ మెరుస్తున్నాడు. వరుస చిత్రాలతో తన జోరు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అరంగేట్రం ఆలస్యమైనా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుని సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. ఆస్కార్ బరిలో నిలిచిన తెలుగు చిత్రం ‘మిణుగురులు’తో అరంగేట్రం చేసిన పీలా రమణ అనతికాలంలోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. పలు చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని తన జోరు చూపిస్తున్నాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రతో రూపొందిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో రమణ చక్కని పాత్ర పోషించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దీంతోపాటు రమణ నటించిన ‘ఆకలి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. సంపూర్ణేష్‌బాబు ‘కొబ్బరిమట్ట’తో పాటు మరికొన్ని చిత్రాలు, టీవీ సీరియళ్లలో కూడా రమణ నటిస్తున్నాడు. ‘మిణుగురులు’ల్లో మెరిసి.. పెందుర్తిలో నివాసం ఉంటున్న రమణది మధ్య తరగతి కుటుంబం. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద ఓ పాన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అలవాటు. ఆ క్రమంలోనే సినీరంగంపై మక్కువ పెంచుకున్నాడు. ఇదే క్రమంలో సినీ అవకాశాల కోసం చాలాకాలం ప్రయత్నిస్తూ చివరకు సఫలమయ్యాడు. 2014లో ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం రేసులో బరిలో నిలిచిన ‘మిణుగురులు’లో డర్టీ పోలీస్ పాత్రలో రమణ అరంగేట్రం చేశారు. తర్వాత 30 వరకు చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు. సినీ పరిశ్రమతో పాటు అభిమానులు, పెద్దల మన్ననలు పొందారు. కల నెరవేరింది ఆస్కార్ రేసులో నిలిచిన చిత్రంతో నా అరంగేట్రం మరిచిపోలేని అనుభూతి. తాజాగా నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించిన ‘నిర్మలా కాన్వెంట్’లో నటించాను. పెందుర్తి నుంచి చిత్ర పరిశ్రమకు వెళ్లే క్రమంలో చాలా కష్టపడ్డాను. చివరకు అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రతిభతో రానున్న కాలంలో మరింత రాణిస్తాను. విశాఖ సినిమా పరిశ్రమకు చాలా అనుకూలం. ఇక్కడకు పరిశ్రమ పూర్తిస్థాయిలో వస్తే నాలాంటి ఔత్సాహిక కళాకారులకు అవకాశాలు వస్తాయి. - పీలా రమణ -
మిణుగురులు తరహాలో...
అందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఓ వ్యక్తి అనుకోకుండా కాలు పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి తన మిగతా జీవితాన్ని ఎలా గడిపాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బంగారు పాదం’. దయా, జ్యోతిశ్రీ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో ఎన్.హెచ్.ప్రసాద్ నిర్మించారు. దర్శక-నిర్మాత మాట్లాడుతూ -‘‘రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. వస్తువులకు, మనుషులకు ఉన్న సంబంధాలను ఈ సినిమాలో చూపించాం’’ అని చెప్పారు. ‘‘ ‘మిణుగురులు’ చిత్రం తర్వాత ఆ తరహాలో ఉండే ఈ చిత్రానికి సంగీతం అందించాను. అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని సంగీత దర్శకుడు జోశ్యభట్ల తెలిపారు. -
బుల్లితెరపై మిణుగురులు
‘మిణుగురులు’... గత ఏడాది జనవరిలో రిలీజైన ఈ ఆలోచనాత్మక చిత్రం గుర్తుందా? ఒక అంధుల హాస్టల్లో జరిగే అన్యాయాల మీద విద్యార్థులు తిరగబడే ఇతివృత్తంతో ప్రవాస భారతీయుడు అయోధ్యకుమార్ క్రిష్ణంశెట్టి రూపొందించిన సినిమా అది. రెండేళ్ళ క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’లో లైవ్‌యాక్షన్ కేటగిరీలో పోటీపడిన ఈ సినిమా పలువురు విమర్శకుల ప్రశంసలందుకొంది. పలు అవార్డులందుకొన్న ఈ చిత్రం తొలిసారిగా టీవీలో రానుంది. ఈ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ‘మా’ టీవీలో ప్రసారమవుతోంది. ‘‘ఇలాంటి చిత్రాల్ని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం ఆరేడు బౌండ్ స్క్రిప్టులతో ప్రముఖ నటీనటుల్ని కలిశాను. ఈ నెలలోనే కొత్త సినిమా ప్రకటన చేస్తున్నా’’ అని నాలుగేళ్ళ పాటు అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ చేసిన అయోధ్యకుమార్ చెప్పారు. -
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి....మనం, మిణుగురులు
వచ్చే ఏడాదికి ఆస్కార్ అవార్డు ఎంట్రీల సందడి ఇప్పుడే మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తమ విదేశీచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడానికి వివిధ భారతీయ భాషల నుంచి 30 సినిమాలు మన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఒకటి - అక్కినేని నటించిన ఆఖరు సినిమా ‘మనం’ కాగా, రెండోది - నిజజీవిత అంధ విద్యార్థులతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ‘మిణుగురులు’. ఇప్పటికే జాతీయ అవార్డును అందుకున్న బెంగాలీ చిత్రం ‘జతీశ్వర్’, మరాఠీ చిత్రం ‘ఫండ్రీ’, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ ‘షాహిద్’లు కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే, పాపులర్ సినిమాలైన ‘మర్దానీ’, ‘ఫిల్మిస్తాన్’, సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్‌లీలా’, ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీ కోమ్’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం నుంచి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ‘కోచ్చడయాన్’, ‘కదై.. తిరైక్కదై.. వసనమ్... ఇయక్కమ్’ చిత్రాలు, ఇంకా కొంకిణి తదితర భాషా చిత్రాలు సైతం మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళాలని ఉత్సాహపడుతున్నాయి. ఎఫ్.ఎఫ్.ఐ. నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ ఈ బుధవారం నుంచి ఈ చిత్రాలను వీక్షించి, మన దేశం పక్షాన పంపే తుది ఎంట్రీని ఖరారు చేయనుంది. ‘‘ఈ సినిమాల స్క్రీనింగ్‌లన్నీ హైదరాబాద్‌లో జరగనున్నాయి. అన్ని చిత్రాలనూ కమిటీ చూసి, ఈ నెల 23న తన తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ చాంబర్) వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి. -
కారుచీకటిపై కాంతి రేఖలు
‘‘వాటర్‌ట్యాంకు కడిగి సంవత్సరం దాటింది... నీళ్లలో చిన్న చిన్న పురుగులొస్తున్నయి. కిచెన్ల సాలెగూడులు మీదపడుతున్నయి’’ ... ఈ మాటలు వేణు చెవులకు వినీ వినిపించనట్టుగా వినిపించేవి. కళ్ళు లేని అతనికి మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు కదలాడి కన్నీరుపెట్టించేవి. ‘‘ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాక ముప్ఫై నెలలు దాటింది. అప్పుచేసి హాస్టల్ నడిపిస్తున్నాను. నేనూ అంధుడిని కావడం వల్లేమో అధికారులకు కూడా లోకువైపోయాను’’... అంధుల ఆశ్రమం నడిపిస్తున్న భీమారావును ఆవేదనకు గురిచేస్తున్న వాస్తవమది. కళ్ళ ముందు వెక్కిరించే ఇలాంటి నిజాలు, మనసులోని వేదనలు, చూపున్నవారు చేస్తున్న మోసాలు ‘మిణుగురులు’ చిత్ర రూపంలో ఇప్పుడు వెండితెరపైకీ వచ్చాయి. ఆ వాస్తవాలను స్క్రీన్‌పై చూపే ప్రయత్నానికీ దృష్టి లోపమున్న వారే అండ అయ్యారు. చుట్టూ ఉన్న సమాజంలోని చీకటిపై వాళ్ళు వేసిన ఈ టార్చ లైట్ చూపున్నవారినీ ఆలోచనలో పడేస్తుంది. కళ్లతో చూస్తే అర్థం కాని కొన్ని వాస్తవాలను మనసుతో చూడండంటున్నారు విశాఖపట్నంలోని హెలన్‌కెల్లర్ అంధుల హాస్టల్ నిర్వాహకులు భీమారావు. ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నవారే కాదు... ముప్ఫై ఏళ్ల క్రితం భీమారావుతో కలిసి ఆ ఆశ్రమాన్ని స్థాపించిన హేమంత్‌కుమార్, బాబూరావు, వసంతకుమార్‌లు కూడా అంధులే. అందుకేనేమో సినిమా దర్శక - నిర్మాత అయోధ్యకుమార్కీ భీమారావుకీ మాట కుదిరింది. అంధ బాలబాలికల హాస్టల్ జీవితాల్లోని చీకటిని చూపే ప్రయ త్నమైన ‘మిణుగురులు’కు తమ ఆశ్రమం నుంచి అండగా నిలి చారు. ఈ సినిమాలో నటించడం కోసం నలభైమంది అంధ బాలబాలికలు అవసరమనుకున్న దర్శకుడు రెండు నెలలపాటు రాష్ర్టంలో చాలా ఆశ్రమాలకు తిరిగారు. ఆయన తిరిగింది అంధుల కోసమే కాదు పరిస్థితులు తెలుసుకోడానికి కూడా. వాస్తవాల కోసం... సినిమాలో నటించడం అంటే చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. కారణం అందరికీ తెలిసిందే... వెండితెరపై వారిని వారు చూసుకుని మురిసిపోవచ్చు. కాని అంధులు ముందుకు రావడంలో అలాంటి సరదాకు అవకాశం ఎక్కడిది? మరి ఎవరి కోసం వాళ్లు మూడునెలలపాటు తిప్పలుపడ్డారు. ‘‘మా అన్నయ్య, తమ్ముడు కూడా అంధులే. అందుకే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్నికి కూడా ఇద్దరు పిల్లలు. వారికి కళ్లు కనపడతాయి. నేను, అన్నయ్య డిగ్రీ చదువుకున్నాం. తమ్ముడు ఇంటర్ పూర్తిచేశాడు. నేను మెహదీపట్నం దగ్గర సాలార్జంగ్ కాలనీ అంధుల ఆశ్రమంలో ఉంటున్నాను. మాది నల్గొండలోని వలిగొండ దగ్గర వేములకొండ గుట్ట గ్రామం. అమ్మ అక్కడే చిన్న హోటల్ నడుపుతుంది. ‘మిణుగురులు’లో నటించినందుకు ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా కథనం కళ్లున్నవారికి కొత్తగాని మాకు కాదు. చూపున్నవారికి మేం ఎంత లోకువో మాకు మాత్రమే తెలుసు. నా చిన్నప్పుడు వినపడ్డ కొన్ని మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతుంటాయి. సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆనంద్. కామెడీ క్యారెక్టర్ చేశాను’’ అని చెప్పాడు వేణు. నటించాల్సిన పని లేదు... హెలెన్‌కెల్లర్ హాస్టల్ విద్యార్థి శంకర్ సినిమాలో ‘చందు’ క్యారెక్టర్ చేశాడు. ‘‘మాది విజయనగరం దగ్గర బొబ్బిలి. నాన్న వంటపాత్రలు తయారుచేస్తారు. ‘మిణుగురులు’ మా అంధుల సినిమా మాత్రమే కాదు...కళ్లుండి కూడా మా బాధల్ని పట్టించుకోనివారి కోసం తీసిన సినిమా’’ అని శంకర్ చెప్పే మాటలు అక్షరసత్యాలు. ‘‘శ్రీకాకుళంలోని పొందూరు దగ్గర మారుమూల గ్రామం మాది. నాన్న వ్యవసాయం చేస్తారు. నేను గత ఏడాది ఎమ్ఎ పూర్తిచేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుకుమార్. ఇందులో మాతోపాటు కళ్లున్న వారు కూడా కాంటాక్ట్ లెన్స పెట్టుకుని నటించారు. అయితే వారికంటే మేం చాలా సులువుగా నటించా మన్నారు అందరూ’’ అని ఎంతో హుషారుగా చెప్పాడు రాము. సినిమా చూసినా చాలు... ‘రాష్ర్టంలో ఉన్న హాస్టళ్లన్నీ తిరిగి చూడలేరు కాబట్టి మిణుగురులు సినిమా చూస్తే కొంతైనా అవగాహన వస్తుంది’ అని అంటాడు ఈ సినిమాలో ‘సునీల్’ పాత్ర పోషించిన పరమేశ్. వాస్తవాలను చిత్రీకరించడం కోసం... ‘‘నటనంటే ఏంటో తెలియని అంధులతో సినిమా చిత్రీకరణ అనగానే దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుంది. కానీ నాకు మిగతావారితో పోలిస్తే అంధుల సన్నివేశాలే సులువుగా అనిపించాయి’’ అని అంటారు అయోధ్యకుమార్. పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూళ్ల చుట్టూ తిరగకుండా అంధుల ఆశ్రమాల్లో అడుగుపెట్టిన అయోధ్యకుమార్ తెలుగు ప్రేక్షకులకి ఓ నలభైమంది రియల్హీరోలను పరిచయం చేశారనడంలో సందేహం లేదు. - భువనేశ్వరి, ఫొటోలు: పి. ఎన్ మూర్తి కళ్ళు తెరిపించే ప్రయత్నం ‘‘అయోధ్యకుమార్‌గారు తన సినిమాలో నటించడానికి అంధ విద్యార్థులు కావాలని అడగ్గానే నిమిషమైనా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కథ మొత్తం విన్నాక కెమెరా మా వైపే పెట్టారని అర్థమయింది. నేను ఒప్పుకున్నది ఓ హాస్టల్ యజమానిగా కాదు...ఓ అంధుడిగా. ‘ఆశ్రమాల్లో ఉండే అంధుల పట్ల ఎంతమంది నిజాయితీగా మసలుకుంటున్నారు? సినిమా రూపంగా అయినా కొందరి కళ్లు తెరిపించగల’మన్న అయోధ్యకుమార్తో ఏకీభవించాను. ఆయన ఎంచుకున్న 35 మంది అంధుల్ని మా హాస్టల్ నుంచి మూడునెలలపాటు సినిమా చిత్రీకరణకు పంపించాను. ఈ సినిమా చూసైనా అంధులను సాటివారిగా భావిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భీమారావు. -
మిణుగురులుతో నా లక్ష్యం నెరవేరింది
కొన్ని సినిమాలు మనసుని తాకుతాయి. అంతకుముందు ఎన్నడూ కలగని ఓ రకమైన ఫీల్‌ని కలుగజేస్తాయి. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా వెంటాడతాయి. ‘మిణుగురులు’ ఈ కోవకి చెందిన సినిమానే. వసతి గృహాల్లో ఉండే అంథ బాల, బాలికల అవస్థలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత ఆయోధ్యకుమార్తో జరిపిన సంభాషణ... మొదటి సినిమా అంటే ‘సేఫ్’గా ఏ లవ్స్టోరీయో తీస్తుంటారు. కానీ, మీరు మొదటి ప్రయత్నంలోనే పెద్ద రిస్క్ తీసుకున్నారెందుకని? మీరన్నట్లు ‘మిణుగురులు’ చాలా రిస్కీ ప్రాజెక్ట్. నా మొదటి సినిమాకి జాతీయ, అంతర్జాతీయంగా మంచి స్కోప్ ఉన్న కథాంశం అయితే బాగుంటుందనుకుని ఈ సినిమా చేశాను. నా లక్ష్యం నెరవేరింది. అదే నేను ఏ లవ్స్టోరీయో, రొమాంటిక్ కామెడీ మూవీయో చేసి ఉంటే, ఇంత రీచ్ ఉండేది కాదు. ఆ మధ్య బెంగళూరులో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ ఇండియన్ సినిమా’ అవార్డ్ వచ్చింది. ఇంకా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ సినిమా ఎంపికైంది. సినిమాని చూసిన ప్రతిఒక్కరూ హార్ట్ టచింగ్ అంటున్నారు. అసలు మీ బ్యాగ్రౌండ్ ఏంటి? మెరైన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత, సాఫ్ట్వేర్ జాబ్ నిమిత్తం యూఎస్ వెళ్లాను. అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. యూఎస్‌లోనే కొన్ని టెలీఫిల్మ్స్ తీశాను. టీబీఎస్ చానల్లో పని చేశాను. ఓ తెలుగువాడిగా తెలుగు సినిమాలు తీయాలనే తపనతో ఇక్కడికొచ్చేశాను. సినిమాల మీద ఆసక్తి ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? మా నాన్నగారు డ్రామాల్లో యాక్ట్ చేసేవారు. నాక్కూడా క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టం. టెన్త్ చదువుతున్నప్పుడు డెరైక్టర్ అవ్వాలనే కోరిక బలపడింది. అందుకే, యూఎస్‌లో ఫిలిం కోర్స్ చేశాను. వసతి గృహాలు ఎలాంటి దయనీయ స్థితిలో ఉంటాయో ‘మిణుగురులు’లో చూపించారు. అలా ఉంటాయని మీకెలా తెలుసు? ఈ కథ అనుకున్న తర్వాత నేను చాలా బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. వాటిల్లో ఎక్కువ శాతం హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకు, ఈ సినిమాలో పై అంతస్తులో ఉన్న బాత్రూమ్ నుంచి కారే నీళ్లు పిల్లలు అన్నం తినే ప్లేట్స్‌లో పడుతుంటాయి కదా. ఓ స్కూల్లో అచ్చం అలానే జరిగింది. అలాగే వార్డెన్ చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు కదా. ఇలాంటివన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా చూపించినవే. ఈ చిన్న సినిమాకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా? సుహాసిన్, ఆశిష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్‌లు సీనియర్ ఆర్టిస్టులు. ఇది ప్రయోజనాత్మక చిత్రం కాబట్టి వాళ్లు పారితోషికం కొంత తగ్గించుకున్నారు. కానీ, సినిమా క్వాలిటీగా ఉండాలని ముంబయ్‌లోని స్టూడియోలో సౌండ్ డిజైన్ చేశాం. అమెరికా నుంచి కొంతమంది టెక్నీషియన్లు వచ్చారు. హాస్టల్ సెట్ వేశాం. షూటింగ్‌కే 90 రోజులు పట్టింది. సినిమా విడుదలకు ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా? ఈ విషయంలో దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన ఈ సినిమా చూసి, విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన వల్లనే ఈ సినిమాకు మంచి థియేటర్లు దొరికాయి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలొస్తాయి. -
దాసరి సమర్పణలో మిణుగురులు
‘‘నా సొంతచిత్రాలకు తప్ప, ఇంతవరకూ బయటి చిత్రాలకు సమర్పకునిగా నా పేరు వేసుకోలేదు. కానీ ‘మిణుగురులు’ సినిమా చూశాక నావంతుగా ఏదైనా చేయాలనిపించింది. అందుకే మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నాం. ఇందులో హృదయాన్ని స్పృశించే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప సినిమా ఇది’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. 48 మంది అంధ బాలలతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మిణుగురులు’. అయోధ్య కుమార్ మాట్లాడుతూ -‘‘దాసరిగారు ముందుకు రాబట్టే నా సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం వెనుక చాలామంది కష్టం ఉంది’’ అన్నారు. -
ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా ప్రదర్శించాలి - శేఖర్ కమ్ముల
‘‘ఇలాంటి కథతో సినిమా చేసిన అయోధ్యగారికి కంగ్రాట్స్. నేను ఆయనంత ధైర్యం చేయలేను. ఇంతమంది పిల్లలకు శిక్షణ ఇచ్చి చేయించడమనేది చాలా రిస్క్. ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా వేసి చూపించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు. రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకంపై అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మిణుగురులు’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా అయోధ్య కుమార్ మాట్లాడుతూ -‘‘40 మంది అంధులైన బాలలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు’’ అనితెలిపారు. తారే జమీన్ పర్, బర్ఫీ తరహాలో ఇదో విభిన్న చిత్రమని నటుడు దీపక్ చెప్పారు. ప్రభుత్వం తరపున ఈ చిత్రానికి సబ్సిడీ రావడానికి తన వంతు ప్రయత్నిస్తానని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు జోస్యభట్ల, మంచు లక్ష్మీ, సునీల్ కుమార్‌రెడ్డి, కాసు ప్రసాద్‌రెడ్డి, వంశీకృష్ణ, సన, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.