మిణుగురులుతో నా లక్ష్యం నెరవేరింది
మిణుగురులుతో నా లక్ష్యం నెరవేరింది
Published Mon, Jan 27 2014 11:33 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
కొన్ని సినిమాలు మనసుని తాకుతాయి. అంతకుముందు ఎన్నడూ కలగని ఓ రకమైన ఫీల్‌ని కలుగజేస్తాయి. థియేటర్ నుంచి బయటికొచ్చిన తర్వాత కూడా వెంటాడతాయి. ‘మిణుగురులు’ ఈ కోవకి చెందిన సినిమానే. వసతి గృహాల్లో ఉండే అంథ బాల, బాలికల అవస్థలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత ఆయోధ్యకుమార్‌తో జరిపిన సంభాషణ...
మొదటి సినిమా అంటే ‘సేఫ్’గా ఏ లవ్‌స్టోరీయో తీస్తుంటారు. కానీ, మీరు మొదటి ప్రయత్నంలోనే పెద్ద రిస్క్ తీసుకున్నారెందుకని?
మీరన్నట్లు ‘మిణుగురులు’ చాలా రిస్కీ ప్రాజెక్ట్. నా మొదటి సినిమాకి జాతీయ, అంతర్జాతీయంగా మంచి స్కోప్ ఉన్న కథాంశం అయితే బాగుంటుందనుకుని ఈ సినిమా చేశాను. నా లక్ష్యం నెరవేరింది. అదే నేను ఏ లవ్‌స్టోరీయో, రొమాంటిక్ కామెడీ మూవీయో చేసి ఉంటే, ఇంత రీచ్ ఉండేది కాదు. ఆ మధ్య బెంగళూరులో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ ఇండియన్ సినిమా’ అవార్డ్ వచ్చింది. ఇంకా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ సినిమా ఎంపికైంది. సినిమాని చూసిన ప్రతిఒక్కరూ హార్ట్ టచింగ్ అంటున్నారు.
అసలు మీ బ్యాగ్రౌండ్ ఏంటి?
మెరైన్ సైన్స్‌లో మాస్టర్స్ చేసిన తర్వాత, సాఫ్ట్‌వేర్ జాబ్ నిమిత్తం యూఎస్ వెళ్లాను. అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ కోర్స్ చేశాను. యూఎస్‌లోనే కొన్ని టెలీఫిల్మ్స్ తీశాను. టీబీఎస్ చానల్‌లో పని చేశాను. ఓ తెలుగువాడిగా తెలుగు సినిమాలు తీయాలనే తపనతో ఇక్కడికొచ్చేశాను.
సినిమాల మీద ఆసక్తి ఏర్పడటానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?
మా నాన్నగారు డ్రామాల్లో యాక్ట్ చేసేవారు. నాక్కూడా క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇష్టం. టెన్త్ చదువుతున్నప్పుడు డెరైక్టర్ అవ్వాలనే కోరిక బలపడింది. అందుకే, యూఎస్‌లో ఫిలిం కోర్స్ చేశాను.
వసతి గృహాలు ఎలాంటి దయనీయ స్థితిలో ఉంటాయో ‘మిణుగురులు’లో చూపించారు. అలా ఉంటాయని మీకెలా తెలుసు?
ఈ కథ అనుకున్న తర్వాత నేను చాలా బ్లైండ్ స్కూల్స్‌కి వెళ్లాను. వాటిల్లో ఎక్కువ శాతం హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకు, ఈ సినిమాలో పై అంతస్తులో ఉన్న బాత్రూమ్ నుంచి కారే నీళ్లు పిల్లలు అన్నం తినే ప్లేట్స్‌లో పడుతుంటాయి కదా. ఓ స్కూల్లో అచ్చం అలానే జరిగింది. అలాగే వార్డెన్ చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు కదా. ఇలాంటివన్నీ వాస్తవ సంఘటనల ఆధారంగా చూపించినవే.
ఈ చిన్న సినిమాకి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా?
సుహాసిన్, ఆశిష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్‌లు సీనియర్ ఆర్టిస్టులు. ఇది ప్రయోజనాత్మక చిత్రం కాబట్టి వాళ్లు పారితోషికం కొంత తగ్గించుకున్నారు. కానీ, సినిమా క్వాలిటీగా ఉండాలని ముంబయ్‌లోని స్టూడియోలో సౌండ్ డిజైన్ చేశాం. అమెరికా నుంచి కొంతమంది టెక్నీషియన్లు వచ్చారు. హాస్టల్ సెట్ వేశాం. షూటింగ్‌కే 90 రోజులు పట్టింది.
సినిమా విడుదలకు ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా?
ఈ విషయంలో దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆయన ఈ సినిమా చూసి, విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన వల్లనే ఈ సినిమాకు మంచి థియేటర్లు దొరికాయి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలొస్తాయి.
Advertisement