అల్లరే నటుడ్ని చేసింది | deepak interview with sakshi | Sakshi
Sakshi News home page

అల్లరే నటుడ్ని చేసింది

Published Tue, Sep 20 2016 7:48 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

అల్లరే నటుడ్ని చేసింది - Sakshi

అల్లరే నటుడ్ని చేసింది

  •  ‘మిణుగురులు’ నా జీవితంలో స్పెషల్
  •  ‘లెజెండ్’తో మరింత గుర్తింపు
  •  ‘లవ్ కె రన్’తో హీరోగా ప్రమోషన్
  •  బాల నటుడిగా 42 చిత్రాలు
  •  ఇదీ విశాఖ కుర్రోడు దీపక్ సరోజ్ సినీ ప్రొఫైల్
  • విశాఖపట్నం : దీపక్.. ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ, వెండితెరపై ఆ కుర్రాడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేయడం సహజం. కానీ ఆ పిల్లాడి అల్లరిని తట్టుకోవడం మాత్రం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కానీ వారికి అప్పుడు తెలియదు..తమ పిల్లాడిలో ఉన్నది అల్లరి కాదు ‘హైపర్ యాక్టివ్’అని. (ఇటీవల ఓ చిత్రంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు). అయితే అతని ఇష్టాన్ని గుర్తించగలిగారు. డాన్స్‌మాస్టర్ శివకుమార్ వద్ద చేర్పించారు. అల్లరి చేసే సమయం ఇవ్వకుండా స్మిమ్మింగ్, స్కేటింగ్, క్యాషియో వంటివి నేర్పించే వారు. అలా తెలియకుండానే వినోద సంబంధిత రంగాలతో ఆ పిల్లాడు మమేకమైపోయాడు. వాటికి అలవాటు పడి, ఇష్టంగా మార్చుకున్నాడు.
     
    తన డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో బహుమతులు అందుకోవడం ప్రారంభించాడు. అప్పటికి అతని వయసు కేవలం ఐదేళ్లు. ఆ తర్వాత ప్రముఖ నటనా శిక్షకుడు సత్యానంద్ వద్దకు చేరడంతో దీపక్ జీవితం పూర్తిగా మారిపోయింది. బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టేలా చేసింది. మిణుగురులు అనే చిత్రంతో ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్లి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 42 చిత్రాల్లో బాల నటుడిగా తానేంటో నిరూపించుకున్న దీపక్ తాజాగా లవ్ కె రన్ చిత్రంతో హీరో అయ్యాడు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.


    సాక్షి: బాలనటుడిగా ఇప్పటి వరకూ చాలా చిత్రాల్లో నటించారు. ఎలా మొదలైంది మీ ప్రస్థానం.
    దీపక్ :
    సినిమాల్లోకి రావాలని అసలు అనుకోలేదు. చిన్నప్పుడు నా అల్లరి భరించలేక అమ్మా, నాన్న నాకు డ్యాన్స్ నేర్పించారు. ఐదేళ్ల వయసులో సత్యానంద్ మాస్టర్ దగ్గర నటనలో శిక్షణ ఇప్పించారు. అప్పట్లో ఓ టీవీ చానల్‌లో డుండుం డిగాడిగా అనే డాన్స్ ప్రోగ్రాం వచ్చేది. దానిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా పెదబాబు చిత్రం మొదలుపెడుతున్నప్పుడు ఆయన చిన్నప్పటి పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఆ వెంటనే ఆర్య చిత్రంలో అవకాశం వచ్చింది.  ప్రారంభంలోనే పెద్ద చిత్రాల్లో అడుగుపెట్టడంతో అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. అలా ఇప్పటికి 42 చిత్రాల్లో నటించాను.
     
    సాక్షి: వాటిలో  ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే..
    దీపక్ :
    అతడు, భద్ర, పౌర్ణమి, అసాధ్యుడు, డాన్, సోగ్గాడు, ఆంధ్రుడు, బావ, వంటి చాలా చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. నా జీవితంలో ‘మిణుగురులు’ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చిత్రానికి సెలక్షన్లకు వెళ్లినపుడు కళ్లు కనిపించని పిల్లాడ్ని ఇంటికి వచ్చిన వ్యక్తి అవమానిస్తే ఎలా స్పందిస్తాడో చేసి చూపించమని అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి చెప్పినపుడు పది నిమిషాలు సమయం  ఇవ్వండి పాత్ర ను ఇమాజిన్ చేసుకుని  చేస్తానన్నాను.

    ఆ మాటే ఆయనకు నచ్చిందని 15 రోజుల తర్వాత యు ఆర్ సెలెక్ట్‌టెడ్ అని చెబుతూ అన్నారు. 800 మంది ఉన్న పోటీలో నేను సెలెక్ట్ కావడం ఇప్పటికీ ఆశ్చర్యమే. మిణుగురులు కోసం 40 కిలోల బరువు సహజంగా తగ్గాను. ఆ కష్టం ఆస్కార్ వరకూ వెళ్లినపుడు మర్చిపోయాను. ఆ చిత్రం తర్వాత మళ్లీ పూర్తి భిన్నమైన ఛాలెంజింగ్ రోల్ ‘లెజెండ్’లో దొరికింది. బాలయ్య చిన్నప్పటి పాత్ర అది.  తర్వాత రాజేంద్రప్రసాద్‌తో టామీ చిత్రంలో నటించి కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాను.
     
    సాక్షి: చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. దాని ప్రభావం చదువుపై పడలేదా?
    దీపక్ :
    లేదు..నేను మొదట్నుంచీ బాగా చదువుతాను. టెన్త్‌లో 95 పర్సంట్ మార్క్స్ వచ్చాయి. చెన్నై ఎస్‌ఆర్‌ఎంలో ఇటీవలే బీబీఎం పూర్తి చేశాను. ఎంబీఏ చేయడానికి సిద్ధమవుతున్నాను. నిజానికి నటనా రంగం నాకు గిఫ్ట్‌గా దొరికింది. నాకు నేనుగా నేర్చుకున్నది క్రికెట్. అదంటే చాలా ఇష్టం. ఓ రోజు లెజెండ్ సినిమా సెట్‌లో బాల కృష్ణను అవుట్ చేసి ‘వీడు ఫర్‌ఫెక్ట్’ అనిపించుకున్నాను. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో కూడా పాల్గొన్నాను. సీసీఎల్‌కు ఆడే అవకాశం ఉంది.
     
    సాక్షి: ఇండస్ట్రీలో ఎవరంటే ఇష్టం
    దీపక్ :
    ఒక్కరని చెప్పడం కష్టం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అయితే వ్యక్తి గతంగా చిరంజీవి అంటే పిచ్చి. ఇప్పటి హీరోల్లో అందరూ ఇష్టమే. రామానాయుడు వంటి పెద్దవాళ్లు నువ్ పెద్దవాడివి ఎప్పుడవుతావురా హీరోని చేద్దాం అనేవారు. విశ్వనాథ్ వంటి గొప్పవారు నా నటనను మెచ్చుకునేవారు. టామీ చిత్రం చూసి ఎమ్మెస్ నారాయణ పిలిచి అభినందించారు.
     

    సాక్షి: భవిష్యత్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు
    దీపక్ :
    హీరోగా కంటే నటుడిగా అందరికీ గుర్తుండాలనుకుంటాను.ప్రయోగాలు చేయడం ఇష్టం. కమల్‌హాసన్, నసీరుద్దీన్‌షా,విక్రమ్, కోటా శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్ వంటి వాళ్ల నటనను చూసి నేర్చుకుంటుంటాను. ‘లవ్ కె రన్’ కూడా మంచి కథ. ఈ చ్రితంలో  మళయాల హీరోయిన్ మాళవిక మీనన్ నాకు జతగా చేసింది. ఇక ముందు చేయబోయే ప్రాజెక్టులపై మరింత శ్రద్ధ అవసరం. చదువుకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మంచి అవకాశం కోసం ఎదురు చూడాలనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement