కారుచీకటిపై కాంతి రేఖలు | Helen Keller Hostel for Blind in visakhapatnam | Sakshi
Sakshi News home page

కారుచీకటిపై కాంతి రేఖలు

Published Mon, Feb 3 2014 11:01 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

Helen Keller Hostel for Blind in visakhapatnam

 ‘‘వాటర్‌ట్యాంకు కడిగి సంవత్సరం దాటింది... నీళ్లలో చిన్న చిన్న పురుగులొస్తున్నయి. కిచెన్‌ల సాలెగూడులు మీదపడుతున్నయి’’ ... ఈ మాటలు వేణు చెవులకు వినీ వినిపించనట్టుగా వినిపించేవి. కళ్ళు లేని అతనికి మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు కదలాడి కన్నీరుపెట్టించేవి.
 
 ‘‘ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాక ముప్ఫై నెలలు దాటింది. అప్పుచేసి హాస్టల్ నడిపిస్తున్నాను. నేనూ అంధుడిని కావడం వల్లేమో అధికారులకు కూడా లోకువైపోయాను’’... అంధుల ఆశ్రమం నడిపిస్తున్న భీమారావును ఆవేదనకు గురిచేస్తున్న వాస్తవమది.
 
కళ్ళ ముందు వెక్కిరించే ఇలాంటి నిజాలు, మనసులోని వేదనలు, చూపున్నవారు చేస్తున్న మోసాలు ‘మిణుగురులు’ చిత్ర రూపంలో ఇప్పుడు వెండితెరపైకీ వచ్చాయి. ఆ వాస్తవాలను స్క్రీన్‌పై చూపే ప్రయత్నానికీ దృష్టి లోపమున్న వారే అండ అయ్యారు. చుట్టూ ఉన్న సమాజంలోని చీకటిపై వాళ్ళు వేసిన ఈ టార్‌‌చ లైట్ చూపున్నవారినీ ఆలోచనలో పడేస్తుంది.

 
కళ్లతో చూస్తే అర్థం కాని కొన్ని వాస్తవాలను మనసుతో చూడండంటున్నారు విశాఖపట్నంలోని హెలన్‌కెల్లర్ అంధుల హాస్టల్ నిర్వాహకులు భీమారావు. ఆ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నవారే కాదు... ముప్ఫై ఏళ్ల క్రితం భీమారావుతో కలిసి ఆ ఆశ్రమాన్ని స్థాపించిన హేమంత్‌కుమార్, బాబూరావు, వసంతకుమార్‌లు కూడా అంధులే. అందుకేనేమో సినిమా దర్శక - నిర్మాత అయోధ్యకుమార్‌కీ భీమారావుకీ మాట కుదిరింది.

అంధ బాలబాలికల హాస్టల్ జీవితాల్లోని చీకటిని చూపే ప్రయ త్నమైన ‘మిణుగురులు’కు తమ ఆశ్రమం నుంచి అండగా నిలి చారు. ఈ సినిమాలో నటించడం కోసం నలభైమంది అంధ బాలబాలికలు అవసరమనుకున్న దర్శకుడు రెండు నెలలపాటు రాష్ర్టంలో చాలా ఆశ్రమాలకు తిరిగారు. ఆయన తిరిగింది అంధుల కోసమే కాదు పరిస్థితులు తెలుసుకోడానికి కూడా.
 
వాస్తవాల కోసం...
 
సినిమాలో నటించడం అంటే చాలామంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. కారణం అందరికీ తెలిసిందే... వెండితెరపై వారిని వారు చూసుకుని మురిసిపోవచ్చు. కాని అంధులు ముందుకు రావడంలో అలాంటి సరదాకు అవకాశం ఎక్కడిది? మరి ఎవరి కోసం వాళ్లు మూడునెలలపాటు తిప్పలుపడ్డారు. ‘‘మా అన్నయ్య, తమ్ముడు కూడా అంధులే. అందుకే నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. పిన్నికి కూడా ఇద్దరు పిల్లలు. వారికి కళ్లు కనపడతాయి. నేను, అన్నయ్య డిగ్రీ చదువుకున్నాం. తమ్ముడు ఇంటర్ పూర్తిచేశాడు.

నేను మెహదీపట్నం దగ్గర సాలార్జంగ్ కాలనీ అంధుల ఆశ్రమంలో ఉంటున్నాను. మాది నల్గొండలోని వలిగొండ దగ్గర వేములకొండ గుట్ట గ్రామం. అమ్మ అక్కడే చిన్న హోటల్ నడుపుతుంది. ‘మిణుగురులు’లో నటించినందుకు ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా కథనం కళ్లున్నవారికి కొత్తగాని మాకు కాదు. చూపున్నవారికి మేం ఎంత లోకువో మాకు మాత్రమే తెలుసు. నా చిన్నప్పుడు  వినపడ్డ కొన్ని మాటలు నాకు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతుంటాయి.   సినిమాలో నా క్యారెక్టర్ పేరు ఆనంద్. కామెడీ క్యారెక్టర్ చేశాను’’ అని చెప్పాడు వేణు.
 
 నటించాల్సిన పని లేదు...
 
 హెలెన్‌కెల్లర్  హాస్టల్ విద్యార్థి శంకర్ సినిమాలో ‘చందు’ క్యారెక్టర్ చేశాడు. ‘‘మాది విజయనగరం దగ్గర బొబ్బిలి. నాన్న వంటపాత్రలు తయారుచేస్తారు.   ‘మిణుగురులు’ మా అంధుల సినిమా మాత్రమే కాదు...కళ్లుండి కూడా మా బాధల్ని పట్టించుకోనివారి కోసం తీసిన సినిమా’’ అని శంకర్ చెప్పే మాటలు అక్షరసత్యాలు. ‘‘శ్రీకాకుళంలోని పొందూరు దగ్గర మారుమూల గ్రామం మాది. నాన్న వ్యవసాయం చేస్తారు. నేను గత ఏడాది ఎమ్‌ఎ పూర్తిచేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు సుకుమార్. ఇందులో మాతోపాటు కళ్లున్న వారు కూడా కాంటాక్ట్ లెన్‌‌స పెట్టుకుని నటించారు. అయితే వారికంటే మేం చాలా సులువుగా నటించా మన్నారు అందరూ’’ అని ఎంతో హుషారుగా చెప్పాడు రాము.
 
 సినిమా చూసినా చాలు...
 
 ‘రాష్ర్టంలో ఉన్న హాస్టళ్లన్నీ తిరిగి చూడలేరు కాబట్టి మిణుగురులు సినిమా చూస్తే కొంతైనా అవగాహన వస్తుంది’ అని అంటాడు ఈ సినిమాలో ‘సునీల్’ పాత్ర పోషించిన పరమేశ్. వాస్తవాలను చిత్రీకరించడం కోసం... ‘‘నటనంటే ఏంటో తెలియని అంధులతో సినిమా చిత్రీకరణ అనగానే దర్శకుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికైనా అర్థమవుతుంది. కానీ నాకు మిగతావారితో పోలిస్తే అంధుల సన్నివేశాలే సులువుగా అనిపించాయి’’ అని అంటారు అయోధ్యకుమార్. పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూళ్ల చుట్టూ తిరగకుండా అంధుల ఆశ్రమాల్లో అడుగుపెట్టిన అయోధ్యకుమార్ తెలుగు ప్రేక్షకులకి ఓ నలభైమంది రియల్‌హీరోలను పరిచయం చేశారనడంలో సందేహం లేదు.
 
 - భువనేశ్వరి, ఫొటోలు: పి. ఎన్ మూర్తి
 
 కళ్ళు తెరిపించే ప్రయత్నం
 ‘‘అయోధ్యకుమార్‌గారు తన సినిమాలో నటించడానికి అంధ విద్యార్థులు కావాలని అడగ్గానే నిమిషమైనా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. కథ మొత్తం విన్నాక కెమెరా మా వైపే పెట్టారని అర్థమయింది. నేను ఒప్పుకున్నది ఓ హాస్టల్ యజమానిగా కాదు...ఓ అంధుడిగా. ‘ఆశ్రమాల్లో ఉండే అంధుల పట్ల ఎంతమంది నిజాయితీగా మసలుకుంటున్నారు? సినిమా రూపంగా అయినా కొందరి కళ్లు తెరిపించగల’మన్న అయోధ్యకుమార్‌తో ఏకీభవించాను. ఆయన ఎంచుకున్న 35 మంది అంధుల్ని మా హాస్టల్ నుంచి మూడునెలలపాటు సినిమా చిత్రీకరణకు పంపించాను. ఈ సినిమా చూసైనా అంధులను సాటివారిగా భావిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు భీమారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement