చాలా కష్టపడ్డాను
‘మిణుగురులు’తోఅరంగేట్రం
‘నిర్మలా కాన్వెంట్’లో చక్కటి పాత్ర
వరుస చిత్రాలతో అలరిస్తున్న రమణ
పెందుర్తి: వెండితెరపై పెందుర్తికి చెందిన పీలా రమణ మెరుస్తున్నాడు. వరుస చిత్రాలతో తన జోరు చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అరంగేట్రం ఆలస్యమైనా వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకుని సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాడు. ఆస్కార్ బరిలో నిలిచిన తెలుగు చిత్రం ‘మిణుగురులు’తో అరంగేట్రం చేసిన పీలా రమణ అనతికాలంలోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
పలు చిత్రాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని తన జోరు చూపిస్తున్నాడు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రతో రూపొందిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో రమణ చక్కని పాత్ర పోషించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. దీంతోపాటు రమణ నటించిన ‘ఆకలి’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. సంపూర్ణేష్‌బాబు ‘కొబ్బరిమట్ట’తో పాటు మరికొన్ని చిత్రాలు, టీవీ సీరియళ్లలో కూడా రమణ నటిస్తున్నాడు.
‘మిణుగురులు’ల్లో మెరిసి..
పెందుర్తిలో నివాసం ఉంటున్న రమణది మధ్య తరగతి కుటుంబం. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద ఓ పాన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయడం అలవాటు. ఆ క్రమంలోనే సినీరంగంపై మక్కువ పెంచుకున్నాడు. ఇదే క్రమంలో సినీ అవకాశాల కోసం చాలాకాలం ప్రయత్నిస్తూ చివరకు సఫలమయ్యాడు. 2014లో ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం రేసులో బరిలో నిలిచిన ‘మిణుగురులు’లో డర్టీ పోలీస్ పాత్రలో రమణ అరంగేట్రం చేశారు. తర్వాత 30 వరకు చిత్రాల్లో పలు పాత్రలు పోషించారు. సినీ పరిశ్రమతో పాటు అభిమానులు, పెద్దల మన్ననలు పొందారు.
కల నెరవేరింది
ఆస్కార్ రేసులో నిలిచిన చిత్రంతో నా అరంగేట్రం మరిచిపోలేని అనుభూతి. తాజాగా నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించిన ‘నిర్మలా కాన్వెంట్’లో నటించాను. పెందుర్తి నుంచి చిత్ర పరిశ్రమకు వెళ్లే క్రమంలో చాలా కష్టపడ్డాను. చివరకు అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రతిభతో రానున్న కాలంలో మరింత రాణిస్తాను. విశాఖ సినిమా పరిశ్రమకు చాలా అనుకూలం. ఇక్కడకు పరిశ్రమ పూర్తిస్థాయిలో వస్తే నాలాంటి ఔత్సాహిక కళాకారులకు అవకాశాలు వస్తాయి.
- పీలా రమణ