నా పిల్లలకి  నా డ్యాన్స్‌  నచ్చదు | Telugu songs fill me with energy: Prabhu Deva | Sakshi
Sakshi News home page

నా పిల్లలకి  నా డ్యాన్స్‌  నచ్చదు

Published Wed, Aug 22 2018 2:07 AM | Last Updated on Wed, Aug 22 2018 12:53 PM

Telugu songs fill me with energy: Prabhu Deva - Sakshi

‘‘నా నటన చూసి బాగుందని థియేటర్లో ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నా ఎనర్జీ. నేను హ్యాపీగా, మరింత ఎనర్జీగా ఉండాలంటే తెలుగు సినిమాల్లోని పాటలు చూస్తా. ఆ పాటల్లో సెట్టింగ్స్, డ్యాన్స్‌ నాకు చాలా బాగా నచ్చుతాయి. ‘రంగస్థలం’ సినిమా చాలా బాగుంది’’ అని ప్రభుదేవా అన్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో  తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మి’. సి. కల్యాణ్, ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా ప్రభుదేవా చెప్పిన విశేషాలు.

విజయ్‌ ఫస్ట్‌ నన్ను కలిసినప్పుడు ‘లక్ష్మి’ చిత్రకథ చెప్పలేదు. డ్యాన్స్‌ బేస్డ్‌ ఫిల్మ్‌ చేయాలన్నాడు. డ్యాన్స్‌ నేపథ్యంలో ‘ఏబీసీడీ’ సినిమా చేశా. ఇప్పుడు చేసే చిత్రం ఇండియా లెవల్‌లో ఉండా లన్నాను. అలాగే ఉంటుందన్నాడు. ఇండియా మొత్తం వెతికి అద్భుతంగా డ్యాన్స్‌ చేసే పదిమంది పిల్లల్ని తీసుకొచ్చాడు. పూర్తిగా డ్యాన్స్‌ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ∙గురు శిష్యుల మధ్య కథే ఈ చిత్రం. నేను డ్యాన్స్‌ నేర్పిస్తుంటాను. ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ చిత్రంలో 4 నిమిషాల డ్యాన్స్‌ను సింగిల్‌ టేక్‌లో చేయడం జరిగింది. దీని కోసం నేను కూడా వారం ప్రాక్టీస్‌ చేశా. పిల్లలందరూ బాగా చేశారు. ప్రత్యేకించి దిత్య సూపర్బ్‌గా చేసింది. కష్టమైన స్టెప్స్‌ ఉండాలని పరేష్, రూయల్‌లకు చెప్పా. వారు చక్కగా కొరియోగ్రఫీ చేశారు. ∙‘లక్ష్మి’ చిత్రంలో కొరియోగ్రఫీలో నేను ఇన్‌వాల్వ్‌ కాలేదు. కేవలం నటించానంతే. నేను నటిస్తున్నప్పుడు డైరెక్షన్, కొరియోగ్రఫీలో కలగజేసుకోను. డైరెక్టర్‌గా డైరెక్షన్‌ గురించే ఆలోచిస్తా. కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు డ్యాన్స్‌ మాత్రమే నా మైండ్‌లో ఉంటుంది. ఒకటి చేస్తున్నప్పుడు మరో దాంట్లో ఇన్‌వాల్వ్‌ కాను. ‘లక్ష్మి’ టైటిల్‌ పాజిటివ్‌గా, బాగుందని నేనే పెట్టమని చెప్పా.

∙నాది, డైరెక్టర్‌ విజయ్‌ది విభిన్నమైన మనస్తత్వాలు అయినా మా ఇద్దరికీ సెట్‌ అయింది. అందుకే తనతో ‘అభినేత్రి, లక్ష్మి’ సినిమాలు చేశా. మా కాంబినేషన్‌లో ‘అభినేత్రి 2’ కూడా వస్తుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. ప్రస్తుతం పోలీసాఫీసర్‌గా చేస్తున్నా. 1948 కుల్ఫూ నేపథ్యంలో ఓ సినిమా, సీరియల్‌ థ్రిల్లర్‌గా మరో సినిమా చేస్తున్నా. జనవరిలో ఓ హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తా. ∙వేరే హీరోల పాటలకి కొరియోగ్రఫీ చేయాలని ఉన్నా ఎవ్వరూ పిలవడం లేదు (నవ్వుతూ). ఇటీవల ధనుష్‌కి ఓ పాటకి కొరియోగ్రఫీ చేశా. ‘ప్రేమికుడు 2’ చేసే ఏజ్‌ దాటిపోయా. ‘ప్రేమికుడు 10’ చేయమంటే చేస్తా (నవ్వుతూ).  ‘ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌’ అని ఫ్యాన్స్, ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తు్తంటే సంతోషంగా ఉంది. నా పిల్లలకి నా డ్యాన్స్‌ ఒక్కశాతం కూడా నచ్చదు. వేరేవాళ్ల డ్యాన్స్‌ 10% నచ్చుతుంది. ఎందుకో మరి? వాళ్లు అలా ఫిక్స్‌ అయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement