చెన్నై : వదిన జ్యోతికతో కలిసి తంబి చిత్రంలో నటించడం తనకు చాలా స్పెషల్ అని నటుడు కార్తీ పేర్కొన్నారు. వీరిద్దరూ అక్కాతమ్ముడుగా నటించిన చిత్రం తంబి. వైకాం 18 స్టూడియోస్ పతాకంపై సూరజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, షావుకారు జానకి, నికిలా విమల్ ముఖ్యపాత్రల్లో నటించారు. పాపనాశం చిత్రం ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన దీనికి గోవింద్ వసంత్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సూరజ్ మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఇక్కడ ఉన్న మిత్రులందరూ మార్గదర్శకులుగా ఉన్నారన్నారు. ఈ చిత్రానికి తారాగణం మంచి బలంగా నిలిచారన్నారు. నటి జ్యోతిక, కార్తీ, సత్యరాజ్, షావుకారు జానకి ఇలా అందరూ ఎంతగానో సహకరించినట్లు చెప్పారు. జీతు మంచి చిత్రాన్ని అందించారని అన్నారు. తంబి చిత్రం అందరికీ నచ్చుతుందని నిర్మాత పేర్కొన్నారు. నటి జ్యోతిక మాట్లాడుతూ కార్తీతో నటించడం గురించి ముందు తన గురించి ఒక విషయం చెప్పాలన్నారు. కార్తీ తనతో నటించే ఇతర నటీనటులకు సమాన స్థానాన్ని కల్పిస్తారని అన్నారు. నటుడు రజనీకాంత్ కూడా చంద్రముఖి చిత్రంలో నటిస్తున్నపుడు మొదటి రోజునే ఇది నీ చిత్రం. బాగా చెయ్యి. చంద్రముఖి పేరే నిన్ను గురించే పెట్టారు అని అన్నారన్నారు. ఆయనది అంత పెద్ద మనసా?అని అప్పుడు అనిపించిందన్నారు. అదేవిధంగా కార్తీ కూడా తనతో నటించేవారికి అంత స్థానాన్ని ఇస్తారని చెప్పారు.
దర్శకుడు జీతూ జోసఫ్ చాలా హృదయంమున్న దర్శకుడు అని పేర్కొన్నారు. నటుడు కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రం వెనుక రెండేళ్ల శ్రమ ఉందని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు జీతూజోసఫ్ ఇంతకు ముందు మోహన్‌లాల్, కమలహాసన్ వంటి ప్రముఖ నటుల చిత్రాలను చేయడంతో తనకు కాస్త భయం అనిపించిందన్నారు. అయితే తానూ ఊహించిన దానికి పూర్తి విరుద్ధంగా చాలా మృదులంగా, స్నేహితుడిలా మసలుకున్నారని అన్నారు. ఆర్టిస్టుల నుంచి తనకు ఏం కావాలో తెలివిగా తీసుకునే దర్శకుడని ప్రశంసించారు. ఈ చిత్రంలో వదిన జ్యోతికతో నటించడం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. ఈమె పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తారో చూసి ఆశ్యర్యపోయానన్నారు. వదినతో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ చిత్రంలో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సత్యరాజ్ మావయ్య లేకపోతే ఈ చిత్రం ఉండేది కాదన్నారు. కట్టప్ప పాత్రలో నటించడానికి ఆయనకు మించిన నటుడు ఇండియాలోనే లేరని కార్తీ పేర్కొన్నారు.నటుడు సూర్య మాట్లాడుతూ ఇది తనకు చాలా సొంతమైన చిత్రం అని పేర్కొన్నారు. సత్యరాజ్, జ్యోతిక, కార్తీ ఇలా పలువురు కలిసి నటించిన చిత్రం తంబి అని అన్నారు. ఇక చిన్న కాన్సెప్ట్ ఇంత పెద్ద చిత్రంగా రూపొందడం ఆశ్యర్యంగా ఉందన్నారు. గ్లిజరిన్ లేకుండా ఏడుస్తూ నటించడం తనకు రాదన్నారు. అలా నందా చిత్రంలో మాత్రం నటించానని చెప్పారు. అలాంటి సన్నివేశాలను కార్తీ చాలా సునాయాసంగా ఖైదీ చిత్రం వరకూ నటించడం తాను చూస్తున్నానని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు జీతు జోసఫ్ పాపనాశం చిత్రాన్ని బాహుబలి స్థాయిలో ఇండియా మొత్తం తీసుకెళ్లారని అన్నారు. అలాంటి దర్శకుడు ఈ చిత్రం చేయడం సంతోషం అని నటుడు సూర్య పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment