పెళ్లికి ముందు ఎమీ... పెళ్లి తర్వాత సమంత
పెళ్లికి ముందు ఎమిజాక్సన్ పెళ్లి తరువాత సమంత బాగా నటించారని నటుడు ధనుష్ పేర్కొన్నారు. కథానాయకుడిగా విజయపథంలో సాగుతున్న ఈయన తాజాగా సుందరీమణులు సమంత, ఎమిజాక్సన్‌లతో రొమాన్స్ చేసిన చిత్రం తంగ మగన్. ధనుష్ దీన్ని తన ఉండర్ బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. వేల ఇల్ల పట్టాదారి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత వేల్‌రాజ్ దర్శకత్వం వహించిన చిత్రం తంగమగన్. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు కట్టిన ఈ చిత్రం విడుదల హక్కుల్ని గోపురం ఫిలింస్ జి ఎన్ అన్భుసెళియన్ పొందారు. తంగమగన్ చిత్రం ఈ నెల18న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ధనుష్ శనివారం ఉదయం పత్రికల వారితో భేటీ అయ్యారు.ఆమాటా మంతి చూద్దాం.
ప్రశ్న: తంగమగన్ చిత్రం గురించి చెప్పండి?
జవాబు: ముందుగా ఈ చిత్రం గురించి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. తంగమగన్ చిత్రం వేల ఇల్లా పట్టాదారికి సీక్వెల్ కాదు. ఇది వేరే కథతో తెరకెక్కిన చిత్రం. తంగమగన్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేమ, హాస్యం, యాక్షన్ మొదలగు అంశాలతో కూడిన జనరంజకమైన కథా చిత్రం.
ప్రశ్న: చిత్రంలో మీకు తండ్రిగా నటించినదర్శకుడు కేఎస్ రవికుమార్ గురించి?
జవాబు: నా చిత్రం అనిచెప్పడం కాదు గాని తంగమగన్ చిత్రంలో కేఎస్ రవికుమార్ చాలా కీలక పాత్ర. ఆయన కూడా తాను పెద్ద దర్శకుడినన్న భావం లేకుండా చిత్ర దర్శకుడి సూచనల మేరకు చాలా బాగా నటించారు. ఇక నా తల్లిగా నటించిన రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సెట్‌లో ఉంటే అంతా సందడే. అంత జాలీగా ఉంటారు.
ప్రశ్న: కథానాయికలు సమంత, ఎమిజాక్సన్‌ల నటన గురించి?
జవాబు: పెళ్లికి ముందు ఎమిజాక్సన్, పెళ్లి తరువాత సమంత వారివారిపాత్రల్లో జీవించారు. అందుకే అంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నాను తంగమగన్ అన్నివర్గాల ప్రేక్షకులను, అదే సమయంలో నా అభిమానులను అలరిస్తుంది.
ప్రశ్న: మీరు రజనీకాంత్ చిత్రాల టైటిల్స్‌పై ఆసక్తి చూపుతున్నట్లున్నారు?
జవాబు: నేనే కాదు చాలా మంది రజనీ కాంత్ చిత్రాల టైటిల్స్‌ను వాడుకుంటున్నా రు. నిజం చెప్పాలంటే నా చిత్రాలకు కావాలని రజనీకాంత్ చిత్రాల పేర్లు పెట్టడంలేదు. అవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి తమిళమగన్ అనే పేరు పెట్టాలనుకున్నారు. అయితే చిత్ర నిర్మాత తంగమగన్ పేరును కోరుకున్నారు. నిర్మాతగా ఆయన ఆశను నెరవేర్చడం మాధర్మం కాబట్టి తంగమగన్ టైటిల్‌ను ఖాయం చేశాం.
ప్రశ్న: తంగమగన్‌లో కొత్తగా ఏమి చెప్పదలచుకున్నారు?
జవాబు: చిత్ర కథ కొత్తగా ఉంటుందని మేం చెప్పడంలేదు. అయితే చాలా హంబుల్‌గా ఉంటుంది. చిత్ర కథా నాయకుడి పెళ్లికి ముందు, పెళ్లి తరువాత జీవితమే తంగమగన్ చిత్రం.
ప్రశ్న: చిత్రంలో మీసం లేకుండా నటించినట్లున్నారు?
జవాబు: నిజానికి నా ఈ ఆకారానికి మీసం లేకుంటే బాగుండదు. అయినా యూత్‌గా కనిపించాలి కనుక మీసం లేకుండా నటించాల్సి వచ్చింది.
ప్రశ్న: ఉండర్‌బార్ ఫిలింస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పడానికి కారణం?
జవాబు: ప్రతిభావంతులైన నూతన కళాకారుల్ని ప్రోత్సహించాలన్నదే ప్రధాన ఉద్దేశం. నాసంస్థలో నిర్మించే ప్రతి చిత్రంలోనూ కనీసం ఒక్క శాఖలో నైనా కొత్త వారికి అవకాశం కల్పిస్తాను. నా ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాననే అనుకుంటున్నాను.
ప్రశ్న: కాక్కముట్టై లాంటి చిత్రం మళ్లీ ఎప్పుడు నిర్మిస్తారు?
జవాబు: త్వరలోనే చేయనున్నాను. హిందీ చిత్ర రీమేక్‌లో అశ్విని అయ్యర్ దర్శకత్వంలో నటించనున్నాను. ఇందులో అమలాపాల్ నాయకిగా నటించనున్నారు. మరో విషయం ఏమిటంటే త్వరలో విడుదల కానున్న తాను నిర్మించిన విచారణై చిత్రం కాక్కముట్టై చిత్రం తరహాలో గొప్ప కథా చిత్రం. నాచిత్రం అని సగౌరవంగా చెప్పుకునే చిత్రంగా ఉంటుంది.
ప్రశ్న: మీ విజయం వెనుక ఉన్న ముగ్గురు పేర్లు చెప్పమంటే ఎవరని అంటారు?
జవాబు: నా తల్లిదండ్రుల ప్రార్థన, ఆ తరువాత నాభార్య, ఆపై దైవం. దైవానుగ్రహం లేనిదే ఎవరు ఏమీ సాధించలేరు.
ప్రశ్న: ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
జవాబు: నెగటివ్ పాత్రలో నటించాలన్న కోరిక ఇటీవల బలంగా కలుగుతోంది.అది ఎలాంటి దైనా సరే ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా ఉండాలి. నటన పరంగా నేను ఆడుకోవాలి.
ప్రశ్న : మీరు నటించే చిత్రాల గురించి మీ అన్నయ్య సెల్వరాఘవన్‌తో చర్చిస్తారా?
జవాబు: ఇద్దరం చర్చించుకుంటాం. అయితే ఒకరి చిత్రం విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు.
ప్రశ్న: మీ చిత్రాల ప్రభావం యువతపై చాలా ఉంటుంది. వారికి చక్కని సందేశం ఇచ్చే చిత్రాలు చేయవచ్చు?
జవాబు: పెద్దగా సందేశాలతో కూడిన చిత్రాలు చేయను గాని, నా స్థాయిలో చిన్న చిన్న మెసేజ్‌లతో కూడిన చిత్రాలు తప్పకుండా చేస్తాను.