మానవతా సౌధానికి కూలీలెవ్వరు? | The Bridge On The River Kwai (1957) | Sakshi
Sakshi News home page

మానవతా సౌధానికి కూలీలెవ్వరు?

Mar 15 2015 11:29 PM | Updated on Sep 2 2017 10:54 PM

మానవతా సౌధానికి కూలీలెవ్వరు?

మానవతా సౌధానికి కూలీలెవ్వరు?

చిన్నప్పటి నుంచీ నాకు సినిమా అంటే పిచ్చి కాదు... అంతకన్నా ఎక్కువే! ‘మాయాబజార్’, ‘లవకుశ’, ‘మూగ మనసులు’... ఇలా అదీ ఇదీ అని లేదు.

ఆర్.నారాయణమూర్తి
ప్రముఖ నటుడు-నిర్మాత-దర్శకుడు


హాలీవుడ్
‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ (1957)
అందుకే... అంత బాగుంది!


తారాగణం: విలియం హోల్డెన్, ఎలెక్ గినెస్, జాక్ హాకిన్స్, సెస్యూ హయకవా;
దర్శకుడు: డేవిడ్ లీన్; నిర్మాత: శామ్ స్పీగల్; స్క్రీన్‌ప్లే: కార్ల్ ఫోర్‌మ్యాన్, మైఖేల్ విల్సన్;
సంగీతం: మాల్కమ్ ఆర్నాల్డ్; కెమెరా: జాక్ హిల్యార్డ్; విడుదల: 1957 అక్టోబర్ 31 (తొలి ప్రివ్యూ),
1957 డిసెంబరు 18 (రిలీజ్); సినిమా నిడివి: 161 నిమిషాలు; నిర్మాణ వ్యయం: 28.4 లక్షల డాలర్లు
(దాదాపు రూ. 17 కోట్లు); వసూళ్లు: 3.06 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 183 కోట్లు)

 
చిన్నప్పటి నుంచీ నాకు సినిమా అంటే పిచ్చి కాదు... అంతకన్నా ఎక్కువే! ‘మాయాబజార్’, ‘లవకుశ’, ‘మూగ మనసులు’... ఇలా అదీ ఇదీ అని లేదు. సినిమా అంటే చాలు... చూసి తీరాల్సిందే! అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఒక హాలీవుడ్ సినిమా చూశా. దాని పేరు ‘టెన్ కమాండ్‌మెంట్స్’. పెద్దగా భాష అర్థం కాకపోయినా, ఆ సినిమా చూసి అలాగే ఉండిపోయా. ఏం సినిమా అండీ అది! ఒక్కసారి చూసినా వందసార్లు చూసినంత గుర్తుండిపోయింది. కొన్ని డైలాగులైతే, అదే యాసలో టకటకా చెప్పేయగలను. ‘‘ది ఉమన్ హీ లవ్స్ షల్ బేర్ బై చైల్డ్... ది సిటీ హీ బిల్డ్స్ విల్ బి ఆన్ మై నేమ్’’ అనే డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ‘బెన్‌హర్’, ‘ది గ్రేట్ ఎస్కేప్’, ‘స్పార్టకస్’ లాంటి సినిమాలు చాలా చూశా. ఇవన్నీ ప్రపంచ సినీగమనాన్ని మార్చేసిన సినిమాలు.

సినిమాల్లో వేషాల కోసం మద్రాసుకు వెళ్లాక, ఏ మాత్రం ఖాళీ దొరికినా అక్కడ మౌంట్‌రోడ్డులోని దేవి థియేటర్‌లో హాలీవుడ్ సినిమాలు తెగ చూసేవాణ్ణి. అన్ని సినిమాలూ నేల టిక్కెట్ కొని, తెర ముందు వరుసల్లో కూర్చొని చూసినవే! అంత గొప్ప సినిమాలను చాలా దగ్గర నుంచి చూడడం భలే వింతైన అనుభవం. ఇక, నన్ను బాగా కదిలించిన హాలీవుడ్ సినిమా - ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ (1957). ఈ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూశాను. సినిమా చివరలో వచ్చే ఎండ్ టైటిల్స్ వరకూ కదలకుండా చూసి, చివర్లో లేచి నిలబడి చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోతుంటాను.

రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. మానవ జాతిలో కొందరు నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంటారు. అదే సమయంలో మనలోనే రకరకాలుగా గూడు కట్టుకున్న ఈర్ష్యా అసూయా ద్వేషాలకు స్వార్థం, ఆధిపత్య ధోరణులతో మరికొందరు విధ్వంసానికి పాల్పడుతుంటారు. ఈ విచిత్రమైన పరిస్థితికి ఈ సినిమా నిలువుటద్దం. సామ్రాజ్యవాదం, ఇతరుల కన్నా అధికులమనే అహంకారం విషపురుగులా మనిషి మస్తిష్కంలోకి దూరి, తోటి మానవుల మనుగడను ఎలా శాసిస్తుందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రపంచం రెండుగా చీలిపోయింది. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధమైతే మరీ విధ్వంసకరం. జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు ఒక జట్టు. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, మిగిలిన దేశాలన్నీ ఎలైడ్ ఫోర్సెస్ (మిత్రరాజ్య సేనలు)గా ఏర్పడి మరోవైపు నిలిచి, యుద్ధభేరి మోగించాయి.

 ఆ పరిస్థితులనూ, సరిగ్గా అప్పుడే 1942- 43 ప్రాంతంలోని బర్మా రైల్వే నిర్మాణాన్నీ నేపథ్యంగా తీసుకొని, యథార్థ సంఘటనల చుట్టూ అల్లుకొన్న కాల్పనిక సన్నివేశాలతో ఫ్రెంచ్ భాషలో ఒక నవల వెలువడింది. బర్మాలోని క్వాయ్ నది మీద బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో వచ్చిన ఆ నవల పేరు - ‘బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ క్వాయ్’. రచయిత - పియర్రీ బౌలే. ఆ నవల ఆధారంగానే ఈ సినిమా తీశారు దర్శకుడు డేవిడ్ లీన్. అలాగే, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫిలిప్ టూసీ జ్ఞాపకాలు కూడా డేవిడ్ లీన్‌కు ఉపకరించాయి. కొలంబియా సంస్థ ఈ సినిమాను డెరైక్ట్ చేయమని తొలుత హోవార్డ్ హాక్స్‌ను అడిగింది. ఆయనకేమో ఈ కథ నచ్చలేదు. ఒక్క స్త్రీ పాత్ర కూడా లేని ఈ సినిమా ఆడే అవకాశం లేదని ఆయన తేల్చేశారు. దాంతో డేవిడ్ లీన్‌కు డెరైక్షన్ చాన్సు ఇచ్చారు. ఆయన తీసిన ఈ సినిమా ఇవాళ్టికీ చరిత్రలో చెరగని స్థానంలో నిలిచిపోయింది.

ఈ సినిమా కథ ఏమిటంటే... రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం, కొంతమంది బ్రిటిష్ సైనికుల్ని, అధికారుల్ని యుద్ధ ఖైదీలుగా బందీలను చేస్తుంది. వీళ్లను థాయ్‌లాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లోని ఓ దట్టమైన అడవికి తీసుకెళ్తారు. ఆ సమయంలో సైనిక రవాణా అవసరాల నిమిత్తం క్వాయ్ నది మీద బ్యాంకాక్ నుంచి రంగూన్‌కు రైలు వంతెన నిర్మాణానికి జపాన్ పూనుకుంటుంది. కానీ, నిర్మాణస్థలంలో లోపం ఉండడం వల్ల,  ఆ వంతెన కట్టడంలో విఫలమవుతుంటారు. కట్టిన ప్రతీసారి అది కూలిపోవడంతో తమ దగ్గర బందీలుగా ఉన్న ఎలైడ్ ఫోర్సెస్ సైనికులతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేద్దామని  నిర్ణయించుకుంటారు. అయితే, ‘జెనీవా ఒప్పందం’ ప్రకారం పట్టుబడ్డ యుద్ధఖైదీలను వారి హోదాకు తగ్గట్టుగా గౌరవించాలి.

 కానీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ జపాన్ సైనిక అధికారి కెప్టెన్ సయీ సైనిక ఖైదీలందరినీ ఈ బ్రిడ్జ్ కట్టాలని ఆదేశిస్తాడు. ‘‘మీరు మా బందీలే కాదు, కూలీలు కూడా! మేం చెప్పింది చేయా లి’’ అంటూ హుకుం జారీ చేస్తాడు. కానీ బ్రిటిష్ అధికారి కల్నల్ నికోల్సన్ (నటుడు ఎలక్ గినెస్) దీన్ని వ్యతిరేకిస్తాడు. ‘‘మేము మీ బానిసలం కాదు’’ అని ధిక్కారస్వరం వినిపిస్తాడు. చివరకు కెప్టెన్ సయీ దిగి వస్తాడు. బ్రిడ్జ్ నిర్మాణ పర్యవేక్షణకు నికోల్సన్ అంగీకరిస్తాడు.కానీ ఓ షరతు విధిస్తాడు. ఆ రైల్వే బ్రిడ్జ్‌కి ‘దిస్ వజ్ బిల్ట్ బై ఎలైడ్ ఫోర్సెస్’ అని శాశ్వతంగా రాసి పెట్టాలంటాడు. అయితే, వైరి పక్షంలోని జపాన్ కోసం మనం రైలు వంతెన కట్టడం ఏమిటంటూ, ఈ ప్రతిపాదన  ఎలైడ్ ఫోర్సెస్‌లోని అమెరికా, ఫ్రాన్స్ లాంటి మిగతా దేశాలవారికి ఎవరికీ  నచ్చదు. ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఖైదీలు కొంతమంది తప్పించుకుని పారిపోతారు. వారిలో అమెరికన్ సైనిక అధికారి షియర్స్ (నటుడు విలియమ్ హోల్డెన్) ఒక్కడే తీవ్రంగా గాయపడినా, ప్రాణాలతో మిగులుతాడు.  

సిలోన్‌లో ఆశ్రయం పొందుతున్న షియర్స్‌ను ఇంకో బ్రిటిష్ అధికారి మేజర్ వార్డెన్  (నటుడు జాక్ హాకిన్స్) కలిసి, నిర్మాణం పూర్తయ్యే లోగా సదరు రైలు వంతెనను ధ్వంసం చేయడానికి సహకరించాలని కోరతాడు. అప్పుడు షియర్స్ తాను అసలు అధికారిని కాదనీ, బ్రిటీషు అధికారిని అంతకన్నా కాదనీ, అమెరికాకు చెందిన మామూలు సైనికుణ్ణి అనీ అసలు నిజం చెబుతాడు. ఇలా వే రే అధికారి పేరుతో సౌకర్యాలు అనుభవిస్తున్నవారు శిక్షకు గురవుతారంటూ మేజర్ వార్డెన్ బెదిరిస్తాడు. దీంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆ కుట్రలో షియర్స్ కూడా భాగస్వామి అవుతాడు. షియర్స్, మేజర్ వార్డెన్, కెనడియన్ మిలటరీ అధికారి జాయిస్ - వీళ్ల ముగ్గురూ ఆ కొత్త రైలు వంతెనను ఎలాగైనా కూల్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

మే 12 నాటికి రైలు వంతెన నిర్మాణం పూర్తవుతుంది. 13న ప్రముఖుల రైలు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఇంతలో బ్రిడ్జి మీద పర్యవేక్షణ చేస్తున్న నికోల్సన్‌కు, నీళ్లల్లో పేలడానికి సిద్ధంగా డెటొనేటర్లు కనిపిస్తాయి. దాంతో నికోల్సన్, షియర్స్ బృందంతో తలపడతాడు. చివరకు డెటొనేటర్లు పేలడంతో నికోల్సన్‌తో పాటు అతని నేతృత్వంలో నిర్మించిన వంతెన, ఆ వంతెనపై వెళుతున్న రైలు... భస్మీపటలమవుతాయి. ఆ వంతెనకు వాడిన చెక్క ముక్కలు నది నీళ్లల్లో తేలియాడుతుంటాయి. దాంతో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాలో కథంతా థాయ్‌లాండ్-బర్మా దేశాల సరిహద్దుల్లోని అడవుల్లో జరిగినా, షూటింగ్ మాత్రం శ్రీలంక (అప్పటి సిలోన్)లో చేశారు. చిత్ర నిర్మాణానికి దాదాపు 17 కోట్ల రూపాయలు ఖర్చయితే, బ్రిడ్జ్ నిర్మాణానికే కోటిన్నర ఖర్చు పెట్టారు. కై్లమాక్స్‌లో బ్రిడ్జ్ మీద ఓ రైలును పేల్చి వేస్తారు కదా.

దాన్ని మన దేశంలోని ఓ మహారాజు దగ్గర కొన్నారట.
యుద్ధం చేసే గాయాలు, అకృత్యాలు, యుద్ధ ఖైదీల అగచాట్లు, యుద్ధం కారణంగా బయటికొచ్చే వికృత ధోరణుల్ని చాలా అద్భుతంగా డేవిడ్ లీన్ ఒడిసిపట్టాడు. ఎక్కడా మనకు సినిమా చూస్తున్నట్టే అనిపించదు. ఆ రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లోకి మనల్ని తీసుకుపోయి, అక్కడే కెమెరా పాతేసి, మనకన్నీ ‘ప్రత్యక్ష ప్రసారం లాగా’ చూపించినట్టే అనిపిస్తుంది. ప్రధాన పాత్ర పోషించిన ఎలక్ గినెస్ నటన అసాధారణం. కల్నల్ నికోల్సన్‌గానే మనకు అతను గుర్తుండిపోతాడు.ఈ సినిమా అప్పట్లో 9 విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయ్యి, ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా 7 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టింది. ఎలక్ గినెస్ ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు, బాఫ్తా, గోల్డన్ అవార్డులు కూడా గెలుచుకున్నారు.

పైపైన చూస్తే - ఒక నది మీద బ్రిడ్జ్ కట్టడమే కథలా అనిపిస్తుంది కానీ ఈ సినిమా అసలు ఆత్మ వేరు. ఈ బ్రిడ్జ్ నిర్మాణమంతా ఒకెత్తు అయితే, దీన్ని విధ్వంసం చేయాలనుకోవడం మరొక కోణం. ఈ రెండు వైరుధ్యాల వెనుకా కొన్ని దేశాల, కొన్ని జాతుల సంఘర్షణపూరిత వాతావరణం ఉంది. దేవుడు మానవ జీవితాన్నిచ్చింది ప్రేమించడానికి..! ప్రేమించబడడానికి!! ఈ ప్రకృతిని ఆలంబనగా, ఆసరాగా చేసుకుని మనిషి తన మనుగడ కోసం చేసుకొనే నిర్మాణాన్ని, చివరకు తన మనుగడనే దెబ్బ తీసుకునే విధంగా డిస్ట్రక్షన్ చేసుకోకూడదు.యుద్ధాలు వస్తాయి... పోతాయి. మిగిలిపోయేది నిర్మాణమే! బీ కన్‌స్ట్రక్టివ్... బీ పాజిటివ్...

డోన్ట్ బీ డిస్ట్రక్టివ్... డోన్ట్ బీ నెగిటివ్.
ఈ సకల చరాచర సృష్టిలో మానవుడే అత్యుత్తమమనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు.అందుకే, ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ గుర్తింపు పొందింది. సాంస్కృతికంగా, చారిత్రకంగా, కళాత్మకంగా విశిష్టమైన సినిమాగా దీన్ని గుర్తించి, ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ’లో ఒక కాపీని భద్రపరచడానికి ఈ సినిమాను ఎంపిక చేశారు. విడుదలైన నలభై ఏళ్ళ తరువాత, 1997లో సైతం ఈ ప్రత్యేక గుర్తింపు పొందడం ఈ సినిమా గొప్పదనానికి ఒక మచ్చుతునక. మన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ సినిమా అంటే ఇష్టం. సామ్రాజ్యవాదం ఎంత ప్రమాదకరమో తెలియాలంటే, ఈ సినిమాను ఈ తరం వాళ్లు కచ్చితంగా చూడాల్సిందే.

దృశ్యకావ్యశిల్పి డేవిడ్ లీన్
నలభై ఏళ్ళ కెరీర్... పదహారే సినిమాలు... చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా పేరు... అతి కొద్దిమందికే సాధ్యమయ్యే ఈ గౌరవాన్ని సంపాదించుకున్న అత్యంత పాపులర్ బ్రిటీష్ సినీ రూపకర్త - సర్ డేవిడ్ లీన్ (1908-1991). సాహిత్యం ఆధారంగా ఆయన సృజించిన వెండితెర కావ్యాలన్నీ అద్భుతమైన ఛాయాగ్రహణం, అత్యద్భుతమైన లొకేషన్లతో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసినవే. అంతేకాక, తన సమకాలీన చారిత్రక, సామాజిక మార్పుల ప్రభావానికి ప్రతిబింబాలుగా సినిమాలను తీర్చిదిద్దిన సినీ మేధావి ఆయన. ఇవాళ్టి తరానికి స్టీవెన్ స్పీల్‌బెర్గ్ అభిమాన దర్శకుడు. కానీ, స్పీల్‌బర్గ్ అభిమానించింది మాత్రం డేవిడ్ లీన్‌ని! ఈ దృశ్యకావ్యశిల్పి 1920ల ద్వితీయార్ధంలో క్లాపర్ బాయ్‌గా మొదలై ఎడిటరై, పాతిక సినిమాలకు ఎడిటింగ్ చేసి, ఆ పైన దర్శకుడిగా విఖ్యాత కృషి సాగించారు. ప్రసిద్ధ నవలలు, నాటకాలను వెండితెర కెక్కించి, సాహిత్యానికీ, సినిమాకూ మధ్య వంతెన కట్టారు. ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్’ (1946), ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’ (’62), ‘డాక్టర్ ఝివాగో’ (’65), ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా’ (’84) లాంటివన్నీ ఆయన సినీకృషికి ఉదాహరణలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement