కుర్రాళ్ల ప్రణయగాథ
ప్రముఖ గీత రచయిత డా.వడ్డేపల్లి కృష్ణ ‘ఎక్కడికెళ్తుందో మనసు’ చిత్రం తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి. నర్సింలు పటేల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆర్‌టిఐ చైర్మన్ విజయబాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమా అయినా కథ బాగుంటే పెద్ద విజయం సాధిస్తుంది. చిన్న చిత్రాలను బ్రతికించడానికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు మినీ థియేటర్‌లు నిర్మిస్తున్నాయి.
వీటిని కూడా కొంత మంది కబ్జా చేయాలనే ఆలోచనలో ఉన్నారు’’ అని చెప్పారు. వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఎక్కడికెళ్తుందో మనసు’ చిత్రానికి సరైన ప్రచారం లేక ప్రేక్షకులకు చేరువ కాలేదు. దాదాపు దశాబ్దం తర్వాత ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’ చిత్రాన్ని తెరకెక్కించా. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నవరసాల్ని మిళితం చేసి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించాం. పడుచు కుర్రాళ్ల ప్రణయగాథగా తెరకెక్కిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా తర్వాత వడ్డేపల్లి కృష్ణతో మరో చిత్రం నిర్మిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. సాంబ, కిరణ్, పావని, నటుడు కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.