ఓపెనింగ్ కలెక్షన్లు.. రూ. 680 కోట్లు
ముంబై: హాలీవుడ్ చిత్రం 'ది జంగిల్ బుక్' బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. భారత్ కంటే ఆలస్యంగా నార్త్ అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు 680 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఇక భారత్లో ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో 100 కోట్ల మార్క్ దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1588 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
ఈ సినిమా భారత్ సహా 15 దేశాల్లో 8వ తేదీ విడుదల కాగా, నార్త్ అమెరికాలో 15న విడుదలైంది. హాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా నిలిచింది. ఈ సినిమాకు విశ్లేషకుల ప్రశంసలు, హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. యువకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. జాన్ ఫావ్ రియో దర్శకత్వంతో నిర్మించిన ఈ 3డీ లైవ్ ఫాంటసీ మూవీని.. జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు.