ఆ నిజాల వెనుక కథే దండుపాళ్యం-2
- దర్శకుడు శ్రీనివాసరాజు
క్రైమ్‌థ్రిల్లర్‌గా కన్నడంలో రూపొంది, సంచలన విజయం సాధించిన ‘దండుపాళ్యం’ గుర్తుందిగా! తెలుగులోకి కూడా అనువాదమైన ఈ సినిమా అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ‘‘మొదటి సినిమా ఏదో హిట్ అయింది కదా అని ఇప్పుడీ సీక్వెల్ తీయడం లేదు. నిజంగానే ‘దండుపాళ్యం’ కథకు చాలా స్పాన్ ఉంది. నాలుగు గంటలు ఓ సినిమాకు కేటాయించలేం కాబట్టి, అప్పుడే సీక్వెల్‌కు ప్లాన్ చేసుకున్నా. ఆ కథకు ఒక ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సీక్వెల్ తీయనున్నా’’ అని ఈ తొలి, మలిభాగాల దర్శకుడు శ్రీనివాసరాజు అన్నారు. పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవి కాలే ముఖ్యపాత్రల్లో మూడేళ్ల క్రితం తెలుగులో ‘దండుపాళ్యం’ చిత్రాన్ని విడుదల చేసిన వెంకట్ ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఈ సీక్వెల్‌ను నిర్మించనున్నారు.
ఈ చిత్రం ఈ నెల 24న ప్రారంభం కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మూడేళ్ల క్రితం ‘దండుపాళ్యం’ సినిమా తెలుగులో విడుదల చేసినప్పుడు కొంతమంది ఇది పూర్తి విలక్షణ సినిమా అన్నారు. మేము తీసుకున్న నేపథ్యం అలాంటిది. తీయనున్న సీక్వెల్ కూడా అలాంటిదే. ఇందులోని కొన్ని సన్నివేశాలు చూసేటప్పుడు కాస్త ఇబ్బంది కలిగే మాట నిజమే. కానీ, అసలు సిసలు ఘటనల్ని యథాతథంగా చూపలేదు. ఒకవేళ ఆ ఘోరాలను ఉన్నవి ఉన్నట్లుగా, తెర మీదకు ఎక్కిస్తే ‘దండుపాళ్యం’ బయటకు వచ్చేదే కాదు. ఆ ‘దండుపాళ్యం’లో యథార్థ ఘటనలను తెరకెక్కించాం. ఈ సీక్వెల్‌లో ఆ నిజాల వెనుక దాగి ఉన్న కథను చూపించ నున్నాం’’ అని శ్రీనివాసరాజు పేర్కొన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, బెల్గామ్‌లలో షూటింగ్ జరిపి, సెప్టెంబర్, అక్టోబర్‌లలో విడుదల చేయాలన్నది దర్శక, నిర్మాతల ప్లాన్. ఆ తర్వాత హిందీలో ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మకరంద్ దేశ్‌పాండేలతో ‘దండుపాళ్యం’ చిత్రాన్ని రీమేక్ చే యాలని దర్శకుడు భావిస్తున్నారు. తర్వాత రోజుల్లో ‘కాశీ’, ‘అయోధ్య’ అనే రెండు చిత్రాలను చారిత్రక కథాంశాలతో నిర్మించనున్నానని దర్శకుడు తెలిపారు.. ఇక, నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, ‘‘ ‘దండుపాళ్యం’ సమ్‌థింగ్ స్పెషల్ మూవీ. అందుకే ఈ సినిమా సీక్వెల్‌ను నేనే తీయడానికి సిద్ధపడ్డాను’’ అని తెలిపారు.