బాహుబలి హత్య వెనుక కథ
హైదరాబాద్: సెన్సేషనల్ మూవీ బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలోని ఒకే ఒక్క సీన్తో మరింత ఉత్కంఠను రగిలించాడు ఈ టాలీవుడ్ జక్కన్న. నమ్మిన బంటు కట్టప్ప.. బాహుబలిని హత్య చేసే చిట్ట చివరి దృశ్యంతో జనాలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాజాగా తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ట్విస్ట్‌పై మీడియాలో స్పందించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఒక్కమాటలో సమాధానం చెప్పలేమని, దాని వెనుక పెద్ద కథే ఉందని రాజమౌళి వివరించారు. బాహుబలికి ఎంతో నమ్మకంగా ఉండే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో రెండోభాగంలో చూపిస్తామన్నారు. రెండో భాగమైన 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల అయ్యేవరకు సస్పెన్స్ కొనసాగాల్సిందేనన్నారు.
'బాహుబలి-2' షూటింగులో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల దీనిపై మాట్లాడారు. బాహుబలి 'ది బిగినింగ్'కు బాహుబలి ది కంక్లూజన్' 'సీక్వెల్ కాదని, రెండో భాగం మాత్రమేనన్నారు. ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్లో మొదలైన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుందని, అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. ఇప్పటివరకు బాహుబలి-3 పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్టూన్, గేమ్స్ ఇలా ఏదో ఒక రూపంలో బాహుబలి వార్తల్లో ఉండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న రేపిన ఉత్కంఠ నేపథ్యంలో రెండో పార్టు కచ్చితంగా చూడాలనే ఆసక్తి జనాల్లో మరింతగా పెరిగింది. అటు సోషల్ మీడియాల్లో ఫన్నీ సమాధానాలు, జోక్లు ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.