సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. వీపీఎఫ్ ఫీజులు రద్దు చేయాలనే డిమాండ్‌తో నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చిన నిర్మాతలు.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ సంస్థలకు కంటెంట్ నిలిపివేశారు. దీంతో సాధారణ థియేటర్లతోపాటు మల్టీఫ్లెక్స్‌ల్లోను నేడు సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని 1700 థియేటర్లతోపాటు హైదరాబాద్ లోని 250కిపైగా థియేటర్ల యాజమానులు... నిర్మాతల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. థియేటర్ల ముందు పోస్టర్లు అంటించి ప్రేక్షకులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో థియేటర్లన్నీ వెలవెలబోయాయి.
వర్చువల్ ఫీజు రద్దు చేయడంతో పాటు ప్రకటన నిడివి తగ్గించడం, ప్రతి ఆటకు రెండు కొత్త సినిమాల ప్రచార చిత్రాలను ఉచితంగా ప్రదర్శించాలనే డిమాండ్లతో నిర్మాతలు బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు దిగిరాకపోవడంతో నిరవధికంగా థియేటర్లు బంద్ చేయాలని నిర్మాతతలు భావిస్తున్నారు. ఈ మేరకు థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. నేడు సినిమాల ప్రదర్శన నిలిపివేత కారణంగా ఒక్కో థియేటర్ కనిష్టంగా రూ. 50 వేల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. నిర్మాతలు, డిజిటల్ సర్వీసుల మధ్య నెలకొన్న సమస్యను సతర్వమే పరిష్కరించేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్ల బంద్ పాక్షికంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతల డిమాండ్లపై డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment