సాక్షి, శ్రీనగర్: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించినా.. పార్టీ పేరు గానీ, విధి విధానాలు గానీ ఖరారు చేయలేదు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హిమాలయాలకు పర్యటనకు వెళ్లారు రజనీ. అందులో భాగంగా ముందుగా హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలను రజనీ దర్శించుకుంటున్నారు. శివ్‌ఖోరి, రియాసిలో కొందరు మీడియా ప్రతినిధులు రజనీని కలిసి రాజకీయాలపై ప్రశ్నించారు. ఎంతో చిర్రెత్తుకొచ్చినా రజనీ చాలా ప్రశాంతంగా బదులిచ్చారు.
‘నేను ఆధ్యాత్మిక వ్యక్తిని. జమ్ముకశ్మీర్ నుంచి తర్వాత రిషికేష్ వెళ్తాను. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానో.. ఆ రోజు మీరు అడిగిన రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. అప్పటివరకూ నేను ఏ రాజకీయ ప్రశ్నలు, పరిస్థితులపై స్పందిచాలని భావించడం లేదని’ రజనీ స్పష్టం చేశారు.
కాగా, తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లా, ధర్మశాలను సందర్శించుకున్న రజనీ తర్వాత రిషికేశ్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాజకీయ పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తారని తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment