ఆ తప్పు ఇక్కడ చేయను!
తమిళసినిమా: అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయనంటోంది బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్. లెజెండ్రీ నటుడు దిలీప్‌కుమార్ కుటుంబం నుంచి వచ్చిన ఈ తరం నటి సాయేషా. నటిగా తన రంగప్రవేశానికి ఏరి కోరి టాలీవుడ్‌ను ఎంచుకుని అఖిల్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో సాయేషా ప్రతిభ వెలుగులోకి రాలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా శివాయ్ చిత్రంలో నటించింది.
ఆ చిత్రం ఓకే అనిపించుకుంది. అయినా సాయేషాకు ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు తలుపు తట్టాయట. ఈ రెండు భాషా చిత్రాల అనుభవాన్ని చవి చూసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ జయంరవికి జంటగా వనయుద్ధం చిత్రంలో నటించింది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అయితే ఇందులో హీరో జయంరవికి చాలా తక్కువ మాటలు, సాయేషాకు చాలా ఎక్కువ మాటలు ఉంటాయట. అంతేకాదు, ఇందులో పాటల సన్నివేశాల్లో డాన్స్‌లో సాయేషా కుమ్మేసిందట.
ఆ పాట కొరియోగ్రాఫర్ డాన్సింగ్ కింగ్ ప్రభుదేవానే అబ్బురపడేలా నటించిందట. ఈ టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవడంతో అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే విశాల్, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టార్ చిత్రం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించడానికి ఎంపికైంది.మరో మూడు చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట.
ఇలా కోలీవుడ్‌లో అనూహ్యంగా అవకాశాలు తలుపు తడుతుండడంతో అక్కడ చేసిన తప్పు ఇక్కడ చేయను అంటోంది నటి సాయేషా. ఇంతకీ ఆ తప్పేంటంటే టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదట. ఇప్పుడు కోలీవుడ్‌లో వస్తున్న అవకాశాలను వదులుకునేది లేదని ఈ జాణ అంటోంది. మొత్తం మీద మూడు చిత్రాలకే చాలా ఆరితేరిపోయింది కదూ.