Thippara Meesam Movie Review, in Telugu | Rating (2/5) | తిప్పరా మీసం మూవీ రివ్యూ | Sree Vishnu - Sakshi
Sakshi News home page

తిప్పరా మీసం : మూవీ రివ్యూ

Published Fri, Nov 8 2019 12:59 PM | Last Updated on Fri, Nov 8 2019 7:25 PM

Thippara Meesam Movie Review, Rating in Telugu - Sakshi

టైటిల్‌: తిప్పరా మీసం
జానర్‌: థ్రిల్లర్‌
నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, 
దర్శకుడు: ఎల్‌ కృష్ణవిజయ్
నిర్మాత: రిజ్వాన్‌
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి
డీవోపీ: సిద్‌


వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి  సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? తెలుసుకుందాం పదండి..

కథ:
మణిశంకర్‌ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి  ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.



విశ్లేషణ:
తల్లీకొడుకుల బంధం బేసిక్‌ హ్యూమన్‌ రిలేషన్‌. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు..  చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్‌ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ చేయడానికి డైరెక్టర్‌ దాదాపు ఫస్టాఫ్‌ అంతా సాగదీస్తున్నట్టు  అనిపిస్తుంది. సినిమా మీద ఆసక్తి రేకెత్తించేలా కథనం సాగకపోగా..  మోనిక (నిక్కీ తంబోలీ)తో మణి లవ్‌, తనకు అప్పు ఇచ్చిన బూకీ జోసెఫ్‌తో మణి గొడవ, మణిని అతను ఏడురోజులపాటు బంధించడం ఈ సీన్లన్నీ బిట్లుబిట్లుగా వచ్చిపోయినట్టు అనిపిస్తాయి. డ్రగ్స్‌, మద్యం, స్మోకింగ్‌ అలవాటు వంటి సీన్లు చూపించినా మణి పాత్రలో పెద్దగా నెగిటివ్‌ షెడ్స్‌ ఉన్నట్టు అనిపించదు. అతని కోణంలో ప్రేక్షకుడికి అతనిపై జాలి కలుగుతుంది. పైగా చాలాచోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్‌ డల్‌గా డీల్‌ చేసినట్టు అనిపిస్తుంది.

మదర్‌ సెంటిమెంట్‌తో​ తీసిన సినిమాలు చాలావరకు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్‌ అయ్యే అవకాశముంది. సెకండాఫ్‌లోనూ వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. శ్రీవిష్ణుకు మాస్‌ ఇమేజ్‌ కోసం ఈ సినిమాల్లో అక్కడక్కడ పెద్ద ఫైట్లే పెట్టారు. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్వీస్ట్‌.. మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు అనే అంశాలు ఒకింత ఆసక్తికరంగా ఉన్నాయి. క్లైమాక్స్‌లో మదర్‌ సెంటిమెంట్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ, అప్పటికే సినిమాతో ప్రేక్షకుడు కొంతవరకు డిస్‌ కనెక్ట్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. మరోసారి శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. కథనం ఫ్లాట్‌గా ఉన్నా చాలా సీన్లలో, ముఖ్యంగా మదర్‌ సెంటిమెంట్‌ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్‌ నిక్కీ తంబోలీ పాత్ర కొద్దిసేపు అప్పుడప్పుడు కనిపిస్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సురేశ్‌ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.. నేపథ్య సంగీతం బావుంది. సినిమా నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా ఉన్నాయి. సినిమా టైటిల్‌ ‘తిప్పరా మీసం​’ అంటూ పౌరుషం రేకెత్తించేలా ఉన్నా.. సినిమా మాత్రం మీసం తిప్పేలా లేదు.

బలాలు
మదర్‌ సెంటిమెంట్‌
శ్రీవిష్ణు నటన

బలహీనతలు
స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం
సాగదీత
ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు అంతగా లేకపోవడం


- శ్రీకాంత్‌ కాంటేకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement