టైటిల్: ‘శ్వాగ్’
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు
నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్
రచన-దర్శకత్వం: హసిత్ గోలి
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
ఎడిటర్: విప్లవ్ నైషధం
విడుదల తేది: అక్టోబర్ 04, 2024
వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది.
శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్‌లైన్‌లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.
1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు.
ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది.
ఎవరెలా చేశారంటే..
కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది.
-Rating: 2.75/5
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment