నాకిది చాలా స్పెషల్
‘‘ఈ ‘గీతాంజలి’ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో పాత్ర నచ్చి వెంటనే డేట్లు ఇచ్చేశాను. నా కెరీర్‌లోనే ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అని అంజలి చెప్పారు. అంజలి, శ్రీనివాసరెడ్డి, హర్షవర్థన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్ ముఖ్య తారలుగా కోన వెంకట్ సమర్పణలో రాజకిరణ్ దర్శకత్వంలో ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కోన వెంకట్ మాట్లాడుతూ -‘‘అంజలి ఒప్పుకోకపోయుంటే మేం ఈ సినిమానే చేసి ఉండేవాళ్లం కాదు. హారర్ కామెడీ కథ ఇది. నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందంగారికి ఓ స్పెషల్ రోల్ ఉంటుంది. ఇందులో ఆయన ఓ మంచి రోల్‌తో పాటు, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రాజకిరణ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. నటుడు హర్షవర్థన్, పంపిణీదారుడు హరి తదితరులు కూడా పాల్గొన్నారు.