తమన్, వరుణ్ తేజ్, చిరంజీవి, వెంకీ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బాపినీడు
‘‘తమ్ముడు పవన్‌కల్యాణ్ నటించిన హిట్ చిత్రం ‘తొలిప్రేమ’. ఆ టైటిల్‌తో వరుణ్ చేసిన సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తితో ‘తొలిప్రేమ’ చూశా. పూర్తిగా సంతృప్తి చెందా. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. డైరెక్టర్ వెంకీకి ఇది ఓ ఛాలెంజ్’’ అని నటుడు చిరంజీవి అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రబృందాన్ని చిరంజీవి తన స్వగృహంలో అభినందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘లవ్‌స్టోరీని ఓ కొత్త కోణంలో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెష్‌గా ఉంది. ఇందుకోసం డైరెక్టర్ ఎంతో హార్డ్‌వర్క్ చేశారు. వెంకీ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి రావాలి. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తెలుగులో వస్తున్నాయి కాబట్టే పొరుగు ఇండస్ట్రీలు మన గురించి మాట్లాడుకుంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా ‘తొలిప్రేమ’. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటన పరంగా వరుణ్‌లో చాలా పరిణ తి కనిపించింది. తన హైట్‌కి డ్యాన్సులు కుదురుతాయా? అనుకున్నాం.
కానీ, ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్స్ చాలా బాగా చేశాడు. మా ఫ్యామిలీ అంతా గర్వపడేలా తన నటన ఉంది. రాశీఖన్నా ఈ సినిమాలో చక్కగా నటించారు. నాగబాబు గర్వపడే రోజు ఇది. ‘తొలిప్రేమ’ వంటి హిట్‌ని వరుణ్ ఇచ్చాడు. తమన్ అందించిన పాటలు డ్యాన్స్ చేయాలనిపించేలా ఉన్నాయి. ప్రసాద్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తీశారు. 65రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం గ్రేట్. పక్కా స్క్రిప్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లినప్పుడే ఇది సాధ్యం. ఇండస్ట్రీ వారంతా ఇది తెలుసుకోవాలి.
షూటింగ్ ఎక్కువ రోజులు కాకుండా తక్కువ టైమ్‌లో తీస్తే డబ్బు వృథా కాదు’’ అన్నారు. ‘‘సినిమాలు చేద్దామని 33ఏళ్ల కిందట చెన్నై వెళ్లాను. ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుగారు చిరంజీవిగారి ఇంటికి తీసుకెళ్లారు. ఆయనతో నా పరిచయం నిర్మాత కంటే ఓ అభిమానిగానే జరిగింది. చిరంజీవిగారితో సినిమా చేయకున్నా మెగా ఫ్యామిలీలో పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లతో మంచి హిట్ సినిమాలు చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు బీవీఎస్‌ఎన్ ప్రసాద్.
‘‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ షూటింగ్‌లో చిరంజీవిగారిని చూశా. ఇన్నేళ్లకు ఆయన పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చినా.. మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మా ‘తొలిప్రేమ’ సినిమా చిరంజీవిగారికి నచ్చడం, ఆయన మమ్మల్ని పిలిచి అభినందించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు వెంకీ అట్లూరి.
‘‘సినిమాల్లో నటించాలనే ఆలోచన చిరంజీవిగారిని చూశాక వచ్చింది. మా సినిమా డాడీ (చిరంజీవి)కి నచ్చడం, ఆయన పిలిచి మరీ మా యూనిట్‌ని అభినందించడం సో హ్యాపీ. ఆయన పక్కన కూర్చొని మాట్లాడలేను. ‘తొలిప్రేమ’ సినిమాని బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంకా చూడలేదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఓ మంచి సినిమాని ఆయన హార్ట్‌ఫుల్‌గా అభినందించడం గ్రేట్’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment