హాలీవుడ్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఐదు రోజుల క్రితం స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ తమ కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. మరో తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. మంగళవారం నటుడు క్రిస్టోఫర్ హివ్జు కూడా తన బ్లడ్ శాంపిల్‌లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ‘ది వెండీ ఎఫెక్ట్’, ‘ది లాస్ట్ కింగ్’, ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’, ‘డౌన్‌హిల్’ తదితర చిత్రాల్లో నటించారు క్రిస్టోఫర్. టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో చేసిన టోర్ముండ్ పాత్ర ద్వారా క్రిస్టోఫర్ చాలా పాపులర్. ‘‘నేను, నా కుటుంబ సభ్యులు ప్రస్తుతం మా అంతట మేం గృహనిర్భందంలో ఉన్నాం. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు కొంచెం జులుబు ఉంది. కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్–19 ప్రమాదకరమైన వైరస్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు క్రిస్టోఫర్ హివ్జు.
నటుడు ఇద్రిస్ ఎల్బా కూడా కోవిడ్ 19 వైరస్ సోకినట్లు తెలిపారు. ‘లూథర్’, ‘ది వైర్’ తదితర చిత్రాల్లో నటించారు ఎల్బా. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇంటి నుంచి బయటకు రావడంలేదని పేర్కొన్నారు. వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా ఉండటం వల్ల తనకు కూడా సోకిందేమోననే అనుమానంతో టెస్ట్ చేయించారట ఎల్బా. పాజిటివ్ రావడంతో ఇంటికి పరిమితం అయ్యారు. ‘‘ఇది మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు ఇద్రిస్ ఎల్బా.
‘ఫ్రోజెన్ 2’, ‘హ్యాపీ డెత్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ తార రేచెల్ మాథ్యూస్ తనకు కోవిడ్ 19 టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘వైరస్ సోకిందని తెలియగానే వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే డాక్టర్లు చెప్పేవరకూ ఇంటి నుంచి బయటకు రాకూడదనుకుంటున్నాను. ఈ వ్యాధి గురించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే కరోనా బారిన పడ్డాను కాబట్టి ఈ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’’ అన్నారు రేచెల్.
Comments
Please login to add a commentAdd a comment