భాయ్‌.. బాలీవుడ్‌ను బతికించాడు! | 'Tiger Zinda Hai', 'Baahubali 2': 2017's box-office hits were all about sequels | Sakshi
Sakshi News home page

భాయ్‌.. బాలీవుడ్‌ను బతికించాడు!

Dec 28 2017 12:40 AM | Updated on Apr 3 2019 6:23 PM

'Tiger Zinda Hai', 'Baahubali 2': 2017's box-office hits were all about sequels - Sakshi

ప్రతిసారీ రంజాన్‌కు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఒక సినిమా రావడం, అది సూపర్‌హిట్‌ అవ్వడం సర్వసాధారణం. ఈ ఏడాది జూన్‌లో, రంజాన్‌ సీజన్లో ‘ట్యూబ్‌లైట్‌’ అనే సినిమాతో వచ్చాడు సల్లూభాయ్‌! అయితే అది డిజాస్టర్‌. సల్మాన్‌ ఖాన్‌ సినిమా పరిస్థితి ఇలా అయినా మిగతా సినిమాలన్నా ఆడతాయిలే అనుకున్నారంతా! కానీ ఆ మిగతా సినిమాలూ అంతంతే ఆడాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ డీలా పడిపోయింది. తెలుగు సినిమా ‘బాహుబలి–2’ అక్కడ డబ్‌ అయి పెద్ద హిట్‌ అవ్వడం తప్పితే, స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఉన్నవాటిల్లో బాగా ఆడిందంటే, ఒక్క ‘గోల్‌మాల్‌ అగైన్‌’ మాత్రమే!

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు 2017 బ్యాడ్‌ ఇయర్‌ అని ట్రేడ్‌ చెప్పుకుంటూ ఉంటే, మళ్లీ భాయే స్వయంగా వచ్చి కొత్తగా ఊపిరి పోశాడు. అదీ తన కొత్త సినిమా ‘టైగర్‌ జిందా హై’తో! జూన్‌లో పోతోనేమి, డిసెంబర్‌లో వచ్చి బాక్సాఫీస్‌ను గట్టిగానే కొల్లగొడుతున్నాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ సినిమా అయిన ‘టైగర్‌ జిందా హై’ గత శుక్రవారం విడుదలై, అందరి అంచనాలను అందుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ గత చిత్రం ‘ట్యూబ్‌లైట్‌’ ఇండియాలో మొత్తం రన్‌లో 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, ‘టైగర్‌ జిందా హై’ ఐదే ఐదు రోజుల్లో 173.07 కోట్ల రూపాయల నెట్‌ వసూళ్లు రాబట్టింది.

క్రిస్మస్‌ లాంగ్‌ వీకెండ్‌ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వంద కోట్ల క్లబ్‌లో ఎక్కువ సినిమాలున్నా (12) స్టార్‌గా సల్మాన్‌ ఖాన్‌ అవతరించాడు. వీక్‌డేస్‌లోనూ కలెక్షన్స్‌ ఏమాత్రం తగ్గకపోవడంతో మూడువందల కోట్ల క్లబ్‌లోనూ ‘టైగర్‌ జిందా హై’ చేరుతుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఇప్పటికే సల్మాన్‌ ఖాతాలో రెండు మూడు వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలున్నాయి. అవి భజ్‌రంగీ భాయ్‌జాన్‌ (320.34 కోట్లు), సుల్తాన్‌ (300.45 కోట్లు).

డబుల్‌ సెలెబ్రేషన్‌..!
ఇక ‘టైగర్‌ జిందా హై’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూంటే, సల్మాన్‌ఖాన్‌ ఆనందానికి అవధుల్లేవు. ఈ జోరులోనే ఆయన తన పుట్టినరోజును (డిసెంబర్‌ 27) కూడా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. సన్నిహితులు, ‘టైగర్‌ జిందా హై’ టీమ్‌తో కలిసి తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌ బర్త్‌డే చేసుకున్నాడు.

బర్త్‌డే సర్‌ప్రైజ్‌..!
బర్త్‌డే సందర్భంగా తాను కొత్తగా చేయబోతున్న సినిమాను అనౌన్స్‌ చేసి, అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు సల్మాన్‌. ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’లతో తనకు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన అలీ అబ్బాస్‌ జాఫర్‌తోనే సల్మాన్‌ కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘భరత్‌’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. అతుల్‌ అగ్నిహోత్రి, భూషణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భాయ్‌ సెంటిమెంట్‌ ప్రకారం.. అభిమానులకు పండగ కానుకగా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది.



                             కేక్‌ కట్‌ చేస్తూ...

                                 కత్రినాతో...

                 ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement