అహ్మద్ దర్శకత్వంలో జయంరవి
తమిళసినిమా: జయంరవి, యువ దర్శకుడు అహ్మద్ కాంబినేషన్‌లో ఒక భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. యువ నటుడు జయంరవి తన చిత్రాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోమియో జూలియట్ చిత్రం నుంచి తనీఒరువన్ వరకూ డబుల్ హ్యాట్రిక్ కొట్టిన జయంరవి తాజాగా టిక్ టిక్ టిక్ అనే అంతరిక్షంలో సాగే ఇతివృత్తంతో కూడిన కథా చిత్రంలో నటిస్తున్నారు.
శక్తిసౌందర్‌రాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. నివేద పేతురాజ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కాగా తదుపరి ఆర్యతో కలిసి చారిత్రాత్మక చిత్రం సంఘమిత్రలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం తరువాత జయంరవి దర్శకుడు అహ్మద్ కాంబినేషన్ ఒక భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కనుంది. అహ్మద్ ఇంతకు ముందు వామనన్, ఎండ్రేండ్రు పున్నగై, మనిధన్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం.