
సర్కార్ మూవీ : విజయ్ ఫస్ట్‌లుక్
ఇళయదళపతి విజయ్ పుట్టినరోజు(జూన్ 22) కానుకగా గురువారం సాయంత్రం కొత్త సినిమా టైటిల్‌ను, విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కళ్ల జోడుతో, సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ మాస్‌లుక్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ప్రస్తుతం విజయ్ ఫొటోపై ‘తమిళనాడు ఫోరం ఫర్ టొబాకో కంట్రోల్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పొగాకు నిషేధ చట్టాన్ని ఉల్లంఘించారని ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ హీరో అయి ఉండి ఇటువంటి దురలవాట్లను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
టొబాకో ఫోరం సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రముఖ హీరో విజయ్ ‘సర్కార్’ ఫస్ట్ లుక్ చూశాం. సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం ప్రకారం(కోప్టా).. ధూమపానానికి సంబంధించిన ఫొటోలు పోస్టర్లలో, ప్రచార కార్యక్రమాల్లో ప్రచురించడం నిషేధం. గతంలో కూడా విజయ్ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఆ సమయంలో విజయ్, సంబంధిత మూవీ టీమ్ క్షమాపణలు చెప్పారు. కానీ మళ్లీ అదే తప్పును పునరావృతం చేశారు. ప్రస్తుతం విజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సీబీఎఫ్‌సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కు ఫిర్యాదు చేయబోతున్నాం. యువతను ప్రభావితం చేసే సినిమా వంటి మాధ్యమాల్లో ఇటువంటి దురలవాట్లను ప్రోత్సహించవద్దని తమిళ సినిమా పరిశ్రమను కోరాం. కానీ వారి నుంచి స్పందన కరువైందని’ ఆవేదన వ్యక్తం చేశారు.