
ఆ ఇద్దరితో చిత్రానికి రెడీ
వృత్తిపరంగా నువ్వా నేనా అని పోటీ పడుతున్న అజిత్, విజయ్ హీరోల కలయికతో చిత్రం తెరకెక్కించడానికి తాను సిద్ధమని ప్రముఖ దర్శక నిర్మాత ఎ.ఆర్.మురుగదాస్ పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే ఎ.ఆర్.మురుగదాస్ ఆరంభంలోనే అజిత్‌కు దీనా వంటి సూపర్ హిట్ ఇచ్చారు. ఇక విజయ్‌కి ఇటీవలే తుపాకీ చిత్రంతో గన్‌లాంటి సక్సెస్ ఇచ్చారు. ప్రస్తుతం కత్తి లాంటి విజయాన్నివ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ దర్శకుడంటే ఆ ఇద్దరు హీరోలకు గౌరవమే. రాజావిన్ పార్వైయిలే చిత్రంలో విజయ్, అజిత్ కలిసి నటించారు. ఆ తర్వాత సోలో హీరోలుగా ఎదిగారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో కమల్, రజనీ తర్వాత ఆ స్థాయిలో స్టార్‌డమ్‌తో వెలుగొందుతున్నారు. అలాంటి స్టార్స్ కలయికలో చిత్రం రావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. అలాగే ఈ క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం చెయ్యడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
ఆ మధ్య నిర్మాత జె.అన్బళగన్ విజయ్, అజిత్‌తో చిత్రం చెయ్యడానికి రెడీ అంటూ ప్రకటించారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. కారణాలేమైనా అది జరగలేదు. ప్రస్తుతం అజిత్, విజయ్ ఓకే అంటే వారి కలయికలో చిత్రం చెయ్యడానికి తాను సిద్ధం అంటున్నారు ప్రముఖ దర్శక నిర్మాత ఎ.ఆర్ మురుగదాస్.
అంతేకాదు రెండు నెలలు సమయం ఇస్తే వారి కోసం బ్రహ్మాండమైన కథ తయారు చేస్తానని, ఆ ఇద్దర్ని నటింపజేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోలు కలిసి నటించే ట్రెండ్ కొంతకాలం క్రితం నుంచే కొనసాగుతోంది. టాలీవుడ్‌లోను ఆ ట్రెండ్ మొదలైంది. కోలీవుడ్‌లోను ఆ పరిస్థితి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.