విజయమే లక్ష్యంగా..
⇒నేడు పంజాబ్‌తో తలపడనున్న సన్‌రైజర్స్
⇒ఉత్సాహంలో హైదరాబాద్
⇒పుంజుకోవాలని కింగ్స్ తపన
మొహాలీ: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాయి గడ్డపై గెలుపే లక్ష్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో శుక్రవారం తలపడనుంది. సన్‌రైజర్స్ సాధించిన నాలుగు విజయాలు సొంతగడ్డ హైదరాబాద్‌లో లభించనివే కావడం విశేషం. ఈక్రమంలో పంజాబ్ గడ్డపై విజయం సాధించాలని వార్నర్‌సేన యోచిస్తోంది. మరోవైపు తాము ఆడిన చివరిమ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన పంజాబ్.. ఇదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది.
హైదరాబాద్ దూకుడు..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆకట్టుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన వార్నర్‌సేన నాలుగు విజయాలు నమోదు చేయగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో తొమ్మిది పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. సన్‌రైజర్స్ ఓడిన మూడు మ్యాచ్‌లు పరాయిగడ్డపై జరిగినవే కావడం విశేషం. దీంతో ఈ సీజన్‌లో సొంతగడ్డపై పులిలా విరుచుక పడుతోన్న సన్‌రైజర్స్ వేరే వేదికలపై మాత్రం తడబడుతోందనే అపప్రథను మూటగట్టుకుంది. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి అన్ని వేదికలపై రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని వార్నర్‌సేన యోచిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూల స్తంభంలా నిలిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో 282 పరుగులు చేసిన వార్నర్ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (235 పరుగులు), ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ (193 పరుగులు) రాణిస్తున్నారు. అయితే డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లాడిన యువీ.. కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలిమ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై మాత్రం 62 పరుగులు చేసిన యువీ.. మిగతా మ్యాచ్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు. వీలైనంత త్వరగా యూవీ గాడిన పడాలని జట్టు ఆశిస్తోంది. ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కేన్ విలియమ్సన్ 110 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీపక్ హుడా, నమన్ ఓజా తమ బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగానికొస్తే టోర్నీలో అత్యుత్తమ బౌలర్లు సన్‌రైజర్స్ సొంతం. ఏడు మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ కుమార్ 16 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఆఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ పదివికెట్లతో ఆకట్టుకుంటున్నాడు.
బిపుల్ శర్మ, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ్ కౌల్ ఫర్వాలేదనిపిస్తున్నారు. వీరిలో ఒకరి స్థానంలో వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా బరిలోకి దిగవచ్చు. మరోవైపు యువరాజ్ సింగ్, సిద్ధార్థ్ పంజాంబ్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడి ఉండడంతో వారి అనుభవం వార్నర్‌సేకు ఉపకరించగలదు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఐదు పరుగుల స్వల్పతేడాతో సన్‌రైజర్స్ నెగ్గింది. మరోవైపు టోర్నీలో ఇరుజట్ల ముఖాముఖిపోరులో ఎనిమిదిసార్లు తలపడగా.. సన్‌రైజర్స్ ఆరుసార్లు విజయం సాధించగా.. పంజాబ్ రెండుమ్యాచ్‌ల్లో గెలుపొందింది. 2014 తర్వాత సన్‌రైజర్స్‌పై లీగ్ దశలో పంజాబ్ నెగ్గలేకపోవడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది.
పంజాబ్‌కు చావోరేవో..
మరోవైపు ఈ సీజన్‌లో పంజాబ్ ప్రస్థానం ఎగుడుదిగుడుగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో రెండు వరుస విజయాలు సాధించిన పంజాబ్.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. అయితే గుజరాత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న పంజాబ్.. పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం విజయం సాధిస్తే పట్టికలో నాలుగోస్థానానికి ఎగబాకుతుంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హషీమ్ ఆమ్లా టాప్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 60 బంతుల్లోనే 104 పరుగులు చేసి విధ్వంసక సెంచరీని నమోదు చేశాడు. ఆమ్లా దూకుడుతో పంజాబ్ భారీ స్కోరు సాధించినా.. బౌలర్ల వైఫల్యంతో మ్యాక్స్‌వెల్‌సేనకు ఓటమి తప్పలేదు.
ఓవరాల్‌గా ఏడు మ్యాచ్‌ల నుంచి 299 పరుగులతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా ఆమ్లా నిలిచాడు. కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (193 పరుగులు), మనన్ వోహ్రా (176 పరగులు), అక్షర్ పటేల్ (122 పరుగులు) ఫర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు విదేశీ ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, షాన్ మార్‡్ష, ఇయాన్ మోర్గాన్ స్థాయికితగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోతున్నారు. ఈక్రమంలో జట్టు కూర్పులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఈ సీజన్‌లో పంజాబ్ బౌలర్లు సాదాసీదాగా ఉన్నారు. స్పిన్నర్ అక్షర్‌పటేల్ ఎనిమిది వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. సందీప్ శర్మ, మోహిత్ శర్మ వికెట్లు తీస్తున్నా ప్రత్యర్థులకు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
భారత బౌలర్ ఇషాంత్ శర్మ మూడు మ్యాచ్‌లాడిన ఒక్క వికెట్ కూడా తీయడంలో విఫలమయ్యాడు. సాధ్యమైనంత త్వరగా తమ బౌలింగ్ విభాగం గాడిలో పడాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. గుజరాత్‌తో ఆడిన చివరిమ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన పంజాబ్.. 26 పరుగులతో విజయం సాధించింది. ఇదే జోరును కొనసాగించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. నాకౌట్ దశకు చేరాలంటే రాబోయే మ్యాచ్‌లు తమకు కీలకమని జట్టు మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగైదింటిలో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించవచ్చని పేర్కొన్నాడు.