వార్నర్ ఖాతాలో మరో అరుదైన ఫీట్
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసిన వార్నర్, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన విధ్వంసకర ఓపెనర్ వార్నర్ ఓ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ జట్టుపై వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ అర్ధశతకాన్ని నమోదుచేసి.. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో మరే ఇతర ఆటగాడు ఓ జట్టుపై ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించలేదు.
నేటి మ్యాచ్‌లో 51 పరుగులు చేసిన వార్నర్.. గత ఐదు ఇన్నింగ్స్‌లలో వరుసగా 58, 81, 59, 52, 70 (నాటౌట్) అర్ధ శతకాలు చేశాడు. తన చివరి ఏడో ఇన్నింగ్స్‌లోనూ వార్నర్ విఫల కాలేదు. ఆ మ్యాచ్‌లో 44 పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించడం విశేషం.
చివరగా ఈ నెల 17న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 159 పరుగులు చేసింది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ (4-0-19-5) అద్భుత ప్రదర్శనతో రాణించడంతో ఆ మ్యాచ్‌లో పంజాబ్‌పై 5 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచిన విషయం తెలిసిందే.