తెలుగు జాతి గర్వపడాలి!
‘‘రామానాయుడు లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన మన పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి’’ అని దాసరి వ్యాఖ్యానించారు. రామానాయుడు గురించి సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన ‘మూవీమొఘల్’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని కృష్ణకు అందించారు. సినిమా పరిశ్రమకు రామానాయుడు మరువలేని సేవలందించారని కృష్ణ పేర్కొన్నారు.
తనపై మంచి పుస్తకాన్ని రూపొందించినందుకు రామానాయుడు ఆనందం వెలిబుచ్చారు. భావితరాలకు తెలుగు సినిమా చరిత్రను అందించే ఉద్దేశంతోనే వరుసగా పుస్తకాలు వెలువరిస్తున్నానని రచయిత వినాయకరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి, బి. గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్. శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సారిపల్లి కొండలరావు తదితరులు మాట్లాడారు.